తమ సినిమాల్లో ఏదో ఒక విధంగా పవన్ కల్యాణ్ ప్రస్తావన కోసం తాపత్రయపడుతున్నారు టాలీవుడ్ దర్శకులు. పవన్ కంటూ ప్రత్యేక అభిమాన గణం ఒక గ్రూప్ లా ఉండటంతో… ఆయన ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఆ గ్రూప్ ను ఆకర్షిద్ధాం అని ఈ దర్శకులు ఇలాంటి ట్రయల్స్ వేస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఎవ్వరూ మిస్ కాకపోవడమే ఇక్కడ విచిత్రం. అది కూడా స్పూప్స్ లో కూడా వరసగా ఒకే స్పూఫ్ ను రిపీట్ చేయడం విచిత్రంగా ఉంది.
గత రెండు వారాల్లో వచ్చిన సినిమాలనే గమనిస్తే.. వీటిల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన ఒకే విధంగా కనిపిస్తోంది. 'బెంగాల్ టైగర్ ' సినిమాలో పవన్ నటించిన తమ్ముడు సినిమాలోని పాటను స్పూఫ్ చేశారు. పోసాని మీద ఆ పాటను చిత్రీకరించారు. 'లుకింగ్ మై ఫేస్ ఇన్ మిర్రర్…' అంటూ తమ్ముడు సినిమాలో పవన్ బాక్సింగ్ ప్రాక్టీస్ సమయంలో వచ్చే పాటను ఆ సినిమాలో పోసాని మీద చిత్రీకరించారు.
ఈ వారంలో విడుదల అయిన సినిమాలో కూడా అదే స్పూఫ్ రిపీటయ్యింది. ఈ సారి అలీ మీద ఆ పాటను స్పూఫ్ చేశారు. 'లోఫర్' సినిమాలో కూడా మళ్లీ అదే రిపీటయ్యింది. అలీని టార్చర్ పెడుతూ హీరో 'తమ్ముడు'లో పవన్ కల్యాన్ చేసే ఫీట్లన్నింటినీ చేయిస్తాడు. బ్యాక్ గ్రౌండ్ లో 'లుకింగ్ మై ఫేస్ ఇన్ మిర్రర్..'' అంటూ సాంగ్ వస్తుంటుంది.
మరి కామెడీ కోసం పవన్ కల్యాణ్ పాటలను స్పూఫ్ చేయడం బాగానే ఉంది కానీ.. వరసగా స్పూఫ్ ఎక్కువైపోతుండటం మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోందనడానికి సందేహించనక్కర్లేదు!