పంచ్ పటాస్ : ఎర్రగడ్డ అడ్డా

గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకున్నట్లు ఎర్రగడ్డ అనగానే చాలా గవర్నమెంట్ డిపార్ట్ మెంట్లు భుజాలు తడుము కోవటం సహజం. ఎందుకంటే ఎర్రగడ్డ ఒకప్పుడు హైదరాబాద్ వాస్తవ్యులకి కొంచెం కలవరం కలిగించే బస్తీ. ఎర్రగడ్డ…

గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకున్నట్లు ఎర్రగడ్డ అనగానే చాలా గవర్నమెంట్ డిపార్ట్ మెంట్లు భుజాలు తడుము కోవటం సహజం. ఎందుకంటే ఎర్రగడ్డ ఒకప్పుడు హైదరాబాద్ వాస్తవ్యులకి కొంచెం కలవరం కలిగించే బస్తీ. ఎర్రగడ్డ అనగానే ముందు గుర్తుకొచ్చేది మెంటల్ హాస్పిటల్. మెంటల్ పేషెంట్స్ అందర్నీ ఆ హాస్పిటల్లో ఉంచేవాళ్ళు. ఆ హాస్పిటల్ చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ ఉండేది. ఇప్పుడు ఆ గోడ చాలాచోట్ల పడిపోవడం. లేదా శిధిలావస్థకు చేరుకోవడంతో ఆ పేషెంట్స్ ఇప్పుడు దేశమంతా విస్తరించారు.

వాళ్ళు దేశంలో అన్నిరంగాలలోనూ అన్ని డిపార్ట్ మెంట్స్‌లోనూ చేరిపోబట్టే. (ఎక్కువ మంది రాజకీయాల్లో సెటిలయారన్న విషయం మీకు తెలిసిందే) మనం ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. 

వాళ్ళ వల్ల ఎక్కువగా ప్రభావితమైన విభాగం ఏమిటి అని మీరు ప్రశ్నించుకుంటే ముందు మనకు గుర్తు కొచ్చేది టీవీ చానల్స్. అవి ఎంత మెంటలో అవి టెలికాస్ట్ చేసే ప్రోగ్రామ్స్ చూస్తే తెలిసిపోతుంది. కానీ ఆ ప్రోగ్రామ్స్ చూస్తే మెంటల్ రావడం ఖాయం గనుక చాలామంది చూడరు.

అయినా మీరు రిస్క్ తీసుకుని మన టీవీ చానల్స్‌లో. ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో. పైన.. కింద పక్కలకీ కనిపించే స్క్రోలింగ్ మేటర్‌ని అబ్జర్వ్ చేస్తే పై స్టేట్మెంట్కి నూటికి నూటపది మార్కు లేస్తారు.

ఒకప్పుడు స్క్రీన్ అంతటా ఒకే బొమ్మ కనబడేది. ఇప్పుడు బొమ్మలో బొమ్మ.. బొమ్మ పైన బ్రాండింగూ, బొమ్మలెఫ్ట్ సైడ్ సినిమా యాడ్, రైట్ సైడ్ వ్యాపార ప్రకటన.. కింద బ్రేకింగ్ న్యూస్.. దానికింద తాగిన మైకంలో పెళ్ళాన్ని గొంతు పిసికి చంపిన భర్త.. లాంటి స్క్రోలింగ్లూ, దానికింద ఆ బంగళాలో నిజంగా దయ్యం ఉందా.. రాత్రి తొమ్మిదింటికి లాంటి స్క్రోలింగ్లూ, అంటే వేసేవాడితో పాటు చూసేవాడిక్కూడా మెంటల్ రావటం గారంటీ.

దీనికితోడు ఇంకో న్యూసెన్స్ ఏంటంటే వాటిల్లో వచ్చే మేటర్‌కి ఫినిషింగ్ ఉండదు.. ఏ మేటర్ సగంలో కట్ అయి ఇంకోటి సగంలో స్టార్ట్ అవుతుందో ఎవడికీ తెలీదు.

హయత్‌నగర్‌లో ఆటోని ఢీ కొట్టిన బీఫ్ ఫెస్టివల్.. యూసఫ్‌గూడలోని ఓ అపార్ట్ మెంట్ రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోన్న వ్యభిచార ముఠా కార్మికులకు ప్రభుత్వం ప్రోత్సాహ కాలతోపాటు చేయూతనివ్వాలని పలువురు నాయకులు డిమాండ్ చేసారు. వర్షాభావ పరిస్థితులవల్ల దేశం యావత్తూ 36 కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించాలని నేటి కాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. వచ్చే దసరా వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోవాలని.. ఇద్దరు విద్యార్ధినులను కిడ్నాప్ చేసి జరిపిన అత్యాచారంలో పెద్దెత్తున కల్తీ జరిగినట్లు ఆరోగ్యశాఖ నిర్ధారించింది.

పోలీసులు జరిపిన కార్డన్ సెర్చ్‌లో పట్టు బడిన.. అమెరికన్ అధ్యక్షులు బారక్ ఒబామా.. తిరిగి తప్పించుకు పారిపోయినట్లు.. ఐక్య రాజ్య సమితి తీర్మానించింది.

దేశం కోసం అహర్నిసలూ శ్రమిస్తోన్న గాలి జనార్ధనరెడ్డి జగన్‌లకు పద్మ భూషణ్ ఇవ్వాలని.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఅయ్ కోర్ట్‌ని కోరింది.

రాయల సీమలో తిరిగి పడగ విప్పిన ఫాక్షన్ యుద్ధంలో.. ఫ్రాన్స్ అధ్యక్షుడు పాల్గొని ఆ వేడుకలని తిలకించారు. బాబా రాందేవ్ స్వయంగా.. వేట కొడవళ్ళతో వెంటాడి పదహారు మంది ప్రత్యర్ధులను హతమార్చినట్లు.. యోగా శిక్షణా తరగతులు నిర్వహించిన నిర్వాహకులు తెలియజేస్తూ బస్‌లోనే ఒక స్త్రీ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల్ని కన్నట్లు.. ఆ సంఘటనలో.. జూనియర్ ఎన్టీఆర్‌తో ముఖా ముఖీ కార్యక్రమం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహిస్తారు.
ఇటువంటి అవాంచనీయ సంఘటనలు నివారించడానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు చొరవ తీసుకుని.. రేవ్ పార్టీల్లో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్న బాంబే బంగ్లాదేశ్ డాన్సింగ్ అమ్మాయిలను.. చౌక ధరల డిపోల ద్వారా బీద ప్రజలకు రేషన్ కార్డ్ ద్వారా సప్లై చేయాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేసారు.

అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులకూ, బ్యూరోక్రాట్స్‌కూ, జికా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి.. బిచ్చగాళ్ళ సంఘం తమ సూచనలను ప్రభుత్వానికి అందజేసింది.

ఇలా టీవీ చానల్స్ అన్నీ తమ వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకు లందర్నీ.. మానసిక రోగులుగా మారడానికి దోహదం చేస్తోన్నట్లు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ శ్రీజేకబ్ జో వాషింగ్టన్‌లో అధికారులు నిర్వహించిన డ్రైవ్‌లో ఎల్బీనగర్ పరిధిలో 74 పిచ్చికుక్కల్ని పట్టుకుని వాటిని పక్కనే ఉన్న హస్తినాపురం కాలనీలో వదిలేసారు.

ఇలా ఈ మెంటల్ స్క్రోలింగ్‌కి అంతం లేదు. ఉండదు.