ఎమ్బీయస్: సమస్య కరక్టే, పరిష్కారం..?

జనవరి 17, 2016 ఆంధ్రజ్యోతి డైలీలో రాధాకృష్ణ గారు ‘వైషమ్య రాజకీయం.. ప్రగతికి అవరోధం’ అంటూ ఆంధ్ర రాజధాని ఎదుగుదలకు గల అడ్డుపడే ముఖ్యమైన అడ్డంకి గురించి నిష్కర్షగా చెప్పారు – ‘విజయవాడలో రెండు…

జనవరి 17, 2016 ఆంధ్రజ్యోతి డైలీలో రాధాకృష్ణ గారు ‘వైషమ్య రాజకీయం.. ప్రగతికి అవరోధం’ అంటూ ఆంధ్ర రాజధాని ఎదుగుదలకు గల అడ్డుపడే ముఖ్యమైన అడ్డంకి గురించి నిష్కర్షగా చెప్పారు – ‘విజయవాడలో రెండు రోజులు గడిపినవారికి అక్కడి కులతత్వం చూసి చిరాకు వేస్తుంది…ఈ కుల దురభిమానం ఎంతవరకు వెళ్లిందంటే సినిమా హీరోలను కూడా కులప్రాతిపదికనే ఆరాధించేంతవరకు.. తెలంగాణలో పుట్టి పెరిగిన నాబోటివాళ్లకు యీ ధోరణి వింతగా, వికారంగా కనిపిస్తుంది. కూడు పెట్టడానికి పనికిరాని కులం కోసం ఎందుకింత ఆరాటపడతారో అని ఆశ్చర్యం కలుగుతుంది.’  అని. నిజానికి అక్కడి ప్రధానకులానికి చెందిన రాధాకృష్ణగారికే ఆ కులతత్వం వికారంగా తోస్తే, ఆ కులానికి చెందని ఇతర ప్రాంతీయుల సంగతి ఏమిటి? రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే వుండాలి కాబట్టి విజయవాడ-గుంటూరు మధ్యనే వుండాలని కాబినెట్‌లో తీర్మానం చేశామని శివరామకృష్ణన్ కమిటీకి ఆంధ్రప్రభుత్వం చెప్పిందని వార్త వచ్చినపుడు 2014 జులైలోలో నేను ఇదే పత్రికకు ‘‘బొడ్డు తప్ప వేరేమీ కనబడదా?’’ అనే పేరుతో రాసిన వ్యాసంలో రాసిన వాక్యాలు ఇవి – 

‘‘రాజధానిగా ఆ ప్రాంతం వర్ధిల్లాలంటే కొందరు పూనుకుని అక్కడి సామాజిక వాతావరణాన్ని మార్చవలసిన అవసరం వుందని నా వ్యక్తిగత అభిప్రాయం. తక్కిన చోట్ల కూడా కులాల గొడవలు కొద్దో గొప్పో వున్నాయి కానీ కృష్ణా జిల్లాలో కులం పేర కుమ్ములాటలు విపరీతం. ఇందిరాగాంధీ హంతకులు శిఖ్కులు కాబట్టి హత్యానంతరం ఢిల్లీలో శిఖ్కులను చంపారంటే అర్థం చేసుకోవచ్చు. గాంధీహత్య జరిగినప్పుడు మహారాష్ట్ర బ్రాహ్మణులపై కూడా దాడులు జరిగాయి – గోడ్సే ఆ కులం వాడు కాబట్టి. కానీ రాజీవ్ చావుకి, విజయవాడలో కమ్మలపై దాడులకు లింకు ఏం వుంది? హంతకులు ఎల్‌టిటిఈ వారు కాబట్టి అయితే గియితే తమిళలపై దాడులు జరగాలి. మధ్యలో కమ్మలు ఎక్కణ్నుంచి వచ్చారు? ఈ కులజాడ్యం పాతతరానికి పరిమితం కాలేదు, యువతరానికి కూడా పాకింది. ఒక సినిమా హీరో బ్రాండ్ అంబాసిడర్‌గా వున్న కూల్‌డ్రింకును, అతని కులాన్ని వ్యతిరేకించే కులవిద్యార్థులు కాలేజీ క్యాంటీన్లలో నిషేధించిన వైనాలు అక్కడి ప్రజలకు తెలుసు. ప్రతి మనిషిని, ప్రతి సంఘటనను కులం కళ్లతోనే అక్కడ చూస్తారని ప్రతీతి. అక్కడ సామాజిక కార్యకర్తలు ఐక్యసంఘటనగా ఏర్పడి కొన్ని చర్యలు చేపట్టి ఆ పేరు తుడిచివేసుకోకపోతే రాజధానిగా ఎదగడం కష్టం.’’ ఇదే మాటను విజయవాడ వాసులతో సన్నిహితసంబంధం కలిగిన రాధాకృష్ణ వంటి విజ్ఞులు చెప్పారు కాబట్టి ఈ సమస్య నిజమైనదే అనే నమ్మకం అందరికీ కలుగుతుంది.

