ఎమ్బీయస్‌ కథలు: అచలపతీ- అణితులూ

''ఒరేయ్‌  అనంతం,  మీ కొత్త అత్తయ్య మీద నే రాసిన  ప్రబంధం నువ్వు  చదివితీరాలి సుమా'' అంటూ వచ్చాడు మదనగోపాలం మావయ్య, నాలుగు కవితలు అచ్చవగానే  పుస్తక రూపంలో  తెచ్చేద్దామని ఉబలాటపడే  యువకవంత ఉత్సాహంగా…

''ఒరేయ్‌  అనంతం,  మీ కొత్త అత్తయ్య మీద నే రాసిన  ప్రబంధం నువ్వు  చదివితీరాలి సుమా'' అంటూ వచ్చాడు మదనగోపాలం మావయ్య, నాలుగు కవితలు అచ్చవగానే  పుస్తక రూపంలో  తెచ్చేద్దామని ఉబలాటపడే  యువకవంత ఉత్సాహంగా ..

మదనుడికి భార్య ఒక్కతే. గోపాలుడికి అష్ట మహిషులు. మా మదనగోపాలం మామయ్య భార్యల సంఖ్య ఈ రెండిటి మధ్యన  ఎక్కడో ఉంది. వ్యాకరణం నేర్చుకొనడానికీ, ఆధునిక కవిత్వం  రాయడానికీ  ముడిపెట్టని కొత్త కవిలా ఒక భార్య పోయిన తర్వాతనే  మరొకరిని  కట్టుకోవాలన్న పట్టింపు పెట్టుకోలేదు తను. వయసు పై బడుతున్నా ఎన్నుకున్న పంథాలో మడమ తిప్పకుండా, పక్క చూపులు మానకుండా సాగిపోతున్న యోధుడాయన. ఈ మధ్యే మరో పెళ్లి చేసుకుని నాకు కొత్త అత్తయ్యను సమకూర్చిన ఉదారుడు కూడా. మహాకవి, యుగకవి అని శ్రీశ్రీని ఆకాశానికెత్తేయడమే కానీ ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటున్నామా?  'వయసు మళ్లిన, ఎముకలు కుళ్లిన జీవుల్లారా, చావండి'  అన్నాడు కదా ఆయన. ఆయన మాటకు  గౌరవం ఇచ్చి వయసు మళ్లగానే పుటుక్కున  టపాకట్టాలా, అక్కర్లేదా? అదే అడిగాను.

''నలుగురితో పెళ్లి చావుతో సమానమని ఆయనే అన్నాడు  కదరా.  అందుకనే నాలుగో  దాన్ని కూడా  పెళ్లాడాను. శ్రీశ్రీ మీద  నాకు గౌరవం లేదనుకోకు'' అంటూ చివాట్లేశాడు మావయ్య.

''మరి కవిత్వం కూడా ఆయన మీద గౌరవం కొద్దీ రాసావా?'' వాకబు చేసా.

''అంటే ఆ కవిత్వం తొలినాళ్ల శ్రీశ్రీ టైపనుకో. మీ అత్తయ్య తన అందం గురించి ఓ ప్రబంధం రాయమంది.  రాశా.  అదేననుకో.. పద్యాల థీమ్‌ నాది. దస్తూరీ ఓ మేష్టారిది''.

''గ్రంథసాంగుడన్నారు  కదాని మొహమాటానికి పోయి గ్రంథం రాయనక్కర్లేదు  మామయ్యా'' అని నచ్చచెప్పబోయా, బూతుల్లేక పోయినా ఇది దళిత కవిత్వమే అని పాఠకులకు నమ్మించజూసిన ఎడిటర్లా! మామయ్య వినలే! ఆష్టాదశ వర్ణనలతో నిండిన ఆ గ్రంథరాజాన్ని చదవడమే కాక ఆవిష్కరింపజేసి ప్రజల కందించే భారం నన్ను వహించమన్నప్పుడు నా బాధ వర్ణనాతీతం. ఈ రోజుల్లో  పద్యాలు ఎవరు చదువుతారన్నాను. కొత్త  అత్తయ్య పేరు మీదే  రాసిన 'చంద్రికా విలాసం' అనే  ఆ కావ్యాన్ని  ఎవడో  కొక్కిరాయి పేరడీ చేసి 'చంద్రికా విలాపం' అంటాడని బెదిరించాను. పుస్తకం  ఎవరూ కొనరన్నాను. పద్యాలు ఎవరూ అర్థం చేసుకోరన్నాను. ఈ చెన్నపట్నంలో తెలుగువాళ్ల సభకు జనాలు రారన్నాను.  వచ్చినా  వాళ్లలో వాళ్లు కబుర్లు చెప్పుకుంటారు గానీ ఉపన్యాసం వినరన్నాను.  పుస్తకం  పరిచయం చేసేవాడు  కూడా 'స్థాలీపులాక న్యాయం'గా చదివేనంటూ  డబాయిస్తాడు కానీ పూర్తిగా  చదవడన్నాను. 

