సంక్రాంతి కి విడుదల కానున్న సినిమాల్లో ముఖ్యమైన “నాన్నకు ప్రేమతో'' 'డిక్టేటర్' సినిమాల విషయంలో అభిమానులు.. ఎటు వైపు? బాబాయ్ సినిమాను సమర్థిస్తారా.. అబ్బాయ్ కి అండగా నిలుస్తారా.. అనే సంగతిని పక్కనపెట్టి., ఈ రెండు సినిమాల్లోని హీరోల మధ్య ఉన్న వంశ అనుబంధం, వారి రిలేషన్ ను పక్కనపెట్టి.. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలుగా చేస్తే… ఒక రోజు తేడాలో విడుదల కాబోతున్న ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాల్లో కామన్ ఆడియన్ ఏ సినిమా పట్ల ఆసక్తిని చూపిస్తాడు? అనే అంశాన్ని పరిశీలించి చూస్తే… ఈ విషయంలో బాలయ్యపై ఎన్టీఆర్ ది పై చేయి అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాలయ్య సినిమాలకు అభిమానుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. 'డిక్టేటర్' కోసం వారు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా అభిమానుల ఆసక్తి ఉంటుంది. దీనికి అదనంగా కామన్ ఆడియన్స్ కూడా 'నాన్నకు ప్రేమతో' సినిమా విషయంలో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. 'డిక్టేటర్' పై సామాన్య ప్రేక్షకుల ఆసక్తి లేదని కాదు కానీ.. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు దర్శకుడు సుకుమార్ కావడం, సుక్కూ సినిమాలను ప్రత్యేకంగా ఇష్టపడే వారు ఉండటం… బాలయ్య సినిమా సగటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుండటం, ఎన్టీఆర్ ది మాత్రం ప్రయోగాత్మక సినిమా కావడంతో… 'నాన్నకు ప్రేమతో' మీద అదనపు ఆసక్తి కనిపిస్తోంది.
సుకుమార్ ఇంతకు ముందు తీసిన 'వన్' సినిమా కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయినా… వైవిధ్యమైన సినిమాగా నిలిచింది. ఆ మాత్రం వైవిధ్యభరితమైన సినిమాను చూడాలని తపిస్తున్న వారు 'నాన్నకు ప్రేమతో' పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు. బాలయ్య సినిమాకు మాత్రం 'వైవిధ్యం' అనే ముద్ర కొంచెం తక్కువగానే కనిపిస్తోంది. ఈ విధంగా బాబాయ్ పై అబ్బాయిది స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది!