అలాంటి రాజమౌళికి పద్మశ్రీ నా..!

కమలం పార్టీ నేతలు ఎలాంటి వారంటే… వీరు వేలంటైన్ సంస్కృతికి వ్యతిరేకం, ఆడవాళ్లు పబ్బుల్లోకి ప్రవేశిస్తే.. వారిని తన్ని బయటకు పంపడానికి కూడా ఈ కాషాయధారులు వెనుకాడరు. భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం…

కమలం పార్టీ నేతలు ఎలాంటి వారంటే… వీరు వేలంటైన్ సంస్కృతికి వ్యతిరేకం, ఆడవాళ్లు పబ్బుల్లోకి ప్రవేశిస్తే.. వారిని తన్ని బయటకు పంపడానికి కూడా ఈ కాషాయధారులు వెనుకాడరు. భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం వీరు ప్రాణమిస్తారు! ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను పుట్టినిల్లుగా కలిగిన బీజేపీ నేతల శ్రద్ధ గురించి ఎంత చెప్పినా తక్కువే! మరి ఇలాంటి నేతలు ఏలుతున్న ప్రభుత్వం రాజమౌళి వంటి దర్శకుడికి పద్మ శ్రీ అవార్డు ఇవ్వడం పట్ల ఒకింత నిరసన భావాన్నే వ్యక్తం చేస్తున్నారు హిందుత్వవాదులు. హిందుత్వ వాదులు అంటే.. వీళ్లు మోడీ మద్దతుదారులు కాదు, బీజేపీ రాజకీయాలు చేసే వాళ్లు కాదు.. జస్ట్ హిందుత్వవాదులు అంతే! 

మరి రాజమౌళి విషయంలో వీరి అభ్యంతరాలు ఏమిటంటే… ఆయన సినిమాల్లో ఉండే బూతు పురాణాన్ని ప్రస్తావిస్తారు. రాజమౌళి సినిమాలను వీళ్లు తప్పుపట్టడం లేదు, ఆయన దర్శకత్వ ప్రతిభను శంకించడం లేదు… ఆయనను హాలీవుడ్ దర్శకులతో పోల్చినా.. ప్రపంచంలో అంతకు మించిన మేధావి లేడు అని ఎవరైనా నొక్కి వక్కాణించినా.. ఆ విషయాల్లో వీరికి అభ్యంతరాలు లేవు. ఎటొచ్చీ ఆయన సినిమాల్లో ఉండే కంటెంట్.. ప్రత్యేకించి శృంగార రసాన్ని ఆయన ఆవిష్కరించే తీరును.. పరిశీలించి ఆయనకు ‘పద్మశ్రీ’ ఏమిటి? అంటున్నారంతే!

తెలుగు సినిమాలో బూతులు లేవని కాదు.. తెలుగులో బూతు సినిమాలు రావని కాదు.. రాజమౌళి సినిమాల్లో ఉండే బూతులకు, వాటి చిత్రీకరణకు.. ‘పద్మశ్రీ’కి పోలిక పెట్టుకోవడమే జీర్ణం కాని అంశం అని వారు అంటున్నారు. సింహాద్రి సినిమాతో మొదలుపెడితే.. బాహుబలి వరకూ రాజమౌళి సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు, హీరోహీరోయిన్ల సరససల్లాపాలు చవకబారుగా, పచ్చి బూతుగా ఉంటున్నాయనేది వీరి అభిప్రాయం.

సింహాద్రి సినిమాలో.. అంకిత, ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న ‘రొమాన్స్’ గురించి మొదలుపెడితే, ‘చీమ’తో పండించిన బూతును ఇంట్లో కూర్చుని చూడదగినది అయితే కాదు! యుక్త వయసుకు వచ్చిన పిల్లలు అమ్మానాన్నలతో కూర్చున్నప్పుడు అలాంటి సీన్లు వస్తే.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది, సీన్లో.. డైలాగుల్లో.. సాహిత్యంలో.. అసభ్యతే ఉంటుంది!

అంతేనా.. విక్రమార్కుడు వంటి సినిమాలో హీరో, హీరోయిన్ల రొమాన్స్ పరమార్థం దైవానికే తెలియాలి! ‘కాలేజీ పాపల బస్సు..’’ అంటూ సాగే పాట అయితే పరాకాష్ట! డబుల్ మీనింగేమీ కాదు.. ఉన్నది సింగిల్ మీనింగే.. అది బూతుల మీనింగే.. అన్నట్టుగా ఉంటుంది ఈ సినిమాలో రాజమౌళి వ్యవహారం. సినిమాలో బూతులు చూపడమే కాదు.. కన్నడనాట భక్తి ఉద్యమ కారుడొకరు రాసిన భక్తి గీతాన్ని కూడా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్‌లో వాడేసిన ఘనత రాజమౌళి అండ్ బ్యాచ్‌ది. 

‘ఛత్రపతి’లో హీరోహీరోయిన్ల వ్యవహారం మరో ఖండం. ఈ సారి హీరోయిన్ వక్షం మీదనే చేతులుపెట్టించి ఎక్స్ ప్రెషన్లను చిత్రీకరించాడు ఈ దిగ్ధదర్శకుడు! గుండుసూదులేమిటో.. గుచ్చుకోవడం ఏమిటో… ఆ పాట చిత్రీకరణ ఏమిటో! సంస్కృతిని కాపాడటం అంటే, ప్రేమికుల రోజున జంటగా కనిపించే యువతీయులకులకు పెళ్లిళ్లు చేయడం అనే భ్రమలో ఉన్నాం మనం. అలా రెచ్చగొట్టే రాజకీయ నేతలకు జై కొట్టడమే సిసలైన హిందుత్వ వాదం. ఇంటిల్లిపాదీ చూసే సినిమాలను ఇలాంటి సీన్లతో నింపే సృజనకారులను మాత్రం దేశ అత్యున్నత సత్కారాలతో సత్కరిస్తే ఆనందించాలి. తెలుగు వాడని గర్వపడాలి. ఇలాంటి దర్శకులకు సత్కారాలు దక్కితే వేనొళ్లా పొగిడే వారే.. విలువల గురించి లెక్చర్లు దంచుతుంటారు!

తెరపై శృంగారాన్ని ఇలా చిలకడంలో ‘బాహుబలి’ విషయంలో కూడా విమర్శలు రాలేదా? తమన్నా కేరెక్టర్‌ను అంత కేరెక్టర్ లెస్‌గా చూపడం ఏమిటి? అని జాతీయ మీడియా సైతం బుగ్గలు నొక్కుకోలేదా! అయినా ఇలాంటి సీన్లను రాజమౌళి ఒకడే తీశాడా? ఇలాంటి సీన్లను తీసిన వారికి ఇది వరకూ పురస్కారాలు.. రాలేదా? అనే వాదనా ఉండొచ్చు! పద్మ జాబితాలో పొదిగిన వారంతా పత్తిత్తులు రాజమౌళి ఒకడే ఇలాంటి వాడా? అని కూడా వాదించవచ్చు. ఇదీ నిజమే! ఇంకో నాలుగైదేళ్ల తర్వాత ఏ సన్నీలియోన్‌కో.. ముందు ముందు వెలుగులోకి వచ్చే మరో పోర్న్ స్టార్‌కో పద్మ అవార్డును ప్రకటిస్తే.. అప్పుడు రాజమౌళి వంటి వాళ్లకు ఇవ్వడం బెటర్ మెంటే అవుతుందిలే!