అన్నిటికీ  మావయ్య ఔనన్నాడు.  అయినా గ్రంథం  ఆవిష్కరించాల్సిందేనన్నాడు, 'జయలలిత  దగ్గరకు  రాయబారం పంపడానికి అందగాళ్లెవరూ మిగల్లేదయ్యా బాబూ' అని అద్వానీ మొత్తుకున్నా ఎవరో  ఒకర్ని పంపాలని  పట్టుపట్టిన వాజపేయిలా పట్టుబట్టిన మామయ్యను చూసి క్లయిమాక్స్‌లో మొగుడు, పెళ్లాం  కలిసి కాపురం చేసినట్లు కథ రాసిన ఫెమినిస్టును చూసిన సీనియర్‌  ఫెమినిస్టుల్లా జాలిపడి  నచ్చచెప్పా- 

''మామయా,  నా మాట విను,  హైదరాబాదు కెళ్లు. అక్కడైతే  ఉపన్యాసకుల గురించి తడుముకోనక్కరలేదు. ఆస్థాన వక్తలున్నారు.  నువ్వెవరో, నీ పుస్తకమేమిటో  తెలియకుండా కూడా కనీసం గంటసేపు మాట్లాడగలరు. వేసవి కాలంలో సాయంత్రం మీటింగు పెట్టేవంటే చల్లదనం కోసం రవీంద్రభారతికి వచ్చి జనాలు విశ్రమిస్తారు. సభ నిండుగా  అనిపిస్తుంది.  ఏ పోలీసు ఆఫీసరునో,  ఐఏయస్‌ ఆఫీసరునో పిలిచావంటే వాళ్ల మందిమార్బలంతో  సభ నిండుతుంది. సెక్యూరిటీ, హడావుడీ  చూసి పెద్దవాళ్ల మీటింగనుకొని  భ్రమపడి ఇంకో నలుగురొస్తారు. వేదిక మీద కూచోడానికి కనీసం పదిమంది ముందుకొస్తారు. టీవీ కవరేజి కూడా వస్తుంది.  ఇక్కడ మద్రాసులో  మనని పట్టించుకొనే వాడెవడు..?''  అని బుజ్జగించి చెప్పాను. 

కానీ అదేదో కథలో రాజకుమారుడిలా  ససేమిరా వదల్లేదు మామయ్య. కావాలంటే ఆ వక్తలను విమానంలో మద్రాసు  తెప్పిస్తాట్ట. ''అదెలా? సాయంత్రం ఆ టైముకి  ఉపన్యాసం ఇవ్వకపోతే వాళ్లకు మర్నాటి  దైహిక  కార్యక్రమాలు దెబ్బతింటాయి కదా?'' అన్నాను నేను. ''తెలుసులేరా. అందుకే ఆ టైముకు విమానంలోనూ ఓ మీటింగ్‌ ఏర్పరుస్తానులే'' అంటూ  విసుక్కున్నాడు మామయ్య.

నా జీవిత గాథను  ఇప్పటి దాకా ఫాలో అయిన పాఠకులు నేనిలాటి ఇరకాటాలు  గతంలో ఎంత సులభంగా  అధిగమించానో గుర్తుపెట్టుకునే ఉంటారు. ఈ సమస్యను కూడా ఎంతో తెలివిగా పరిష్కరిస్తానని ఊహించే వుంటారీ పాటికి. వాళ్లు నిరాశచెంద నవసరం  లేదు. 'నిక్షేప రాయుళ్ల నిలయం'లో పై నెల 25వ తారీక్కు  సభ ఏర్పాటు  చేసేను కూడా. 

'నిక్షేపరాయుళ్ళ నిలయం'  గురించి కొత్తగా  చెప్పేందుకేమీ లేదు.  మా వూళ్లో  పోతుటీగల్లాటి  వాళ్లందరికీ  కాలక్షేపం  కలిగించే చోటదే.  చక్కటి భోజనంతో బాటు, బ్రిడ్జి, బిలియడ్స్‌ లాటి కార్యకలాపాలకు  అది ఎంతో  అనువైన చోటు. అక్కడే  త్రేన్పులే  తప్ప బీద  అరువులు, ఉల్లిపాయల రేట్లపై  వాపోవడాలు  వినబడవు. 'కాలు మీద  కాలు వేసి పెట్టేందుకు మనుష్యులెవరైనా దొరుకుతారా' అన్న ఆరాలు మాత్రం వినబడుతూంటాయి. అప్పుడప్పుడు రాజకీయాల గురించి చర్చలు జరుగుతూంటాయి  కానీ చాలా మందికి వాటి గురించి  వాదించే ఓపిక కూడా ఉండదు. హాయిగా సిగరెట్లు,  సిగార్లు  కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో  లోకాన్ని  బద్ధకంగా చూస్తుండడమే మెజారిటీ  సభ్యుల  వృత్తి, వ్యావృత్తి.  మా అచలపతి  సింగపూర్‌  వెళ్లిపోయిన దగ్గర్నుంచీ నేను  అక్కడే  ఎక్కువసేపు  కాలం గడపడం జరుగుతోంది.

ఈ మధ్యే నిలయం సెక్రటరీ  గోలపెట్టాడు -''అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలు జరుపుతూండాలి సార్‌. లేదా బొత్తిగా పేకాట క్లబ్బయిపోతోంది. ఫండ్స్‌కి  లోటు  లేదు. మనకి తెలిసున్న వాళ్లెవరైనా  ఉంటే  చెప్పండి కాస్త'' అన్నాడు.

''ఎవరో ఒకర్ని పిలవచ్చనుకోండి. కానీ మన సభ్యులు రావాలి కదా, వచ్చినా  చివరి దాకా  కూర్చోవాలి కదా. మొన్న  ఆరంగేట్రం ప్రోగ్రాం పెడితే  అరగంట తర్వాత భోజనాలకు లేచిపోయారు…''

''తెలుసు సార్‌.. అందుకనే ఈ సారి  ముందు భోజన కార్యక్రమాలు పెట్టేస్తున్నాం. తినేసి  కదలలేక పడి వుంటారు.  ఈ లోపుగా  వచ్చినవాళ్లు వాళ్ల ప్రోగ్రాం ఇచ్చేసుకోవచ్చు''

 ''..అలా  అయితే..మా మామయ్య పెద్ద కవి..''

