ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 23

ఎడ్వర్డు మరణం తర్వాత కొంతకాలం వొదిగి వున్న బ్రూసు  యీ కలహాలను అవకాశంగా వాడుకుని చెలరేగాడు. మొదటి ఎడ్వర్డు చనిపోయినా, స్కాట్లండ్‌లోని సామంతరాజులందరూ ఇంగ్లండుకు విధేయులుగానే వున్నారు. వారందరినీ ఓడించాల్సి వుంది. కానీ బ్రూసు…

ఎడ్వర్డు మరణం తర్వాత కొంతకాలం వొదిగి వున్న బ్రూసు  యీ కలహాలను అవకాశంగా వాడుకుని చెలరేగాడు. మొదటి ఎడ్వర్డు చనిపోయినా, స్కాట్లండ్‌లోని సామంతరాజులందరూ ఇంగ్లండుకు విధేయులుగానే వున్నారు. వారందరినీ ఓడించాల్సి వుంది. కానీ బ్రూసు జబ్బు పడ్డాడు. అతని తమ్ముడు ఎడ్వర్డు, యితర అనుచరులు అతన్ని పల్లకీలో పర్వతాలకు తరలించుకుని పోయారు. అక్కడ చలి, ఆకలి, అలసట అతన్ని మరింత కృంగదీశాయి. మంచాన పడ్డాడు. అలాటి స్థితిలో కూడా ఒక రోజు తన సైనికులను ఇంగ్లీషు సైనికులు ఓడిస్తున్నారని విని లేని ఓపిక తెచ్చుకుని గుఱ్ఱం ఎక్కి, పక్కన మరో సైనికుడు తోడు రాగా యుద్ధమధ్యంలోకి వెళ్లాడు. అతన్ని చూస్తూనే సైనికులకు ఉత్సాహం వచ్చి ప్రాణాలకు తెగించి పోరాడారు. వారి సమరోత్సాహం చూసి బ్రూసు  పుంజుకున్నాడు. అతని ఆరోగ్యం కుదుటపడసాగింది. కొన్ని వరస విజయాలతో ఇంగ్లండుకు విధేయులుగా వున్న సామంతరాజులు అతని వైపు మరలసాగారు. బ్రూసు స్వయంగా కత్తి పట్టి, యుద్ధరంగంలో మొదటి వరుసలో నిలవడం వారిని మెప్పించింది. పైగా ఇంగ్లండు రాజు తన గొడవల్లో పడి స్కాట్లండ్‌ను ఎలా అదుపు చేయాలో తెలియక గవర్నరు (రాజప్రతినిథి)లను మారుస్తూ పోయాడు. ఒక ఏడాదిలో ఆరుగుర్ని మార్చాడంటే అతని గందరగోళాన్ని అర్థం చేసుకోవచ్చు.

బ్రూసు విజయాలు గాథలుగా చెప్పుకుంటారు. ఒక కోటను పట్టుకోవడానికి అతను ముందుగా వచ్చి కోటగోడలో లొసుగు ఎక్కడుందో చూసుకుని, వారం రోజుల తర్వాత తన అనుచరులతో వచ్చి అగడ్తను స్వయంగా యీదుకుంటూ వచ్చి గోడలో అక్కడ మేకు కొట్టి తాడు కట్టి తక్కినవాళ్లకు సురక్షిత మార్గం ఏర్పరచాడు. పెద్ద అగడ్త రక్షిస్తున్న లిన్‌లిత్‌గో కోటను ఒక బండివాడి సాయంతో గెలిచాడు. అతను కోటకు గడ్డి సరఫరా చేస్త్తున్నాడని తెలిసి ఎనిమిదిమంది శూరులను గడ్డిలో దాచి కోటలోకి పంపాడు. తక్కినవారిని కోట చుట్టూ చీకట్లో దాచాడు. గడ్డి బండి కదాని కోట అగడ్తపై వున్న వాలు వంతెన వాల్చారు. కోట గుమ్మం వద్ద పైనుంచి జారిపడే యినుపకవాటం (షట్టర్‌ లాటిది) పైకి లేపారు. సరిగ్గా దాని కిందకు బండి వచ్చాక బండివాడు బిన్నింగ్‌ బండికి కట్టిన ఎద్దుల తాళ్లు తెంపేశాడు. అవి పారిపోవడంతో బండి కూలబడింది. కవాటం మూయడానికి వీల్లేకపోయింది. 'అందరూ రండి' అని బిన్నింగ్‌ కేకలు పెట్టాడు. ఆ సంకేతాన్ని అందుకుని గడ్డిలో దాగిన వీరులు, దాగున్న వీరులు అందరూ  కవాటం తెరిచి వుండడంతో కోటలోకి ప్రవేశించారు. ఇంగ్లీషు సైనికులతో పోరాడి తరిమివేశారు. 