‘‘హైదరాబాదులో అన్ని రాష్ట్రాలవారు, మతాలవారు వుంటారు. ఎవరూ ఇతరుల గురించి పట్టించుకోరు. అందుకే అది విశ్వనగరం అయింది. విజయవాడలో పరిస్థితి వేరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని అంత సులువుగా అక్కున చేర్చుకోరన్న అభిప్రాయం వుంది. మనవాడా? కాదా? అని ఆరా తీస్తారని చెప్పుకుంటారు.’’ అని కూడా ఆయన రాశారు. నేను కూడా పైన ఉదహరించి వ్యాసంలో ఇదే విషయాన్ని ప్రస్తావించాను – ‘కృష్ణా, గుంటూరు జిల్లాల వారు చొరవతో, సాహసంతో యితర ప్రాంతాలకు వెళ్లి అక్కడ నెగ్గుకు రావడం, అక్కడి స్థానికులకు కన్ను కుట్టేటంతగా ఎదగడం గమనిస్తాం. కానీ ఇతర ప్రాంతాల నుంచి ఆ జిల్లాలకు వచ్చి వియాలు సాధించిన వారున్నారా – అనేది గణాంకాలు చూస్తే తప్ప చెప్పలేం. ఆటోమొబైల్ రంగంలో చిన్న స్థాయిలో పంజాబీలు వుండడం కనబడుతోంది. ఇతర రంగాలలో స్థానికులే వున్నారు. వీళ్లను చూసి బెదిరి ఇతరులు రారా? వాళ్లు రావడానికి వీల్లేనంతగా వీళ్లే విస్తరించారా? అన్నది అర్థం కాదు. స్థానికుల కంటె మనం మెరుగ్గా వ్యాపారం చేయగలమని అనుకున్నపుడే ఎవరైనా వెళతారు. కృష్ణా, గుంటూరు జిల్లావాసుల దగ్గరకు వెళ్లి ఫలానా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను అనగానే ‘ఓహో, కాన్సెప్టు బాగుందే’ అనుకుని వాళ్లు మీకంటె ముందే అక్కడ పెట్టేస్తే..? ..రాజధానిగా ఎదగాలంటే అందర్నీ ఆహ్వానించే వాతావరణం, ఎదగనిచ్చే గుణం వుండాలి. ముంబయిలో ఎవరైనా వచ్చి వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. శివసేన వంటి శక్తులు మధ్యమధ్యలో అరాచకం సృష్టించినా మొత్తం మీద వాతావరణం – ఎవరైనా వచ్చి కష్టపడి పైకి రావచ్చు అనేట్లా వుంటుంది. కేరళ పనివారికి ఎంతో నైపుణ్యం వున్నా అక్కడ తగినంత పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడానికి కారణం స్థానిక ప్రజల స్వభావం. కర్ణాటకలో అందర్నీ ఆహ్వానించే లక్షణం కనబడుతుంది. అందుకే బెంగుళూరు అనేక రకాలుగా పెరిగింది. హైదరాబాదులో కూడా స్థానిక ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా అందర్నీ ఆహ్వానిస్తూనే వచ్చారు. ఇటీవలి కాలంలో రాజకీయాల కారణంగా విభేదాలు తెచ్చారు కానీ లేకపోతే సామాజికంగా ఎన్నడూ కలహాలు లేవు. 
విజయవాడ-గుంటూరు ప్రాంతాలలో ముంబయి, బెంగుళూరు, హైదరాబాదు వంటి వాతావరణం నెలకొల్పితే అక్కడి రాజధాని వర్ధిల్లుతుంది. కేరళ వంటి వాతావరణం నెలకొంటే క్రుంగుతుంది. అన్నీ మాకే కావాలి, మేమే బాగుపడాలి అనే ధోరణి అక్కడి నాయకులు ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు….’ 