**************

'నిక్షేపరాయుళ్ల  నిలయం' లో ప్రోగ్రాం ఫిక్స్‌  చేసిన వైనం విని మదనగోపాలం మామయ్య పొంగిపోలేదు. తమంతటి వాళ్లు మద్దతిస్తామన్నా బిజెపి ప్రభుత్వాన్ని  కూలదోయడానికి  ముందుకు రాని కాంగ్రెసు స్తబ్ధత  చూసి గడ్డం  పీక్కున్న సుర్జిత్‌లా నేను  జుట్టు పీక్కున్నాను. ''అదేమిటి మామయ్యా,  నిక్షేపం లాటి చోటు చూపిస్తే ..'' అనబోయేను.

''ఒరేయ్‌, అక్కడి సభ్యుల్లో  ముసలివాళ్లు చాలామంది  ఉంటార్రా.  ఆ పద్యాల గుట్టు పట్టేస్తారేమో'' అన్నాడాయన  బెదురుతూ.

''…అంటే  ఈ మత్తేభాలు, శార్దూలాలు  ఇంకోళ్ల 'జూ' లోవా?'' అని అడిగేశా.

''అంతేననుకో. పాతకవుల దొడ్లలోంచి తోలుకొచ్చినవి. అక్కడక్కడ చారలు మార్చాననుకో.  కందాలు కూడా గతాల గోతుల్లోంచి తవ్వి తీసినవే''.

''మరి హైద్రాబాదు నుండి వక్తల్ని తెప్పిస్తున్నావుగా. ఆ కవిగారికి తెలియవూ?''

''అది ముందే  కనుక్కొన్నాను. ఆయన ఎక్కడకెళ్లినా తన అనుభవాల గురించే  చెప్తాట్ట. ఇన్ని  సభలకు హాజరవుతూంటే ఇతరుల పుస్తకాలు చదివే తీరిక ఎక్కడిది?  ఇంకో ఆయన కూడా చిన్నప్పుడు తానెంత శుంఠైనదీ, ఇప్పుడెంత పండితుడైనదీ చెప్పుకుంటాట్ట. వాళ్లతో చిక్కులేదు. సభికుల్లో పెద్దవాళ్లుంటే చటుక్కున  గుర్తుపట్టేస్తారేమోనని భయం''.

ఇక చెప్పక తప్పలేదు – మా నిలయ సభ్యులందర్నీ తిండి మత్తులో  ముంచెత్తి   కూబోబెడుతున్నామని. అప్పటికీ మామయ్య అన్నాడు – 'మీ అత్తయ్య డిజప్పాయింట్‌మెంట వుతుందేమోరా'  అంటూ.

జయలలిత,  మమతా బెనర్జీలతో పొత్తు  పెట్టుకున్నాకనే బ్రహ్మచర్యంలో ఉన్న సౌలభ్యం తెలిసి రావడానికి నేను వాజపేయిని  కాదు. ఆడవాళ్ల సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నా – నా దృష్టిలో మా మావయ్య ఈ వయసులో అసలు పెళ్లే చేసుకోకూడదు.  జాతకంలో  సుఖస్థానంలో శుక్రుడు పక్కేసుకుని కూచుని పోరు పెడితే ఒకవేళ చేసుకుందామనుకున్నా మరో ముసలిదాన్ని  చేసుకోవాలి కానీ పడుచుదాన్ని కట్టుకోకూడదు. కట్టుకున్నా ఆమె మెప్పు  నాశించకూడదు. ఆశించినా అడుగడుక్కూ ఆమె ఆమోదం కోసం ఎదురు చూడకూడదు. ఇలా తనపై గ్రంథం రాయించుకుని చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోదామని కుట్ర పన్నేవాళ్లను అసలు పట్టించుకోకూడదు. ఈవిడే ముంతాజ్‌  మహలయి ఉంటే గోరీలోంచి  లేచి వచ్చి తాజ్‌మహల్‌ డిజైన్‌  బాగాలేదు  మార్పించమని షాజహాన్ని  ఊదరగొట్టేసేది. 

''మామయ్యా, ఊరికే నస పెట్టకు.  సభలో ఏం జరిగినా  సరే, అద్భుతంగా ఉందని  పత్రికల్లో రాయించే భారం నాది. ఖర్చుకు వెనకాడనంటే చెప్పు – సమీక్షలు  పాజిటివ్‌గా  వస్తాయి.  అసలీ పుస్తకం పాఠ్యపుస్తకంగా పెట్టాలన్న  సూచన  కూడా చేయిస్తాను.  పాతసంస్కృతిని ముందుతరాల  కందించేందుకు  కృషి  చేస్తున్న  భాగీరథీ సమానురాలుగా అత్తయ్యను…''

''ఒరేయ్‌, 'భాగీరథీ సమానురాలైన'  అంటే వేరే  అర్థం  వస్తుందేమోరా.  నేను నీ కళ్లెదుట  కనబడుతూండగానే ఇలా…''

''భగీరథుడికి  స్త్రీ లింగం అనుకుని అలా వాడానులే, వద్దంటే  మరో బిరుదు  వెతుక్కోమను''.

**************

సాఫీగా వెళ్ళిపోయేవి కథలు కావనుకుంటాను. రావణాసురుడు  కిడ్నాప్‌  చేయక పోతే ఇంటర్వల్‌  తర్వాత రామాయణమే  లేదు. కైక లేకపోతే  ఇంటర్వల్‌  ముందు కూడా  రామాయణంలో  కథ ఉండదు.  అలాగే 'కెబి యాజి కెబి'  పాత్ర చొరబడక పోతే ఈ కథ  రాయవలసిన అవసరమే వుండేది కాదు.

