బాదుడే బాదుడంటూ చంద్రబాబు ఊరూరా తిరుగుతున్నారు. జనాలు బాగానే వస్తున్నారంటూ అనుకూల మీడియాతో ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే అంబటి, బొత్స, విజయసాయి, సజ్జల.. ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు.
తాజాగా స్పీకర్ తమ్మినేని కూడా బాబుని ఓ ఆటాడేసుకున్నారు. ఆయనది అసమర్థుడి అంతిమయాత్ర అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
అవును నిజంగా అసమర్థుడే..
మూడుసార్లు రాష్ట్రాన్ని పాలించే అవకాశమిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇప్పుడు మళ్లీ మరో అవకాశం అడుగుతున్న చంద్రబాబు అసమర్థుడు కాక ఇంకేంటని ప్రశ్నించారు తమ్మినేని సీతారాం.
అలాంటి అసమర్థుడు ఇప్పుడు అసత్యాలు చెబుతూ యాత్ర చేస్తున్నారని, అది ఆయన అంతిమ యాత్ర అవుతుందని, 2024 ఎన్నికల్లో టీడీపీకి జనాలు ఫినిషింగ్ టచ్ ఇస్తారని చెప్పారు. జనాల బాదుడే బాదుడుతో టీడీపీ భూస్థాపితం అవుతుందని విమమర్శించారు.
ఆ రక్తపు మరకలు పోలేదు బాబూ..
కరెంటు చార్జీల పెంపుకి వ్యతిరేకంగా బషీర్ బాగ్ లో నిరసనకు దిగిన రైతులపై కాల్పులు జరిపిన దుష్ట చరిత్ర చంద్రబాబు సొంతం అని, ఆ రక్తపు మరకలు ఇంకా బాబుకి అంటుకునే ఉన్నాయని అన్నారు తమ్మినేని సీతారాం. అలాంటి చరిత్ర ఉన్న బాబుకి, కరెంటు చార్జీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
వైఎస్ఆర్ రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తామని చెబితే బట్టలు ఆరేసుకోడానికా అంటూ వెటకారమాడిన బాబుకి అసలిప్పుడు కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
బీసీ చరిత్ర తెలుసుకోండి..
చంద్రబాబుని విమర్శించే క్రమంలో బీసీల గురించి అందరూ తెలుసుకోవాలంటూ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త సంచలనంగా మారాయి. శ్రీకృష్ణుడు, వాల్మీకి, భగీరధుడు.. ఇలా అందరూ బీసీలేనని అన్నారు తమ్మినేని.
కురుసామ్రాజ్య పితామహుడు ఓ మత్స్యకారుడని, ఆయన కూడా బీసీయేనని సెలవిచ్చారు. భారత దేశం సమస్తం బీసీల మయం అని, చారిత్రక వాస్తవాలు కాదంటే చరిత్ర క్షమించదని చెప్పారు.