కొడుక్కి ప్రేమ లేఖ రాసిన కాజల్

ప్రేమలేఖలు ప్రియుడికే రాయాలా? ఓ తల్లి కొడుక్కి రాయకూడదా? మదర్స్ డే సందర్భంగా ఓ తల్లిగా, తన తనయుడికి ప్రేమలేఖ రాసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. తన మనసులో కొడుకుపై ఉన్న ప్రేమ మొత్తాన్ని…

ప్రేమలేఖలు ప్రియుడికే రాయాలా? ఓ తల్లి కొడుక్కి రాయకూడదా? మదర్స్ డే సందర్భంగా ఓ తల్లిగా, తన తనయుడికి ప్రేమలేఖ రాసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. తన మనసులో కొడుకుపై ఉన్న ప్రేమ మొత్తాన్ని కురిపించింది. నీల్ (కాజల్ కొడుకు పేరు) అంటే తనకు ఎంతిష్టమో చెబుతూనే, అతడిపై తన మమకారం మొత్తాన్ని బయటపెట్టింది.

“నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం, నీ చిన్న చేయి పట్టుకున్నప్పుడు, నీ వెచ్చని శ్వాస, అందమైన కళ్లు.. ఇవన్నీ చూసిన తర్వాత నీతో జీవితాంతం ప్రేమలో పడిపోయాననే విషయం తెలుసుకున్నాను. నువ్వు నా మొదటి సంతానం. మొదటి కొడుకువి. నా జీవితానికి సంబంధించి అన్నీ నీతోనే మొదలైనట్టు అనిపిస్తోంది.”

ఓ తల్లిగా నీల్ కు చాలా నేర్పించాలని అనుకుంటున్నానని, కానీ నీల్ తనకు చాలా నేర్పిస్తున్నాడని చెప్పుకొచ్చింది కాజల్. ఓ తల్లిగా ఎలా ఉండాలో, అనంతమైన ప్రేమను ఎలా కురిపించాలో నీల్ తనకు నేర్పించాడని చెప్పుకొచ్చింది. తన హృదయం నుంచి ఓ ముక్క వేరుపడి కళ్లముందు నీల్ గా ప్రత్యక్షమైందని కవితాత్మకంగా రాసుకొచ్చింది కాజల్.

భవిష్యత్తులో నీల్ మరింత స్ట్రాంగ్ గా ఎదిగి, అందరి పట్ల మమకారంతో ఉండాలని కాజల్ ప్రార్థించింది. ప్రస్తుతం తనకు సూర్యుడైనా, చంద్రుడైనా, చుక్కలైనా.. అన్నీ నీల్ మాత్రమే అంటూ తనయుడికి రాసిన తొలి లేఖను ముగించింది కాజల్.