నేను రాసిన ఏడాదిన్నర అయింది. ఈ సమయంలో పరిస్థితి ఏమీ మారలేదని రాధాకృష్ణ తాజా వ్యాసం నిరూపిస్తోంది. మరి దానికి ఆయన సూచించే పరిష్కారమార్గం ఏమిటి? కులాల మధ్య సామరస్యం నెకొల్పడానికి చంద్రబాబు చర్యలు తీసుకోవాలి అంటారు. ‘కులవైషమ్యాలను నివారించడానికి గట్టి చర్యలు తీసుకోని పక్షంలో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఫలితాలు అందడం మాట అటుంచి రాష్ట్రం తిరోగమనంలోకి వెళుతుంది’ అని హెచ్చరించారు. వ్యాసం ఇక్కడకి వచ్చేసరికి ఎడిటోరియల్ బాట పట్టేసింది. సంపాదకీయాల్లో సమస్య ఎంత జటిలమో అంతా రాసేసి, చివర్లో ‘సంంధిత పక్షాలన్నీ ఒక చోట సమావేశమై తమ ఆలోచనలు కలబోసుకుని సమన్వయం సాధిస్తే అసాధ్యం కానిదేదీ లేదు..’ మార్కు వాక్యంతో ముగిస్తారు. ఆ మధ్య ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో రోజాను పిలిచి ఈయన మందలిస్తూ ‘మీ పార్టీవాళ్లు, టిడిపి వాళ్లు కూర్చుని మాట్లాడుకోవాలి’ అంటూ లెక్చరిచ్చారు. ఆవిడ ‘నిజమే సార్, ఆ పని చేయాల్సింది స్పీకరు కదా’ అంటే ఈయన వినలేదు. మళ్లీమళ్లీ అదే పాట. ఈసారి ఆమె ‘మీరు చెప్తే వాళ్లు వింటారు, మీరైనా పిలిచి మాతో కలిసి కూర్చుని మాట్లాడమనండి’ అంటూ ఈయన్ని ఇరికించబోయింది. ఈయన సంపాదకీయం మోడ్‌లోంచి బయటకు రాదలచుకోలేదు. ‘మీరిద్దరూ కలిసి కూర్చోండి’ అంటూనే పాడుతూ పోయారు. వాళ్లలో వాళ్లకు ఆ పాటి సయోధ్య వుంటే ఏడాది సస్పెన్షన్లు ఎందుకుంటాయి? 

