చంద్రబాబు అతి ప్రేమ, అతి జాగ్రత్తలే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి శాపాలుగా మారాయని అనుకోవచ్చు. 2014లో ఎన్నికల బరిలో దించకుండా నేరుగా మంత్రిని చేశారు. అప్పట్లోనే ధైర్యం చేసి లోకేష్ ని ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఉంటే.. మోదీ-పవన్ వేవ్ లో గెలిచేవాడేమో. కానీ అలా చేయలేదు.
ఆ తర్వాత ఐదేళ్లు పాపాలు చేసి 2019లో లోకేష్ పట్టుబట్టడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించకుండానే ఎమ్మెల్యేగా బరిలో దింపారు. ఫలితం శూన్యం. చివరకు ఆ ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనే హోదాలో రెచ్చిపోతున్నారు చినబాబు.
లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకైనా, ములాయం సింగ్ యాదవ్ కొడుకైనా, కేసీఆర్ కొడుకైనా.. తండ్రితోపాటే తాము కూడా తమ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకున్నారు. అంతెందుకు మహానేత వైఎస్ఆర్, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడే జగన్ రాజకీయ భవిష్యత్తుకి మంచి బాట చూపించారాయన. ప్రస్తుతం తండ్రి గైడెన్స్ లేకపోయినా తనయుడు జగన్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.
కానీ ఒక్క చంద్రబాబు విషయంలోనే ఆ వారసత్వం దారుణంగా ఫెయిలైంది. చంద్రబాబు చాణక్యుడే, కానీ ఒక్కగానొక్క కొడుకుపై ఉన్న అతిప్రేమ ఆయన కళ్లు కప్పేసింది. ఫలితం లోకేష్ రాజకీయాల్లో ఫెయిలయ్యారు. భవిష్యత్తులో పాసవుతారన్న గ్యారెంటీ లేదు. చంద్రబాబు ఉన్నప్పుడే ఇలా ఉంటే, ఇక ఆయన ఆరోగ్య కారణాలతో పూర్తిగా పక్కకు వైదొలగితే అసలు టీడీపీపై లోకేష్ పట్టు సాధించగలరా..?
పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు పదవులిచ్చారు సరే.. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా మెలగాలో కూడా చెప్పాలి కదా. కానీ లోకేష్ ని చంద్రబాబు వదిలేశారు. పార్టీ దీనావస్థలో ఉన్నప్పుడు తానే ఏటికి ఎదురీదుతున్నారు కానీ కొడుక్కి బాధ్యతలు అప్పగించడం లేదు. ఒకరకంగా చేపలు పట్టి కొడుకు పొట్ట నింపారు కానీ, కొడుక్కి మాత్రం చేపలు పట్టడం నేర్పించలేదు. అలా కొడుకు భవిష్యత్తుని తానే దగ్గరుండి మరీ నాశనం చేశారు, చేస్తున్నారు కూడా.
అసలు తన వారసుడిగా లోకేష్ ని ప్రకటించడానికి కూడా చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎలాగైనా తానే తిరిగి పార్టీని అధికారంలోకి తెస్తానని, అందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అంటున్నారే కానీ లోకేష్ కి మాత్రం ఎలివేషన్లు ఇవ్వడం లేదు. పైపెచ్చు, తనయుడి కంటే పవన్ కల్యాణ్ కే బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక రకంగా లోకేష్ రాజకీయ జీవితానికి చంద్రబాబే తొలి శత్రువు అని చెప్పుకోవచ్చు.