సినిమాల నుంచి సమంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలా కారవాన్ కు టాటా చెప్పిన ఈ బ్యూటీ.. ఆ వెంటనే కోయంబత్తూర్ లో వాలిపోయింది. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. అలా మానసికంగా సాంత్వన పొందిన సమంత, ఇప్పుడు ఇండోనేషియాలో ల్యాండ్ అయింది.
ఇలా దిగిన వెంటనే అలా తన సోషల్ మీడియా హ్యాండిల్ కు పని పెట్టింది. వరుసగా తన ట్రిప్ ఫొటోల్ని షేర్ చేస్తోంది. ముందుగా బాలిలో ఆమె దిగింది. అక్కడ అందమైన లొకేషన్లలో వెనక నుంచి దిగిన ఫొటోల్ని పోస్ట్ చేసింది. అదే టైమ్ లో బాలిలో కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాల్ని కూడా చేసింది.
ఆ తర్వాత అట్నుంచి అటు ఉలువాటు చేరుకుంది. అక్కడి అందమైన సముద్రతీరాల్లో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. అక్కడున్న కోతులు తన సన్ గ్లాసెస్ ను ఎత్తుకుపోయాయనే విషయాన్ని కూడా వెల్లడించింది.
బస చేసిన హోటల్, వేసుకున్న దుస్తులతో పాటు.. తింటున్న ఆహారం, తాగుతున్న కాఫీకి సంబంధించిన పిక్స్ ను కూడా ఆమె విడిచిపెట్టకుండా పోస్టు చేస్తూనే ఉంది.
ఖుషి సినిమా షూటింగ్ పూర్తిచేసిన సమంత, తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. కొత్త సినిమాలకు ఆమె కమిట్ అవ్వలేదు. ఇందులో భాగంగానే ఆమె తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తూనే, ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి ఆమె కోలుకున్న సంగతి తెలిసిందే.