తాము చాలా న్యాయంగా వ్యవహరిస్తున్నట్లు కనబడాలన్న కండూతి  లోకంలో ప్రతీ వాడికి ఉండబట్టే ఇన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి.  తనెవరి  పక్షమూ  కాదనీ, అందరూ తనకు సమానమేననీ చూపించాలని మహా తాపత్రయపడతాడు మనిషి.  విమర్శను  కూడా సాదరంగా,  ఉదారంగా ఆహ్వానిస్తానని  నిరూపించబోతాడు.  నిక్షేపరాయుళ్లకీ ఇదే జబ్బుంది కాబట్టి మామయ్య పుస్తకావిష్కరణతో  బాటు ఆవిడ ప్రాచీన  కవితను బాలన్స్‌  చేయడానికి ఒక అణితకవిని (అణగదొక్కబడినవారిని అణితులంటారుట.  అదీ ఆ కవే చెప్పాడుట) కూడా ఆహ్వానించి ఆయన పుస్తకాన్నీ  ఆవిష్కరించాలని  తలపెట్టారు వాళ్లు.

  ఆ  అణిత  కవే – కెబి యాజి  కెబి.  లోక స్వభావాన్ని  కాచి, మరగించి, వడపోసి, హరాయించుకున్న వాణ్ని కాబట్టి 'పోన్లే,  ఏదో ఆ కవికీ ఏదో వేదిక దొరికిందిలే' అనుకుని ఊరుకున్నాను కానీ అతగాడు మామయ్య పుస్తకాన్ని  విమర్శిస్తూ రాసిన కవితలు కూడా తన పుస్తకంలో  చేరుస్తున్నాడన్న విషయం తెలిసి గాభరాపడ్డాను. మావయ్యకీ  విషయం  తెలిస్తే  నా మీద,  నేను చేసిన  ఏర్పాట్ల మీద మండి పడడం ఖాయం.  వెళ్లి ఆ కవిగారిని కలిసి మంచీ, చెడ్డా మాట్లాడితే మంచే తప్ప చెడు జరగదనిపించింది. నా కరిష్మాకు లొంగకుండా  ఉండడం అంత సులభం కాదని నాతో పనిబడ్డవాళ్లు  చాలామంది  నా ముఖం మీదే అనేసారు కూడా! కెబి మాత్రం  లొంగేరకంలా  లేడు. వాడు ముందు  నుంచీ అంతే! 'వాడు' ప్రయోగం  చూసి మరోలా అనుకోకండి. నా చిన్నప్పటి క్లాసుమేటే వాడు.  పేరు బ్రహ్మ సోమయాజి.  ఒట్టి మొండి ఘటం.

''నువ్వు  అణితుడవెలా అయ్యావురా?''  అన్నాను తెప్పరిల్లిన కాస్పేపటికి.

''అణగారిన వాళ్లందరూ  అణితులే. తెలియదా ?''  అని హుంకరించాడు  వాడు. 

''నిన్నెవరు అణగదొక్కారు?''

''ఇంకెవరు? పత్రికలవాళ్లు. నేను పంపిన కవితలు తిరక్కొట్టారు. ఒక్కటంటే ఒక్కటి కూడా వేసేవాళ్లు కారు ''.

''… అంటే ఇప్పుడు వేస్తున్నారా?''

''…చచ్చినట్లు! ఇప్పుడు అణితుడ నయ్యాను కదా.  వేయకపోతే యావద్భారత అణితులకు  అన్యాయం జరిగినట్లేనని నినదించాను. అణితులకు కేటాయించిన పేజిల్లో  నా రచనలు వేస్తున్నారీ  మధ్య. అణిత గల్పికలు,  అణిత  కథానికలు,  అణిత స్కెచ్‌లు, అణిత మ్యూజింగ్స్‌, అణిత లేఖలు, అణిత నాటికలు, అణిత  అష్టావధానాలు. అణిత ..''

''ఇవన్నీ  ఎప్పుడు నేర్చుకున్నావురా? నాకు తెలిసి నీకు  తెలుగే సరిగ్గా రాదు''.

'మాటకు అడ్డురాకు. అణిత ప్రబంధం రాయబోతున్నాను త్వరలో . మీ మామయ్య ప్రబంధంలో ఆష్టాదశ వర్ణనల్లో  పుష్పలావికల  సౌందర్యం  వర్ణించాడు కదా.  అంటే  శ్రామిక  స్త్రీలను  సెక్స్‌  పరమైన  దృష్టితో  చూసాడన్నమాట. అందుకే దానికి ప్రతిగా నేను రాసే  అణిత ప్రబంధంలో పూజారి భార్య అంగాంగ వర్ణన  చెయ్యబోతున్నాను''.

''ఆవిడ అణితురాలు కాదా?''

''కాదు, స్త్రీలు దళితులు కావచ్చు.  బహుజనులు కావచ్చు- ఈ రెండింటికీ  తేడా ఏమిటని అడగొద్దు. నాకే  సరిగ్గా తెలియదు. – అగ్రవర్ణాల స్త్రీలు అస్సలు ఏదీ కారు. శ్రామిక  స్త్రీ అణితురాలు. అందునా అణితుడి భార్య  అయితే  అణితాణితురాలు''.

''పోన్లే, అలాగే కానీ… అవునూ నీకు ఛందస్సు  రానప్పుడు  ప్రబంధ పద్యాలు ఎలా రాస్తావురా  బాబూ!''

''నేను రాసే దానికి  ఛందస్సుతో  పనిలేదు.  నాది హైకూ ప్రబంధం''.

 ''హైకూ అంటే 'లో -కీ'లో  ఉండే  కవిత్వమేనా?''

''నీకో ఉదాహరణ ఇస్తే  అదే అర్ధమవుతుంది''.

'జయలలిత

– వాజ్‌ పేయి

  పాలిట పేయి'

''పేయి అంటే ?''

