జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరచూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రత్యర్థులు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్ ప్రస్తావించడాన్ని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాను విమర్శిస్తున్న సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ… పెళ్లిళ్ల విషయానికి వచ్చే సరికి వెనకేసుకు రావడం విశేషం.
సీఎం జగన్ పదేపదే పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని నారాయణ తప్పు పట్టారు. మూడు పెళ్లిళ్లు తప్పు, బాబాయిని హత్య చేయడం తప్పు కాదా? అని సీఎం జగన్‌ను నారాయణ నిలదీశారు. మూడు పెళ్లిళ్లా? హత్యలా? ఈ రెండింటిలో ఏది ప్రమాదమో తేల్చాలని నారాయణ డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని నారాయణ నిలదీశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో వుండి ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శించడం ఏంటని నారాయణ ప్రశ్నించారు. ఇది రాజకీయంగా దిగజారడమే అని ఆయన విమర్శించారు. రాజకీయంగా ఎవరినైనా విమర్శించొచ్చని నారాయణ అన్నారు. కానీ వ్యక్తిగత దూషణలతో నిందలు వేయడం మాత్రం సరైంది కాదని ఆయన హితవు చెప్పారు. రాజకీయంగా బలం లేనందువల్లే జగన్ ఇలా వ్యక్తిగత విషయాల గురించి విమర్శిస్తున్నారని నారాయణ అన్నారు.
ఎన్డీఏకు పవన్ దగ్గర కావడాన్ని తీవ్రంగా తప్పు పట్టిన నారాయణ, ఆయన పెళ్లిళ్ల గురించి సీఎం జగన్ తప్పు పట్టడాన్ని మాత్రం సమర్థించకపోవడం గమనార్హం. అటు, ఇటు వ్యక్తిగతంగా దూషించుకోవడంపై జనంలో ఒక రకమైన అసహనం ఏర్పడింది. చేతికి మైకు దొరికితే చాలు ప్రత్యర్థులపై ఎంత ఘాటైన విమర్శ చేయడానికి కూడా నాయకులు వెనుకాడడం లేదు. ఈ ధోరణి ఒక పార్టీకే పరిమితం కాలేదు. అన్ని పార్టీలో అదే పంథాలో నడుస్తున్నాయి. చివరికి ఇతరులకు నీతులు చెప్పే నారాయణ కూడా అప్పుడప్పుడు నోరు జారుతూ, తనే క్షమాపణలు చెప్పడం అనేక సందర్భాల్లో చూశాం.