తిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆరున్నొక రాగం తీసింది. తమ ఉనికి చాటుకోవడానికి ఈ ఉప ఎన్నిక ధీటైన వేదిక అన్నట్టుగా వివిధ మీటింగులు నిర్వహించింది. బీజేపీ నేతలు అయితే తిరుపతిలో మకాం పెట్టినంత పని చేశారు. వ్యూహాలు, స్థానిక తటస్థులతో మీటింగులు నిర్వహించడం గట్రా కూడా జరిగాయి. ఇక ఈ ఉప ఎన్నిక టికెట్ విషయంలో తమ మిత్రపక్షం జనసేనతో కూడా బీజేపీ చాలా కసరత్తు చేసింది. జనసేన పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతూ ఉండటంతో అలాంటి అవకాశమే లేదన్నట్టుగా బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు.
జనసేన అభిప్రాయంతో సంబంధం కూడా లేకుండా.. తామే పోటీలో ఉన్నట్టుగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు ప్రకటించేశారు కూడా. ఇక అభ్యర్థుల విషయంలో కూడా రకరకాల లీకులు వచ్చాయి. రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో.. అందుకు తగ్గట్టుగా పేర్లను వదిలారు. పక్క రాష్ట్రంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇంత కసరత్తు చేసి కూడా.. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ ఆ పోటీ నుంచి వెనక్కు తగ్గుతోందనే వార్తలు వస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉదంతం తెరపైకి రాగానే బీజేపీ డిఫెన్స్ లో పడిపోయిన వైనం స్పష్టం అవుతోంది. ఇదెంత వరకూ వచ్చిందంటే.. తిరుపతి బై పోల్ విషయంలో జనసేనకే అవకాశం ఇచ్చి తను తప్పుకోవాలని బీజేపీ భావిస్తోందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీజేపీ ఎలా సమర్థించుకున్నా, దాన్ని ఎంతగా చిన్నది చేసి చూపినా.. దాని దెబ్బ ఎలా ఉంటుందో మాత్రం కమలానికి అర్థం అవుతున్నట్టుగా ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి ఉపయోగించుకోవాలనుకున్న బై పోల్ పోటీ నుంచినే బీజేపీ తప్పుకునేలా ఉందంటే, ఒకవేళ జనసేనకు ఆ అవకాశాన్ని ఇచ్చేసి బీజేపీ తప్పుకునేస్తే.. స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డొల్లేనని ఆ పార్టీనే ఒప్పుకున్నట్టుగా అవుతుందని కూడా విశ్లేషకులు అంటున్నారు.