''మద్రాసులో పుట్టి  పెరుగుతున్నావు, తెలీదూ? పేయి అంటే దెయ్యం''

''అది  అరవం కదా''.

''అయితే మాత్రం, ప్రాస  కుదరాలంటే ఏ భాషలోంచైనా  అరువు  తెచ్చుకోవాల్సిందే. నా కవిత్వానికి హద్దులు  లేవు. అగ్రకుల సంకుచిత గోడలు నన్ను బాధించవు..''

''అసలు నువ్వు అణితుడవెలా  అయ్యావురా….''

''నేను రాసేది 'ఉత్తమ అణిత రచన'  కావాలంటే నేను అణితుడిగా పుట్టాల్సిందే నన్నారు అణిత పీఠాధిపతులు. అణితుడిగా  పుట్టనివాడు రాసినది ఉత్తమ అణిత రచన కాదు:  పురుషులు రాసినదేదీ ఉత్తమ ఫెమినిస్టు రచన కాదు''

''…. అంటే స్త్రీలు పురుషుల గురించి రాస్తే అది ఉత్తమ పురుష రచన కాదు. అణితులు తమ రచనల్లో  అగ్రకులాల గురించి రాస్తే అది ఉత్తమ అగ్రకుల  రచన కాదు. అంతేగా?''

''పురుషరచన, అగ్రకులరచన ఎవడికి కావాలోయ్‌, బోడి! వాటికెవడు  పేజీలు  కేటాయిస్తారు?''

''పోన్లే, ఇంతకీ  నువ్వు అణితుడవెలా  అయ్యావో  అది చెబుదూ''

''కొండ  బ్రాహ్మణులు  అణితులు కారంటావా?''

''కొండ కాపు,  కొండ రెడ్డి  ట్రైబ్స్‌్‌ అని విన్నాను  కానీ..''

''అలాగే కొండ బ్రాహ్మలు  కూడా. నా కులం అదేనని  ప్రకటించాను''.

''గవర్నమెంటు గెజిట్లో ఆ పేరుతో  కులం  ఏదీ…''

''అగ్ర కులస్తులు నడిపే  ఈ ప్రభుత్వాన్ని  నేను గుర్తించను''.

''అంటే నీ పేరు  చివరున్న  'కెబి ' అంటే కొండ బ్రాహ్మణ  అన్నమాట. అదెందుకు  తగిలించావు?''

''ఆంధ్ర దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది నీకు తెలియదు కాబోలు. 'కులం పేరు ఎత్తితే ఖబడ్డార్‌ కంప్లెయింట్‌  చేస్తాం  జాగ్రత్త'  అన్నవాళ్లే పేరు చివర కులం పేరు జోడిస్తున్నారు. అందుకే నేనూ తగిలించాను.  కాసింభట్ల బ్రహ్మ  సోమయాజి  అనే పేరును  కెబి యాజి కెబి' అని రూపాంతరీకరించాను''.

''అంతా బాగానే ఉంది. నీ పాట్లు నువ్వు పడుతున్నావు.  మధ్యలో మా మావయ్య కవిత్వం  మీద ఎందుకు పడతావు?''

''ఎవరో  ఒకరి మీద విరుచుకు పడకపోతే నాకు గుర్తింపెలా  వస్తుందిరా? ఫర్‌ యువర్‌ కైండ్‌ ఇన్‌ఫర్మేషన్‌, మీ మావయ్య ప్రాచీనకాలపు  కవిత్వం మీదనే కాదు, నన్ను ఆహ్వానిస్తున్న  'నిక్షేపరాయుళ్ల  నిలయం'  మీద కూడా  విరుచుకుపడి,  విలయతాండవం  చేయబోతున్నాను. అండ్‌.. ఆఫ్‌  ఆల్‌ ది పీపుల్‌,  నీ మీద  ఒక ఛాప్టర్‌  ప్రత్యేకంగా కేటాయించాను''.

**************

ఇప్పటి దాకా  సమాజం పోకడల గురించి  ఒక అబ్జర్వర్‌గా  విషయగ్రహణం చేస్తున్న  నేను కెబి మాటలతో ఉలిక్కిపడ్డాను.  ఆ తర్వాత  జరిగినది విపులంగా చెప్పడం అంత భావ్యం కాదు. కెబి, నేనూ కాలేజిలో చదివే రోజుల్లో ఒకే అమ్మాయి గురించి పోటీపడడం,  ఆ పోటీలో నేను కొన్ని  అవాంఛనీయ (కెబి దృష్టిలో) పద్ధతులుపయోగించి ఆ అమ్మాయి  దృష్టి  నాకర్షించడం జరిగిన మాట వాస్తవం.  కానీ అవన్నీ కెబి ఇంకా  గుర్తుపెట్టుకుని తన కవిత్వం ద్వారా చరిత్ర  కెక్కిస్తాడని, అదీ అన్ని బూతులు కలగలిపి (బూతులు వాడడం అణిత కవుల జన్మహక్కన్న  డబాయింపొకటి పైగా) – నేను కల గనలేదు. 

