రాళ్ల ఉంగరాలు రాత మారుస్తాయా పవన్?

ఎవరో ఒక నాయకుడు ఏదో ఒక ఉంగరం తొడుక్కుని తిరిగితే దాన్ని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమేం లేదు. అదే పనిగా బోలెడు ఉంగరాలూ, ముంజేతి నిండా కట్టలు కట్టలుగా దారాలూ కట్టుకుని తిరిగే…

ఎవరో ఒక నాయకుడు ఏదో ఒక ఉంగరం తొడుక్కుని తిరిగితే దాన్ని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమేం లేదు. అదే పనిగా బోలెడు ఉంగరాలూ, ముంజేతి నిండా కట్టలు కట్టలుగా దారాలూ కట్టుకుని తిరిగే రాజకీయ నాయకులు మనకు పుంఖానుపుంఖాలుగా కనిపిస్తారు. అయితే పవన్ కల్యాణ్ అందరిలాంటి నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశ దిశ మార్చాలని స్వప్నిస్తున్న రాజకీయ నాయకుడు. అలాంటి నాయకుడు ఏం చేసినా అందరికీ ఆసక్తే. అందుకే ఈ కథనం.

తావీదు పోయె.. రాళ్ల ఉంగరమొచ్చె.. టాంటాంటాం.. అన్నట్టుగా ఉంది పవన్ కల్యాణ్ పరిస్థితి. 2019 ఎన్నికల్లో తాను అధికారంలోకి వచ్చేస్తానని చాలా బలంగా కలగన్న పవన్ కల్యాణ్ ఓ తావీదు వేసుకుని తిరిగారు. మెడలో ఎర్రదారంతో ఉన్న తావీదును బాగా కనిపించేలాగా కట్టుకుని తిరిగారు. పవన్ కల్యాణ్ కు మూఢనమ్మకాలు జాస్తి అనే సంగతి సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. 

ఆ మాటకొస్తే సినీ, రాజకీయ రంగాల్లో 99 శాతం మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. స్వాముల్ని నమ్ముకుని వాళ్లకు వందల ఎకరాలు ధారాదత్తం చేసే ముఖ్యమంత్రులకీ, స్వామి అనే ట్యాగ్ లైన్ ఉంటే చాలు, ఎదుట సాగిలపడి మొక్కే ముఖ్యమంత్రులు, మంత్రులకి ఇలాంటి పిచ్చలు చాలా చాలా ఉంటాయి. పవన్ కుండే నమ్మకాల గురించి మాత్రం చర్చ ఎందుకు అనుకోవచ్చు. అయితే పవన్ కల్యాణ్ క్షుద్రపూజలుకూడా చేయిస్తుంటారు అనే ఒక ప్రచారం కూడా ఇండస్ట్రీలో బలంగా ఉంది. 

మొత్తానికి ఆయన ఎర్రదారంతో తావీదును మెడలో ధరించి సుదీర్ఘకాలం రాజకీయం చేశారు. దానివల్ల చాలా అధికార వైభవం ఆశించినట్టు ఉన్నారు గానీ.. అదేమీ దక్కలేదు. తీరా ఇప్పుడు తావీదు వదిలేసి రాళ్ల ఉంగరాలని నమ్ముకున్నట్లున్నారు. ఆయనకు జోస్యులెవరో సలహా ఇచ్చినట్లుంది. అందుకే ఆయన బాగా కొట్టొచ్చేలా కనపడే పెద్ద ఎర్రటి రాయి (బహుశా పగడం) పొదిగిన ఉంగరం ఓదార్పు యాత్రలకు వెళుతున్నారు.

తావీదు పోయింది.. రాళ్ల ఉంగరాలొచ్చాయి. ఈ రాళ్ల ఉంగరాలు తమ నాయకుడి తలరాత మారుస్తాయా.. అధికారంలోకి తీసుకువస్తాయా అని పార్టీ వాళ్లు అనుకుంటున్నారు.

కన్నీళ్లు తుడిచేందుకు వెళ్లినా ప్రచారం యావేనా..

రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రచారం కోరుకుంటారు. ప్రతి చిన్న పనికీ ప్రచారం అతిగా కోరుకుంటారు. దీనిమీద సినిమాల్లో సెటైర్లు కూడా బోలెడు వచ్చాయి. పవన్ కల్యాణ్ సినిమా జనాలకు అంతుచిక్కనంత క్రియేటివ్ ఇన్నొవేషన్ తో ప్రచారానికి పాకులాడుతున్నారు. చనిపోయిన రైతుల కన్నీళ్లు తుడవడానికి వెళ్లి వారి భార్యలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన లాల్చీకి కాలర్ మైక్ పెట్టుకుని పరామర్శించడం మరీ లేకిగా ఉంది. 

నాయకుడు వచ్చినప్పుడు మీడియా ఆయన మాటలకోసం ఎగబడి సమీపంలో మైకులు పెట్టడం ఒక ఎత్తు. కానీ నాయకుడే తన ప్రతి మాటకీ ప్రచారాన్ని కాంక్షిస్తూ.. తానే కాలర్ మైకులు పెట్టుకుని మరీ.. ఏడుస్తున్న వాళ్లని పరామర్శించడం చవకబారు చెత్త పరామర్శ రాజకీయం. 

ఇదంతా దుర్మార్గం సాబ్.. 

ఆత్మహత్యలు చేసుకున్న రైతులు అనే సానుభూతితో ఆయన ఇచ్చేది ఒక్కో కుటుంబానికి లక్ష. కానీ.. ఆయన ప్రత్యేక విమానాలకి, ఆయన స్వాగత సన్నాహాలకు అవుతున్న ఖర్చు ఎంత? హైదరాబాదునుంచి కర్నూలుకు మహా అయితే రెండున్నర గంటల ప్రయాణం ఆయన కారులో వెళ్లలేరా? అందుకు ప్రత్యేక విమానం కావాలా? ఆయనకు అభిమానులు ఆకాశం నుంచి వేలాడదీస్తున్న గజమాలల కోసం ప్రత్యేకంగా క్రేన్ లు కావాలా..? 

తనకోసం స్వాగతం కోసం ఖర్చు పెట్టేవాళ్లంతా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా.. అదంతా తాను వచ్చిన తర్వాత.. తన చేతికే ఇవ్వాలని, ఆ యాత్రలో ఎందరు బాధిత రైతులు ఉన్నారో వారందరికీ ఆ సొమ్ము పంచుతానని పవన్ ప్రకటిస్తే గనుక.. ఈ అనవసరపు దుర్మార్గపు ఖర్చులన్నీ తగ్గించుకుంటే గనుక.. ఒక్కో కుటుంబానికి పవన్ పదిలక్షల రూపాయలు కూడా ఇవ్వవచ్చు. 

అలాంటివేమీ చేయని నాటకాల రాజకీయాన్నే పవన్ కల్యాణ్ కూడా నడిపిస్తున్నారు. ఆయన రొటీన్ రాజకీయం రొచ్చులో సాగిపోతున్న నాయకుడని కాకుండా, విభిన్నమైన నాయకుడని ప్రజలు ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి?