ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఎప్పుడో అనేసాడు శ్రీశ్రీ. ఆ పరపీడన వారసత్వం నేటికీ అలా అనూచానంగా, అలా కొనసాగుతూనే వుంది. జాతిని జాతి.. దేశాన్ని దేశం పీడించే రోజుల నుంచి మనిషిని మనిషే పీక్కుతినేసే కాలం దాపురించింది. మనిషిలో చీమూ నెత్తురు, మాంసం స్థానంలో స్వార్థం నిలువునా పేరుకుంటొంది.. ప్రవహిస్తోంది.. బహిరంగంగానే కారిపోతోంది.
దేశంలో జరుగుతున్న అనేకానేక సంఘటనల తీగలాగి చూస్తే, ఆ చివర్న కనిపించేది డబ్బే.. అధికారం.. రాజకీయం.. పార్టీ ఫిరాయింపులు.. లాలూచీలు.. కాంట్రాక్టులు.. లయిజినింగ్‌లు.. ఆఖరికి దారుణ కాల్ మనీ వ్యాపారాలు.. అన్నింటా పరమార్థం డబ్బే.. చిత్రమేమిటంటే.. గుళ్లు గోపురాలు భయంకరంగా కిటకిట లాడిపోతున్నాయి. తెల్లవారితే అందరి టీవీల్లో చాగంటి ప్రవచనాలు వినిపిస్తూనే వున్నాయి. కళ్ల ముందు మహామహులు పైసా వెంట తీసుకెళ్లకుండా కనిపించని తీరాలకు వెళ్లిపోతూనేవున్నారు. అయినా సంపాదన.. డబ్బు.. అవథి.. పరిథిలేని ఆశ..
వ్యాపారం.. రాజకీయం.. అధికారం
ఇప్పుడు ఇదే తారకమంత్రం.. విషవలయం.. ఏదో వ్యాపారం చేపట్టాలి.. దాన్ని ఫెంచుకోవడం కోసం రాజకీయాలను ఆశ్రయించాలి.. ఆపై అధికారం సాధించాలి.. దాంతో మళ్లీ మరింత వ్యాపారం.. అంటే మరింత డబ్బు.
లేదా రివర్స్‌లో చూస్తే..అధికారం దొరికింది. రాజకీయం చేసి దాన్ని నిల బెట్టుకోవాలి. అలా వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసి, పదింతలు చేయాలి. అంబానీ అయినా, అనామకుడు అయినా, పోయిన తరువాత గంటల్లోనే కాటికి చేర్చేస్తారు.. బిర్లా అయినా బడుగు జీవి అయినా, పోయిన తరువాత బాడీ అనే తప్ప మరో పేరువుండదు.
ఈ సత్యం తెలిసి కూడా, బతకడానికి, మున్ముందు భయం లేకుండా బతకడానికి సరిపడా సంపాందించడంతో ఆగడం లేదు.. అదో వ్యసనంలా తయారవుతోంది. ఆ వ్యసనం చివరకు ఎలా మారుతోంది అంటే, ఈ క్రమంలో, సిగ్గు, శరం, ఉచ్ఛం, నీచం, మంచి, చెడ్డ, మానవత్వం..అన్నీ మరిచిపోయేంతగా..? తను మనిషిని అన్నదే విస్మరించేంతగా?
చదవేస్తే..
చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నది నిన్నటి మాట. అదే ఇప్పుడు నిజమై కూర్చుంది. ఒకప్పుడు రాజకీయాలు చేసిన వారు నిశానీలు. వాళ్లు మహా అయితే నాలుగు ఉద్యోగాలకు రికమెండేషన్ చేసి, ఓ పర్మిట్ సంపాదించి, మరీ తెలివితేటలు వుంటే ఓ ఫ్యాక్టరీ లైసెన్స్ తెచ్చుకుని డబ్బు చేసుకునేవారు.
కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అంతా భయంకరంగా చదువుకున్నవారు. దేశంలో, విదేశంలో చదివేసిన వాళ్లు. ఆ తెలివితేటలకు రాజకీయ అధికారాన్ని జోడించి, వేలకోట్ల్లు కొల్లగొడుతున్నారు. గడచిన పదేళ్లలో జరిగిన స్కాములన్నింటినీ చూడండి. అన్నింటి వెనుక వున్నది బాగా చదువుకున్న రాజకీయ జనాలే. కాకలు తీరిన కార్పొరేట్ శక్తులే. ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు, చదవుకున్న జనాలు రాజకీయాల్లో ప్రవేశించాయో అప్పుడు ఇక దయ, జాలి, అయ్యో పాపం అన్నవి మనిషి డిక్షనరీలోంచి మాయమైపోయాయి. జనాల సెంటిమెంట్లతో ఆడుకోవాలి కానీ, అటాచ్‌మెంట్లు పెట్టుకుంటే పనికిరాకుండా పోతాం.. అనే మూల సూత్రంతో ముందుకు పోతున్నారు.
ఒక్క క్షణం ఆలోచిస్తే..
ఈ దేశంలో వేలకోట్ల వ్యాపారం అమ్మాయిల పడుపు వృత్తిపై సాగుతోంది.
ఈ దేశంలో వేలకోట్ల వ్యాపారం మనిషిని నిలువునా నాశనం చేసే మాదక ద్రవ్యాలపై సాగుతోంది.
ఈ దేశంలో లక్షలాది కోట్ల వ్యాపారం మనిషిని మత్తులో ముంచే మద్యంపై సాగుతోంది.
ఈ దేశంలో వేలకోట్ల వ్యాపారం సాదా సీదా మనిషి శ్రమను దోచయడంతో సాగుతోంది.
ఈ దేశంలో వేలకోట్ల వ్యాపారం బక్కజీవిని బాధపెట్టే నల్లబజారు ఆధారంగా జరుగుతోంది.
అన్నింటికి మించి
ఈ దేశంలో లక్షల కోట్ల సంపాదన అవినీతి ఆలంబనగా సాగుతోంది.ఏం.. ఇప్పుడేం యుద్దాలు లేవు కదా.. మన మిలట్రీ అంతా ఖాళీగానే వుంది. కొద్దిమంది మాత్రం సరిహద్దు కాపలా కాస్తున్నారు.. మరి ఈ మిలట్రీని అమ్మాయిల వ్యాపారంపైకి పంపండి.. కనిపించిన బ్రోకర్‌ను, కనిపించిన ప్రతి బ్రోతల్ కంపెనీని, కనిపించిన ప్రతి కామాంధుడిని కాళ్లపై కాల్చి అయినా మూల కూర్చో పెట్టమనండి.. ఆడపిల్లలు ఎంత ఆనందిస్తారు.. ఈదేశంలో ప్రతి అక్క, చెల్లి ఎంత భద్రంగా భయం లేకుండా బతుకుతారు?
కానీ ఎలా సాధ్యం? బ్రోతల్ కంపెనీ నుంచి వాటిపై దాడి చేయాల్సిన పోలీసులకు, ఆ పోలీసుల నుంచి, వాళ్లకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చే పై అధికారులకు, వాళ్ల నుంచి వాళ్లను ఆ స్థానంలోకి చేర్చిన రాజకీయ అధికార నాయకులకు ఆ డబ్బు అలా ప్రవహిస్తూ వుండాల్సిందే కదా? మరి ఆ డబ్బు ఆఖరున అందే రాజకీయానికి అధికారం వున్నంతకాలం, మిలట్రీనో, మరో శక్తులనో ఎవరు ఆదేశిస్తారు? ఎందుకు ఆదేశిస్తారు?
కంటితుడుపు ప్రకటనలు, కల్లబొల్లి కబుర్లు, అరకొర చర్యలు.. కానీ దేశంలో ఈ అరాచకాలు ఇలా సాగిపోతూనే వుంటాయి.
మనిషి అన్ని మరిచిపోతున్నాడు
మనిషి ఇప్పుడు అధికారం రాగానే, లేదా అడ్డగోలు సంపాదనకు దిగగానే, కాదూ… అక్రమ వ్యాపారం చేపట్టగానే తాను మనిషిని అన్నదాన్ని మరిచిపోతున్నాడు. పక్కవాడు కూడా మనిషే అన్నది ముందే మరిచిపోతున్నాడు.. అవకాశం.. అధికారం ఆలంబనగా దోపిడీకి పాల్పడుతున్నాడు.
రాజకీయంతో చెట్టాపట్టాలు
సంపాదన అనేది రాజకీయానికి పర్యాయ పదంగా మారిపోయింది. ‘మా వాడు రాజకీయాల్లో వున్నాడు’… అని ఎవరైనా అంటే అది ఓ ఉపాథి మార్గంగానే చూడాల్సి వస్తోంది ఇప్పుడు. సిద్ధాంతాలు నచ్చలేదు.. రాష్ర్టం అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా.. ప్రజల కోసమే, అనుచరుల అభిప్రాయం మేరేక పార్టీ వీడుతున్నా.. వేరే పార్టీలో చేరుతున్నా అంటే.. ఫక్కున నవ్వాల్సిన రోజులు ఇవి. అంటే ఏమేరకు డబ్బు మూటలు చేతులు మారాయో అని ఆలోచించాల్సిన రోజులు వచ్చేసాయి. ఆంధ్ర కావచ్చు.. తెలంగాణ కావచ్చు.. ఈ పార్టీవారు కావచ్చు.. ఆ పార్టీ వారు కావచ్చు.. డబ్బు కోసం తప్ప వేరే విధంగా పార్టీ మారామని చెబితే నవ్వాల్సిందే. డబ్బులు తీసుకోకపోవచ్చు. అధికారం అందుతుందిగా. అది చాలు వ్యాపారాలు చేసుకోవడానికి, డబ్బు సంపాదించడానికి.
డబ్బుతో వచ్చిన జబ్బు
డబ్బుపై ఎప్పుడైతే మనిషికి మమకారం అమాంతం పెరిగిపోయిందో, అతగాడు రాజకీయ వ్యాపారిగా మారిపోయాడు. డబ్బు యావ వున్నవాడు ఎప్పుడే రాజకీయ వ్యాపారిగా మారిపోయాడో, అలా మారకుండా ఇంకా మనుషుల్లాగే బతుకుతున్న వాళ్లకి భయం బతుకులు సంప్రాప్తించాయి. రాజకీయ నాయకుల బతుకుల్ని, విలాసాలను చూసి, మిడిల్ సైజ్ నేరస్థులు పుట్టుకొచ్చారు. జైలు, పోలీసు భయం పోయింది. మహాఅయితే జైలుకు వెళ్తారు అంతేగా… దాంతో నేరం అన్నది కొత్త పుంతలుతొక్కింది.
ఎక్కడ, ఎలా వీలైతే అలా నేరం చేయడం అన్నది కామన్ అయిపోయింది. నేరం చేసి అయినా డబ్బు సంపాదించాలనే మనస్తత్వం పెరిగిపోయింది. దీంతో కామన్ మాన్‌కు కుడి ఎడమల దగా దగా అన్నట్లు తయారైంది బతుకు. ఈజీ మనీ సర్క్యులేషన్ పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటేసాయి. విలాసాలు పెరిగిపోయాయి. ఇలా డబ్బు యావ తెచ్చిన సైడ్ ఎఫెక్ట్‌లు చాలా వున్నాయి.
ఒకప్పుడు జన చైతన్యం కోసం మీడియా.. అందువల్ల ఎప్పటికైనా ప్రజల్లో మార్పు సాధ్యమవుతుందేమో అన్న ఆశ మిగిలి వుండేది మిణుకు మిణుకు మంటూ. కానీ ఇప్పుడు మీడియా అంటే అదీ డబ్బు సంపాదించి పెట్టే వ్యాపారం. అందువల్ల ఆ ఆశ కూడా అడుగంటిపోతోంది.
ఎప్పుడైతే జనాల్లో డబ్బున్న వారు.. డబ్బు లేనివారు అనే రెండే కేటగిరీలు కీలకం అయిపోయాయో, డబ్బున్న కేటగిరీ రాజకీయ వ్యాపారానికి దిగిపోయింది. డబ్బులేని కేటగిరీ అవసరం కనిపెట్టి, అవసరాలు తీర్చి, వాళ్ల నుంచి బార్టర్ సిస్టమ్‌లో ఓట్లు లాక్కోవడం ప్రారంభించింది. ఇప్పుడు ఓటు అంటే సామాన్యుడి దగ్గర వున్న ముడి సరుకు. దాంతో పింఛను కొనుక్కోవచ్చు.. ఫ్రీ సరుకులు తీసుకోవచ్చు.. ఇంకా చాలా చాలా ఫ్రీలు సంపాదించవచ్చు. కానీ ఈ కాసిన్ని ఫ్రీల కోసం తన దగ్గర వున్న ఓటు అనే ముడిసరుకు రాజకీయవ్యాపారికి ఇచ్చి వాడిని కోట్లీశ్వరుడిని చేస్తున్నాడు. తాను మాత్రం ఇంకా ఫ్రీలు కోసం ఎదురు చూసే సామాన్యుడిగానే మిగిలిపోతున్నాడు.
డబ్బు మీద యావ మరింత పెరిగేదే కాని తరగదు.. అందుకోసం రాజకీయాధికారం ఉపయోగించడం అంతకన్నా ఆగదు. కార్పొరేట్లు, రాజకీయ నాయకులైపోయి, ప్రజలకు కాసిన్ని పప్పు బెల్లాలు దోసిళ్లలో పోసి, తాము కోట్లకు కోట్లు దోచుకోవడం నిరంతర కృత్యంగా సాగిపోతోంది. ఈ అధికార అవినీతి అశ్వమేధాన్ని అడ్డుకునే వారు లేరు.. రారు. ఎందుకంటే ఇక్కడ రెండే రకాలు మిగిలాయి ఇప్పుడు.. ఒకటి ఎర వేసి చేపలు పట్టేవాడు.. రెండవది ఎర అని తెలియక నోరు సాచేవారు.
నిగ్గ దీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని…. అయినా మారదు లోకం.. మారదు కాలం.. అని ఎప్పుడో కవి సిరివెన్నెల స్పష్టం చేసేసాడు.
ఆర్వీ