'నీ జీవితం  వడ్డించిన విస్తరి' అని ఆరోపించాడు. నేనూ అదే మొత్తుకున్నాను. ''ప్లేట్‌మీల్‌ జీవితమేరా, తింటుంటే  అయిపోతోంది  కానీ మారు వడ్డించే వాళ్లు లేరు. పెద్దలు స్వర్గంలో తిష్టేసుక్కూచున్నారు కానీ దిగి  వచ్చి 'ఫుల్‌మీల్స్‌ ' ఏర్పాటు చేయటం లేదు' అని. సమాజంలో నాలాటి వాళ్లు ఉండక్కర్లేని సబ్జక్ట్‌  మీద వాడేదో  లెక్చరించాడు కానీ ఇన్‌ ద ప్రాసెస్‌  (చర్య జరుగుతూండగా అని తెలిగించవచ్చా?) నాకో విషయం స్పష్టమయింది- బండబారిన వాడి బహిరంగం (ఎక్స్‌టీరియర్‌కు  తెలుగు:,అంతరంగానికి ఆపోజిట్‌) చూసి వేరెవరైనా మోసపోవచ్చు కానీ నాతి పట్ల  ఆ రాతిలో తేమ ఇంకా ఇంకిపోలేదని నేను గ్రహించాను. ఆ పట్టాల మీదే నా ఆలోచనల రైలును (ట్రెయిన్‌ ఆఫ్‌ థాట్స్‌ను) పరిగెత్తించాను. మూడో  స్టేషన్లో మా  మదన గోపాలం  మామయ్య కూతురు సరస ఆ రైల్లోకి ఎక్కింది.  రైలు సింగపూర్‌  చేరేసరికి దాంట్లోకి అచలపతి  కూడా  ఎక్కేసాడు.

ఇకపై కాకతాళీయం అనే బదులు 'సరస అచలపతీయం' అని పేరు పెట్టవచ్చు. అటువంటి సందర్భాలు కాకి, తాటిపండు మధ్యనే కాదు, సరస, అచలపతి మధ్య కూడా కావచ్చు. అచలపతి  హాలీడేయింగ్‌కి సింగపూర్‌ వెళ్లబోతున్నాడని తెలిసి సరస అక్కడికి చదువుకి  వెళ్లిందా? సరస సింగపూర్లో  చదువుతోందని తెలిసి అచలపతి హాలీడేయింగ్‌కి అక్కడికి  వెళ్లాడా?  కాదు, కాదు. సరస దారి సరసదే. అచలపతి  దారిది అచలపతిదే.  ఇద్దర్నీ  ఒక దారికి తెచ్చి, ఒక దారానికి ముడి వేసిన ఘనత నాదే. 

అచలపతికి ఫోన్‌ చేశా. అంత రాత్రైనా అంత ఎలర్ట్‌గా ఎలా ఉండగలడో మరి!  నా పేరు వింటూనే, ''గుడీవినింగ్‌ సర్‌. నేను గుర్తుకు రావడానికి  ప్రత్యేకమైన కారణముందా సర్‌ ?''  అన్నాడు.

''ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. కానీ,  నువ్విక్కడ లేకపోవడం  మహా బోరుగా  ఉందోయ్‌, అచలపతీ, లీవు కాన్సిల్‌  చేసుకుని  వచ్చేయకూడదదూ…''

 ''సర్‌, నేను మీ వద్ద  నుండి పొందిన అనుమతిని  పూర్తిగా  వినియోగించుకున్నాకనే తిరిగి వద్దామనుకొనే నా నిర్ణయం  పట్ల  మీరు నిరసన వ్యక్తపరిచేటట్లయితే  ఇది సరైన  సమయం  కాదని మాత్రం విన్నవించగలను సర్‌. నన్ను డిన్నర్‌కి తీసుకెళ్లడానికి  'సరస' అంటే 'సవుత్‌ ఇండియన్‌ రసిక  సభ' సభ్యులు కాచుకుని ఉన్నారు సర్‌''.

''ఎవరా రసిక జనులు?''

''సింగపూర్లోని సవుత్‌ ఇండియన్స్‌ అందరూ కలిసి  పెట్టుకున్న సాంస్కృతిక  సంఘం సర్‌.  తెలుగు వాళ్లు కూడా చాలా మరది ఉన్నారు. కళలలోని రసాస్వాదన చేసే వారి సభ అని వీరి ఉద్దేశ్యం సర్‌. తెలుగు రసికతకు, ఈ రసికతకు వాడుకలో  కొంత వ్యత్యాసం లేకపోలేదని…''

''అర్థమయింది,  అర్థమయింది. విరాళాలు  పోగుపడే ఐడియా  ఏదో చెప్పి వుంటావు.  వాళ్లు  నిన్ను డిన్నర్‌కి తీసుకెళుతూండవచ్చు. అది సరే,  నేను చెప్పేది విను. ఇక్కడ కెబి యాజి కెబి అనే ఒక కవి నా పేరు రచ్చకెక్కించ బోతున్నాడు..'' అంటూ  చెప్పుకుని  నా ఐడియా  చెప్పేను.  దాని ప్రకారం  అచలపతి మా మావయ్య కూతురు  సరస పేర సింగపూర్‌ నుండి కెబికు ఒక ఉత్తరం రాస్తాడు.  అతని కవిత్వం చూసి మెచ్చి, వలచానని అని ఉంటుందా ఉత్తరంలో. ఆ ఉత్తరం చూసి కెబి కాబోయే మామగార్ని కష్టపెట్టడం  ఇష్టం లేక తన కవితా పఠనాన్ని వాయిదా వేస్తాడు.

 అయిడియా విన్నాక అచలపతి యథాప్రకారం అడ్డురాబోయాడు. 'ఈ నాటి యువత – వారికి తమ తల్లిదండ్రులపై గల ప్రేమాభిమానాలు' అన్న అంశం పై నా ఆలోచన  కాస్త  'అవుటాఫ్‌ స్టెప్‌' (తప్పు తాళం అందామా?)  ఉందనబోయేడు. అచలపతి  అభ్యంతరాలు నాకు కొత్త కావు. నేను చెప్పినట్లు చేయమని నొక్కి వక్కాణించి ఫోన్‌ పెట్టేస్తూండగా వినబడిందా ప్రశ్న- ''సర్‌,  ఈసారి జనవరి ఫ్యాన్సీడ్రెస్‌ బాల్‌కు మీరు 'ఆ' వేషమే  వేయబోతున్నారా?'' అని.

'ఆ' వేషం ఏ వేషమో మా ఇద్దరికీ  తెలుసు. తాగుబోతు వేషం కట్టడం నా చిరకాల వాంఛ.  కానీ  అచలపతికి అలాటి వేషాల  విషయంలో  తీవ్ర అభ్యంతరం ఉంది.  తనుండగా ఏ ఏడాదీ పడనిచ్చాడు కాడు కదా, ఈ ఏడాది వేద్దామనుకున్నాను. నేను జవాబు  చెప్పే లోపునే ఫోన్లోనే అతను ఎలుకను వాసన చూసాడు లాగుంది (స్మెల్ట్‌ ఏ రేట్‌). ''సర్‌ , నా మాట మన్నిస్తే..'' అంటూ  ఏదో  చెప్పబోయేడు.

''మన్నించను.. న్నించను… చను…ను.. ఉ''. ఫోన్‌ పెట్టేశా.

**************

హిట్లర్‌ రష్యా మీదకు దండెత్తే నమయంలో నేను లేను కానీ నా బోటివాడు ఎవడో ఒకడు ఉంటే  ఉంటాడు.  ఉండి,  ఊరికే  ఉండలేక,  రష్యాలో శీతాకాలం  గురించి మంచీ,  చెడ్డా మాట్లాడే వుంటాడు. అయినా  హిట్లర్‌ ప్రయాణం మానేశాడా? సైనికులకు స్వెట్టర్లు అల్లి పంపించే మహిళా సంఘాల భరోసాలతో ముందుకు నడిచి ఉంటాడు.  చివరకు  దెబ్బ తిన్నాడు. అలాగే నేను కూడా కెబి విషయంలో వేసిన ప్లాను బెడిసి కొట్టింది.  అచలపతి  చేత సరస  అడ్రసు తప్పుగా రాయించాను కదా అన్న భరోసాతో ఉన్నాను కానీ కెబి ఆ అడ్రసు పోగొట్టుకుని మామయ్య ఇంటికి ఫోన్‌ చేయడంవల్ల కరెక్టు అడ్రసు వాడి చేతపడుతుందని నేను ఊహించలేకపోయాను.

సరస రాసినట్లు వచ్చిన ఉత్తరానికి నేననుకున్న రీతిలోనే కెబి స్పందించడం, కావాలంటే  తన కవిత్వంలో ఇంగ్లీషు బూతులు తీసేస్తానని హామీ ఇస్తూ ఉత్తరం రాయడం జరిగింది. మామయ్య స్టాఫ్‌ ద్వారా దొరికిన కరెక్టు అడ్రసు వల్ల సరస కా ఉత్తరం చేరడమూ జరిగింది. ముందు కాస్త కన్‌ప్యూజ్‌ అయినా, తన తండ్రిని, సవతి తల్లిని దుయ్యబట్టే మనిషి  దొరికినందుకు ఆనందించి, అతగాడిని అభిమానించి, మద్దతుగా నిలవదలిచి, కెబికి ఫోన్‌ చేసి తను తప్పకుండా మీటింగుకి వస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత్వపు ఘాటు తగ్గకూడదనీ  స్పైసీ విశేషాలు కలపవచ్చని చెప్పింది. ఇదంతా కెబి నా దగ్గరకు వచ్చి చెబుతున్నప్పుడు  నాకు కళ్లు తిరిగాయి,.

మామయ్యను హేండిల్‌ చేయటం ఎలా? పైగా తను ఈ కథ చదివేడంటే  నేనే సరసను దీన్లోకి లాక్కొచ్చినట్టు తెలిసిపోతుంది కదాని భయమేసింది. అచలపతీ అదే అన్నాడు – ఫోన్లో  మాట్లాడినప్పుడు సరస వ్యవహారం నాకు కొరుకుడు పడలేదన్నాను. ''మీరు  ఏ పంటితో  కొరికి చూసారు, సర్‌ ?''  అని అడిగాడు అచలపతి వినయం చెడకుండానే.

''జ్ఞానదంతంతో! నా శాస్త్రజ్ఞానమంతా ఉపయోగించి అనలైజ్‌  చేశా.  తన తండ్రిపై  ఇంత ద్వేషం చూపడమనేది…''

''సర్‌ ఈ వయస్సులో తనపై పుస్తకం రాయించుకున్న సవతితల్లిపై ఆమెకు జాలి పుట్టవలసినంత అవసరం ఏదీ ఉన్నట్టు  కనబడటం లేదు కదాసర్‌''

'మగవాళ్లలోనూ మంచివాళ్లున్నారు స్మీ' అని ఒప్పుకోవాల్సి వచ్చిన ఫెమినిస్టులా ఓ బలవంతపు  నవ్వు నవ్వా. ''అచలపతీ,  ఈసారి ఎనాలిసిస్‌లో పొరపాటు  జరిగిందోయ్‌'' అన్నాను.

''పొరపాటు చేసేమని నాలిక్కరచుకోవడం,  ఆ తర్వాత ఆ నాలిక్కరుచుకోవడం పొరపాటని మళ్లీ  కరుచుకోవడం.. సర్‌, మీరు భారత కమ్యూనిష్టా?''

అచలపతి వ్యంగ్యం శ్రుతి మించిందనిపించిందది. ''అచలపతీ, లైన్‌ బాగా లేనట్లుంది. నువ్వు ఏదో ఆరోపించినట్లు వినబడుతోంది'' అన్నాను.