రాక్స్‌బరో కోటను బ్రూసు సహచరుడు డగ్లస్‌ పట్టుకున్న విధానాన్ని మరో కథగా చెప్పుకుంటారు. డగ్లస్‌ నల్లగా వుండడంతో అందరూ బ్లాక్‌ డగ్లస్‌ అనేవారు. అతని పేరు చెప్తే అందరూ వణికేవారు. మనవైపు చిన్నపిల్లలు ఏడిస్తే బూచి ఎత్తుకుపోతుందని తల్లులు భయపెట్టినట్లు (బూచి అనే మాట రావడానికి కారణం ఫ్రెంచి సేనాని బుస్సీట) అక్కడి తల్లులు బ్లాక్‌ డగ్లస్‌ పేరు ఉపయోగించేవారు. రాక్స్‌బరో కోటలో ప్రవేశించడానికి ఒక రాత్రి అతని సహచరులు నల్లదుస్తులు ధరించి కోట చుట్టూ వున్న పొలాల్లోంచి నడిచి వస్తున్నారు. అతనూ నల్లదుస్తులు వేసుకుని కోట బురుజుపైకి పాకుతున్నాడు. గస్తీ కాస్తున్న సైనికులు యిద్దరు ముచ్చట్లాడుకుంటున్నారు. దూరంగా పొలాల్లో కోటవైపు కదలివస్తున్న డగ్లస్‌ సైనికులు కనబడితే వాళ్లను చూసి ఒకడు ''అవి  మేత మేస్తున్న గొఱ్ఱెలు'' అన్నాడు. మరొకడు ''గొఱ్ఱెల కాపరి వాటిని లోపల పెట్టడం మర్చిపోయి జాతరకు పోయి వుంటాడు. రాత్రి బ్లాక్‌ డగ్లస్‌ వచ్చి ఎత్తుకుపోతే తెల్లారి ఘొల్లుమంటాడు'' అని చమత్కరించాడు. బ్లాక్‌ డగ్లస్‌ చాటుగా వుండి తమ మాటలు వింటున్నాడని, తమనే ఎత్తుకు పోతున్నాడనీ తెలియదు పాపం. డగ్లస్‌ కాస్త ముందుకు సాగాడు. అక్కడ ఒక సైనికుడి భార్య తన పిల్లవాణ్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ''నువ్వు బుద్ధిగా పడుక్కుంటే బ్లాక్‌ డగ్లస్‌ రాడు'' అంటూ పాట పాడుతోంది. ''అంత ధీమాగా వుండకు తల్లీ'' అంటూ డగ్లస్‌ ఆమె భుజంపై చెయ్యి వేశాడు. అతన్ని చూస్తూనే ఆమె మూర్ఛపోయింది. కొద్ది సేపట్లోనే కోట డగ్లస్‌ వశమై, ఇంగ్లీషు సైనికులందరినీ మట్టుపెట్టినా, డగ్లస్‌ ఆమెకు, బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాడు – 'డగ్లస్‌ మీరనుకున్నంత బూచి కాదు సుమా' అని చెప్పడానికి!

దుర్భేద్యమైన ఎడింబరా కోటను పట్టుకోవడానికి బ్రూసు మరో సహచరుడు రాండాల్ఫ్‌ నిశ్చయించుకున్నాడు. ఎలాగా అని ఆలోచిస్తూ వుంటే గతంలో ఆ కోటలో సైనికుడిగా పనిచేసిన ఫ్రాన్సిస్‌ అనే అతను అతని దగ్గరకు వచ్చాడు. కోటలో పనిచేస్తూండగా అతను  దగ్గర్లో వున్న గ్రామంలో వున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను కలవడానికి తన పై అధికారులకు తెలియకుండా కోటలోంచి చాటుగా బయటపడేందుకు ఓ మార్గం వెతుక్కున్నాడు. అది చాలా నునుపుగా, వాలుగా వుండే బండరాళ్లతో నిండిన దారి. 'ఆ దారి యింకా నాకు గుర్తుంది. కానీ చాలా కష్టమైనది. కాలూనడానికి కూడా చోటు వుండదు. తాళ్ల నిచ్చెనల సాయంతో ఒకరి తర్వాత మరొకరు మాత్రమే వెళ్లగలం. కాపలాదారుల కంటపడితే మాత్రం ఒకరొకరిగా అందర్నీ నరికేస్తారు.' అన్నాడతను. సాహసం చేయడానికే రాండాల్ఫ్‌ నిశ్చయించుకుని అతన్ని దారి చూపమన్నాడు. ఒక రాత్రి 30 మంది అనుచరులతో వాళ్లు కష్టపడి పైకి ఎగబాకారు. కోట గోడ దూకి లోపలికి వెళ్లబోతూ వుంటే గస్తీ సైనికులు అటు వచ్చారు. అందరూ గోడకు బల్లుల్లా అతుక్కుపోయారు. పైన నడుస్తున్న గస్తీ వాళ్లల్లో ఒకడు తమాషాకి ఒక రాయి తీసి దూరంగా వున్న కొండ శిఖరం వైపు విసిరి ''చీకట్లో కూడా నిన్ను చూశానోచ్‌'' అని అరిచాడు. అది తమను ఉద్దేశించే అన్నాడనుకుని రాండాల్ఫ్‌, అతని సైనికులు వణికిపోయారు. బిక్కచచ్చిపోయారు. ఈ వైనం తెలియని గస్తీ వాడు నవ్వుతూ ముందుకు సాగాడు. వాడు వెళ్లగానే గుండెలు చిక్కబట్టుకుని యీ వీరులందరూ నిచ్చెనలతో పైకి పాకారు. కొద్ది సేపటికే  వాళ్లు కోటను చేజిక్కించుకున్నారు.  బ్రూసు విగ్రహం ఎడింబరా కోట గుమ్మంలో వుంది. (సశేషం) (చిత్రాలు – ఎడింబరా కోటగుమ్మం వద్ద బ్రూసు విగ్రహం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives