మణిపూర్ దుర్ఘటనలపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. అలాగే పార్లమెంట్ ఉభయ సభలు స్తంభింస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు అవుతోంది. మణిపూర్ దుర్ఘటనలపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదో చెప్పబోతే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మణిపూర్‌లో అసలేం జరుగుతున్నదో ఉభయ సభల్లో చర్చించాల్సిందే అని విపక్షాలు పట్టుబట్టాయి.
అయినప్పటికీ మోదీ సర్కార్ ఖాతరు చేయడం లేదు. మరోవైపు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ మొండి వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గట్టి మద్దతు ఇచ్చారు.
పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డు తగలడాన్ని తమ పార్టీ సమర్థించిందని విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మణిపూర్‌పై ఉదంతాలపై చర్చకు సిద్ధమని ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. మణిపూర్‌లో విదేశీ శక్తులు చొరబడి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయనే అనుమానాలు రేకెత్తడాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సీరియస్ కామెంట్స్ చేశారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన మణిపూర్ ఇష్యూపై కేంద్ర హోంశాఖ సీరియస్ దృష్టి పెట్టిందన్నారు.
మణిపూర్ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉన్నప్పుడు ఉభయ సభలను స్తంభింపచేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ఎటు వైపు వుంటుందో విజయసాయిరెడ్డి కామెంట్స్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.