''కరెక్ట్‌ సర్‌,  మీరు తప్పు ఒప్పుకుంటున్నట్లు  కూడా వినబడుతోంది.పైగా నేను  ఇప్పుడే  ఓ రాజకీయ నాయకుని  ఉపన్యాసం  విని వస్తున్నాను. చెవులు దిబ్బళ్లు  వేస్తున్నాయి''.

''అయితే విషయం క్లుప్తంగా  ముగించేస్తాను. అక్కడ సరసను కట్టిపడేయ్‌. ఇక్కడి  విషయాలు నేను చూసుకుంటాను '' అని ఫోన్‌ పెట్టేసా.

**************

టైముకి బస్సు రాకపోతే  ట్రాన్స్‌పోర్టు వాళ్లని,  పేపరు రాకపోతే పేపరు వాళ్లని, పాలు రాకపోతే పాలవాళ్లనీ,  పాలు రాకపోతే పాలవాళ్లని కాల్చి పారేయాలనీ, దేశంలో నియంతృత్వం (నియంతగా మనమే ఉండాలి, వేరేవాడు కాదు) అని ఉవ్విళ్లూరుతాం కానీ  అవి జరిగే పన్లు కావు. 'నిక్షేపరాయుళ్ల నిలయం'  వాళ్లను కెబి ఉద్దేశాల గురించి హెచ్చరించినా లాభం లేకపోయింది. సభకు వచ్చినవాళ్లల్లో  ఇవన్నీ వినే వాడెవడులే అన్న ధీమా వాళ్లది. ఈ దేశానికి  నియంత కాలేకపోయినందుకు చింతిస్తూనే మీటింగుకి వెళ్లాను. 

సరస గుమ్మంలోనే కనబడింది. గుండె ఆగింది. అచలపతి కట్టిపడేసినా ఎలా తప్పించుకుని రాగలిగింది?

మామయ్య కవితా గానం సాగుతుండగానే పారిపోయి వచ్చా. అచలపతికి  ఫోన్‌ చేశా సంగతేమిటని అడగడానికి. 

''మీరే కదా సర్‌,  సరసను ఆకట్టుకోమన్నది. వాళ్లను ఒప్పించి, వాళ్ల  లెటర్‌హెడ్‌ పై..''

''ఆగాగు, ఇక్కడ అచ్చుతప్పు పడింది. కట్టి వేయమన్నది. నీకు ఆకట్టుకోమని వినబడ్డట్టుంది. అయినా సరస బహువచనం ఎలా  అవుతుంది? అది వివరించు''.

''సరసకు వివరణ 'సవుత్‌ ఇండియన్‌ రసిక సభ' కదా. మీ ఉద్దేశ్యం ప్రకారం వాళ్లను ఆకట్టుకుని, ఒప్పించి, వాళ్ల లెటర్‌ హెడ్‌పై…''

 ''మళ్లీ ఆగాగు,  వాళ్ల లెటర్‌హెడ్‌ దేనికి ?''

''కెబి గారిని సింగపూర్‌కి ఆహ్వానిస్తూ రాయడానికి వాళ్ల లెటర్‌హెడ్‌ అవసరం పడుతుంది కదా సర్‌''.

''ఆగిపోయి అక్కడే వుండు. కెబిని సింగపూర్‌ ఆహ్వానించడానికి వాళ్లను నువ్వు ఒప్పించావా ? అంటే ఆ దేశంలో కూడా నా చరిత్ర బజారుకెక్కి..''

''ఇప్పుడు మీరు కాస్త ఆగండి సర్‌.  కెబి గార్ని ఆహ్వానించడానికి కాదు, ఆహ్వానించినట్టు కెబి గార్ని నమ్మించి ఈ రోజు  మీటింగు సమయానికి  మద్రాసు ఎయిర్‌ పోర్టులో పడిగాపులు కాసేటట్టు చేయడానికి గాను వారి లెటర్‌హెడ్‌..''

 ''..అంటే సింగపూర్‌ ఆశతో కెబి మీటింగు ఎగ్గొట్టి, ఎయిర్‌పోర్టులో ఉన్నాడంటావా? ఆర్యూ షూర్‌?''

'కావాలంటే వెరిఫై చేసి చూడండి.''

చేశా. కెబి  మీటింగుకి గైర్హాజరు అయ్యాట్ట. మామయ్య గారి సభ నిరాటంకంగా జరిగిపోయిందట..

కళ్లుమూసుకుని వెనక్కి వాలితే అచలపతి చేసిన తమాషా అర్థమయింది. ఆ సింగపూర్‌  సభ తాలుకు మనిషి  ఎయిర్‌పోర్టుకి  వచ్చి తనను విమానం ఎక్కిస్తాడన్న  ఆశతో కెబి ఇంకా ఎయిర్‌పోర్టులోనే ఉండి ఉంటాడు. 

అచలపతి మళ్లీ ఫోన్‌ చేసినప్పుడు గొంతు గద్గదమయిపోయింది. ''ఇంత దూరంలో ఉండి కూడా నువ్వు చేసిన ఉపకారం తలుచుకుంటే  నేను చాలా ఎమోషనల్‌ అయిపోతున్నాను అచలపతీ'' అన్నాను.

''ఇంతదానికే మీరింత ఎమోషనల్‌ అయితే జనవరి 1 నాటి 'ఆ' వేషానికి  మరీ ఎమోషనల్‌ అయిపోతారేమో ఆలోచించండి సర్‌''.  అన్నాడు అచలపతి మెత్తగా దగ్గుతూ.

గ్రహించేను. ఒప్పుకోక ఏం చేస్తాను? ''నేనా వేషం వేయటం లేదుగా  అచలపతీ, అందువల్ల  ఆ సమస్యే తలెత్తదు''  అన్నా విశాలంగా నవ్వుతూ. (రచన 1998 లో ప్రచురితం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]