సినిమా హీరోలు ఆన్ స్క్రీన్ అదిరిపోతారు, ఆఫ్ స్క్రీన్ వారు ఎలా ఉంటారనేది సినిమా ఈవెంట్లలో తెలిసిపోతుంది. కానీ మహేష్ బాబు సర్కారువారి పాటలో ఎలా ఉన్నారో.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే ఛార్మింగ్ తో కనిపించారు.
సినిమాలో సీజీ వర్క్ తో చాలా మంది హీరోలు మేనేజ్ చేస్తున్న ఈ రోజుల్లో.. మహేష్ మెయింటెనెన్స్ చూస్తుంటే నిజంగా కొంతమంది హీరోలకు జలసీ వచ్చేస్తుంది. హీరోలకే కాదు, 46ఏళ్ల వయసులో మహేష్ బాబు ఇంకా అలా మెయింటెన్ చేస్తున్నాడంటే.. 35 ఏళ్లకే షేప్ అవుట్ అయిపోయిన బాడీలన్నీ పొట్టనిమురుకుంటూ నిట్టూర్చడం ఖాయం.
మహేష్ కి ఎలా సాధ్యమైంది..?
మీరు అందంగా ఉన్నారు, అందంగానే ఉన్నారు, ఏజ్ పెరిగినట్టు తెలియడంలేదు… ఇలాంటి డైలాగులతో ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేందుకు మహేష్ సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నాడు. సర్కారువారి పాటలో కూడా దీనికి సంబంధించిన ఓ డైలాగ్ ఉంది.
'ఊరుకోండి సర్ మీకేం పెళ్లప్పుడే, చిన్నపిల్లాడైతేనూ..' అని వెన్నెల కిషోర్ అంటే.. అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా.. మెయింటెన్ చెయ్యలేక దూల తీరిపోతోంది అంటూ మహేష్ బాబు కళ్లపై కీరాదోస ముక్కలు పెట్టుకుని పడుకునే సీన్ ఒకటి ట్రైలర్ లో ఉంది. అంటే మహేష్ తన రియల్ లైఫ్ కష్టాన్ని కూడా ఈ రీల్ లో ఇరికించేశాడన్నమాట.
అంత అవసరమా..?
ఏజ్ పెరిగే కొద్దీ వయసు మీదపడినట్టు కనపడటం, శరీరాకృతిలో మార్పులు సహజం. హీరోయిన్లు కూడా కొన్నాళ్ల వరకు వాటిని దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తారు, ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తారు. కానీ హీరోలకు కెరీర్ స్పాన్ కాస్త ఎక్కువ కాబట్టి, వారు ఇంకా కష్టపడాలి.
ప్రస్తుతం మహేష్ బాబు అలాంటి కష్టాలే పడుతున్నాడు. అయితే అభిమానుల కోసం ఆమాత్రం కష్టపడటంలో, కరెక్ట్ ఫిజిక్ తో ఉండాలనుకోవడంలో తప్పేం లేదంటారు మహేష్ బాబు లాంటి హీరోలు.
ఏ దర్శకుడ్ని అడిగినా మహేష్ కష్టం చెబుతారు!
ఫిజిక్, గ్లామర్ మెయింటైన్ చేయడం కోసం మహేష్ పడే కష్టం బయటకు తెలియకపోవచ్చు. కానీ అతడితో పనిచేసిన దర్శకులకు ఆ కష్టం తెలుసు. మెయింటెనెన్స్ విషయంలో మహేష్ ఓ రోల్ మోడల్. అప్పటివరకు బొద్దుగా ఉన్న వంశీ పైడిపల్లి, మహర్షి సినిమా టైమ్ లో ఎలా మారిపోయాడో చూశాం. తాజాగా మహేష్ తో సినిమా చేసిన పరశురామ్ కూడా ఎంత స్లిమ్ అయిపోయాడో చూశాం. వీళ్లంతా ఇలా మారడానికి మహేషే కారణం. అతడ్ని చూసి స్ఫూర్తిపొందామని చెప్పారు వీళ్లంతా.
ఏ పూట ఎంత తినాలి, ఏం తినాలి అనేది మహేష్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు. ప్రతి రోజూ మహేష్ తినే ఆహారంలో కెలొరీలు అస్సలు మారవు. మహేష్ తినే ఆహారం మనం అస్సలు తినలేం అంటూ దండం పెడతారు కొంతమంది. ఉప్పు, కారం లేకుండా ఉంటాయంట ఆ ఆహార పదార్థాలు. వారానికి ఓసారి ఇష్టమైన ఆహారం తిన్నప్పటికీ, మళ్లీ మరుసటి రోజు నుంచి 'పద్ధతి' ఫాలో అవ్వాల్సిందే.
జిమ్ చేసే విషయంలో కూడా నెలకోసారి మహేష్ ప్యాట్రన్ మారుస్తాడు. ఒకే తరహా వ్యాయామాలు చేయడు. తన లైఫ్ స్టయిల్ తో పాటు, సినిమాకు తగ్గట్టు జిమ్ చేసే విధానం మారిపోతుంది. చివరికి హెయిర్ విషయంలో కూడా మహేష్ తీసుకునే శ్రద్ధ పీక్ స్టేజ్ లో ఉంటుంది. బహుశా.. ఈ స్థాయిలో మెయింటైన్ చేయడం టాలీవుడ్ లో ఆ ఏజ్ గ్రూప్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాదేమో.
బాలీవుడ్ హీరోలంతా వయసు మీద పడుతున్నా సిక్స్ ప్యాక్ తో ట్రెండీగా కనిపిస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా వయసు పైబడుతున్న హీరోలు కూడా.. కవరింగ్ కష్టాలు పడుతున్నారు. మహేష్ బాబు లాంటి వారికి ఆ ఛార్మింగ్ నెస్ వారసత్వంగా వచ్చిన అడ్వాంటేజ్ కూడా కావొచ్చు. దానికి ఆయన పడుతున్న శ్రమ అదనం. అందుకే ఆయన్ని చూస్తే మిగతా మగాళ్లకు కుళ్లు.