అది ఈయనకు తట్టక కాదు. పెద్దరికం నిలుపుకోవాలంటే యిలాంటి గంభీరమైన హితోక్తులు నాలుగు చెప్పాలంతే. ఇప్పుడు కులాల మధ్య వైషమ్యాలు పోగొట్టి, సామరస్యం నెలకొల్పే బాధ్యత బాబు నెత్తిన పెట్టేశారీయన. అలాంటివి చేయడానికి బాబు సంఘసంస్కర్తా? కులగురువా? ఆయన మాట ఆయన కులస్తులైనా వింటారన్న గ్యారంటీ వుందా? అదే వ్యాసంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు – ‘కులవైషమ్యాలకు కేంద్రబిందువైన విజయవాడ నుంచి ప్రస్తుతం చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు. దీంతో కమ్మవారు కొందరు తమదే పైచేయి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మిగతా కులాల వారు అధికార టిడిపివైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ‘ముఖ్యమంత్రి మా వాడే’ అని కమ్మవారు కొందరు గ్రామాలలో విర్రవీగుతున్నట్లు సమాచారం.’ అని. ఇక్కడ ఆయన ఎన్టీయార్ కాలంలో వారి గ్రామంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పి అసలు వ్యక్తులకు తెలియకుండానే ఇలాంటివారి వలన పార్టీ ఎలా నష్టపోతుందో దృష్టాంతం చెప్పి ‘ఇలాటి పెడధోరణులు విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో కనిపిస్తున్నాయని చెబుతున్నారు’ అని చెప్పారు. ఆంధ్రజ్యోతి పేపరు, టీవీ నెట్‌వర్క్ ద్వారా ఆయనకు క్షేత్రసమాచారం బాగానే అందుతుంది కాబట్టి ఈ మాటా నిజమే అనుకోవాలి. ఇలాంటి వాటివలన నష్టపోయేది చంద్రబాబే అని కూడా రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వీళ్లు గమనించడానికి ముందే చారచక్షువైన బాబుకి తెలిసే వుంటుంది. అయినా వాళ్లను ఆయన నియంత్రించ లేకపోయివుంటారు. 

బాబు అనే కాదు, ఏ రాజకీయ నాయకుడికీ కులాల, మతాల మధ్య సామరస్యం సాధించగలిగే స్టేచర్ లేదు. ఎవరైనా సామాజిక కార్యకర్తలు పూనుకోవాలని నేను అభిలషించాను. పోనుపోను పరిస్థితి అధ్వాన్నమై ఎవరూ ఎవరి మాటా లక్ష్యప్టెని వాతావరణం నెలకొంది. ఇలాటి పరిస్థితుల్లో అలవికాని, అమలు కాని సలహాలు ఇచ్చి ఏం ప్రయోజనం? మరి యీ సమస్యకు పరిష్కారం లేదా? అంటే నాకు తోచినది ఒక్కటే! అది కూడా పైన ఉదహరించిన వ్యాసంలోనే వచ్చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ మధ్యలో వుంది కదాని అమరావతిని రాజధానిగా పెడుతున్నామని బాబు వాదించినపుడు నేను ‘సెంటర్లో వుంది కదాని శరీరంలో కడుపుకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కాళ్లూ చేతులను పట్టించుకోకపోతే కదలిక వుండదు, కడుపుకి తిండి వెళ్లదు, మోసేవాళ్లుండరు. ఈ – గవర్నెన్స్ ద్వారా పాలిస్తున్న ఈ రోజుల్లో రాజధాని అన్ని ప్రాంతాలకూ సమదూరంలో వుండాలి అనడమెందుకు? ‘గ్రామీణుడు మండల కేంద్రానికి వెళితే చాలు పనులన్నీ ఏకగవాక్షం ద్వారా చేసేస్తాం, మంత్రులు, అధికారులు ప్రజలతో మమేకమై ప్రజల ముంగిటకు పాలన తెచ్చేస్తాం’ అని ఓ పక్క అంటూనే మళ్లీ సామాన్యుడు మా దగ్గరకు రావాలంటే దూరం కదా? అని వాదించడం సిల్లీగా వుంది.’ అని వాదించాను. 

చివర్లో ‘ఓకే, రాజధాని సెంటర్లో వుండాలనుకుని అక్కడే పెడతామంటారు. సరే, అక్కడితో ఆపండి. మళ్లీ అన్నీ అక్కడే పెట్టడం దేనికి? రాజధాని కావాలా? యూనివర్శిటీలు, హాస్పటల్స్, పరిశ్రమలు వగైరా కావాలా? అని ప్రజలను అడగండి. రాజధాని వున్నచోట మీడియా ఎలాగూ విస్తరిస్తుంది. దానితో సరిపెట్టండి. తక్కినవి ఇతర జిల్లాలకు పంచేయండి. అన్నీ ఒకేచోట పెట్టేయడం వలననే తెలుగువాళ్లు విడిపోవలసి వచ్చిందని గుర్తు పెట్టుకోండి. ఇప్పటికే మీడియాకు కేంద్రస్థానంగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌గా, విదాే్యకంద్రంగా ఎదిగిన కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే అన్నీ పెడితే తక్కిన ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తుతాయి. ఎన్నికల్లో బిక్కచచ్చి వున్న కాంగ్రెసు ఐదేళ్ల తర్వాతైనా కొన్ని సీట్లు తెచ్చుకోవాలనే తపనతో ఆ ఉద్యమాలకు మద్దతు ఇస్తుంది. అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి వైకాపా కూడా వారితో చేతులు కలుపుతుంది.’ అని రాశాను. రాధాకృష్ణ కూడా ప్రాంతీయ, కులవైషమ్యాలు రాజేయడానికి ప్రయత్నాలు జరుతున్నాయని వాపోయారు. దీనికి మూలకారణం అందరికీ తెలుసు – ‘హైదరాబాదు పోగొట్టుకున్నందుకు కసితో వున్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు హైదరాబాదునే తమ వద్దకు రప్పించుకోవాలనే పట్టుదలతో వున్నారు. హైదరాబాదును తలదన్నే నగరాన్ని తమ వద్ద నిర్మించుకుని తమ తడాఖా చాటాలనుకుంటున్నారు. అధికారంలో వున్న టిడిపికి మద్దతు పలికే వర్గాలు ఆ రెండు జిల్లాలలో బలంగా వున్నాయి కాబట్టి వారి మాట చెల్లుబాటు అవుతోంది.’ అని. 

ఉత్తరాంధ్ర, రాయలసీమ ఉద్యమాలు ఇప్పటికే పురుడు పోసుకుంటున్నాయి. కమ్మప్రాబల్యం రాజధానిలో విపరీతంగా వుండబోతోందన్న ఆలోచన ఇతర కులాలకు దుస్సహం, దుర్భరం. ఇది రాష్ట్ర ఐక్యతకు ఏ మాత్రం మేలు చేయదు. రాష్ట్రాన్ని రక్షించాలంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గం. దీనికి ప్రాంతీయ అసమానతలు తగ్గడంతో బాటు, ఒకే కులం గుత్తాధిపత్యానికి కూడా కళ్లెం పడుతుంది. ఎందుకంటే కొన్ని జిలాల్లలో ఒక్కో కులం బలంగా వుంది. కొన్ని జిల్లాలలో సమతుల్యత వుంది. అభివృద్ధిని అమరావతిలో కుప్ప పోయకుండా అన్ని జిల్లాలకు విస్తరింపచేసినపుడు అన్ని కులాల వారికి ఆ లాభాలు అందుతాయి. ఆర్థికపరంగా, పలుకుబడి పరంగా ఇంచుమించు సమానస్థాయిలో కులాలు వున్నపుడు సామరస్యం నెలకొనేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. అలా జరగకుండా ఒకే కులం గుప్పిట్లో వున్న ప్రాంతానికే నిధులన్నీ తరలిస్తే ఆ కులస్తులపై రాష్ట్రమంతా ఇతరులకు అసూయ, ద్వేషం కలుగుతాయి. అది ఎవరికీ మంచిది కాదు. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)

[email protected]