రివ్యూ: లోఫర్
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రీ శుభశ్వేత ఫిలింస్
తారాగణం: వరుణ్ తేజ్, దిషా పాట్ని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, అలీ, బ్రహ్మానందం, సప్తగిరి, ధన్‌రాజ్ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ, సివి రావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాధ్
విడుదల తేదీ: డిసెంబరు 17, 2015
'లోఫర్' ఫస్ట్ ట్రెయిలర్‌లోనే సినిమా కథేంటనేది పూరి జగన్నాధ్ క్లియర్ పిక్చర్ ఇచ్చేసాడు. తనని లోఫర్ అని అసహ్యించుకుంటోన్న భార్యని బాధ పెట్టడానికి పసికందు అయిన కొడుకుని తల్లినుంచి (రేవతి) వేరు చేసి, వాడిని తనకంటే పెద్ద లోఫర్‌ని చేస్తానంటూ ఎక్కడికో పట్టుకుపోయి పెంచుతాడు తండ్రి (పోసాని). తండ్రి ట్రెయినింగ్‌లో పెరిగిన కొడుకు (వరుణ్‌తేజ్) దొంగ పనులు, మోసాలు చేస్తూ బతికేస్తుంటాడు. నాన్న చెప్పినట్టు తన తల్లి జాండిస్ వచ్చి చచ్చిపోయిందనుకుంటోన్న కొడుక్కి ఓ రోజు తల్లి కనిపిస్తుంది. తల్లికి ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే చెడ్డ పని చేస్తూ కనిపించిన ఆ కొడుకు ఆమెకి ఎలా దగ్గరయ్యాడనేది కథ. దీనికి సబ్‌ప్లాట్‌గా తన మేనమామ కూతురితో (దిషా పాట్ని) ప్రేమ వ్యవహారం, దుర్మార్గులైన ఆమె తండ్రి, అన్నయ్యలతో పోరాటం.
తల్లికి దూరమైన కొడుకు కథని పూరి జగన్నాథ్ ఇంతకుముందు కూడా తీసాడు. చిరుత, ఏక్ నిరంజన్‌లో చెప్పిన కథనే ఈసారి ఇంకో కోణంలో చెప్పుకొచ్చాడు. సో కథాపరంగా కొత్తదనానికి ఆస్కారం లేదు. ఏ సినిమాకైనా స్క్రిప్టుని రెండే వారాల్లో రాసేస్తున్నానని చెబుతోన్న పూరి జగన్నాధ్ ఈ కథకి ఒక ఆకట్టుకునే కథనం జోడించడానికి కూడా పెద్దగా ట్రై చేసినట్టు అనిపించలేదు. చాలా సాదా సీదా స్క్రీన్‌ప్లేతో ఒక్కోసారి సమయానుకూలమైన మలుపులు, సన్నివేశాలతో చప్పగా నడిపించేసాడు. ఉదాహరణకి.. ఫస్ట్ పరిచయంలోనే తన చేతిలోని సూట్‌కేస్‌ని లాక్కుంటాడు హీరో. కానీ అతను దొంగ అని తెలిసినప్పుడు హీరోయిన్ ఆశ్చర్యపోతుంది.. 'ఏంటి నువ్వు దొంగవా?' అంటూ! లేచిపోయి పెళ్లి చేసుకున్న చెల్లెలు (రేవతి) కనిపిస్తే ఆమె ఎక్కడో ఉందన్నట్టు మాట్లాడతాడు అన్నయ్య (ముఖేష్ రుషి). తీరా చూస్తే అదే ఊరిలో ఉంటూ చిన్నపాటి ఉద్యమాలు చేస్తుంటుంది. ఇలా ఎక్కడికక్కడ కన్వీనియంట్‌గా కథని నడిపిస్తూ లాజిక్ అనేది లోఫర్ జోలికి రానివ్వకుండా చేసారు.
బిజినెస్‌మేన్ నుంచి చాలా సినిమాల్లో పూరి జగన్నాథ్ హీరో ఒక విధమైన బాడీలాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకుముందు ముకుంద, కంచెలాంటి ఆఫ్‌బీట్ సినిమాలు చేసిన వరుణ్‌తేజ్‌కి ఇలాంటి యాక్టివ్ క్యారెక్టర్ కొత్తేమో కానీ పూరి జగన్నాధ్ సినిమాలకి అలవాటు పడ్డ మనకేం కొత్తగా అనిపించదు. కానీ ఒక్కసారిగా క్లాస్ టు మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మాత్రం వరుణ్ ఈజీగా చూపించగలిగాడు. ఎక్కడా 'ఇది నాకు కొత్త' అనే ఫీలింగ్ రాకుండా పూరి మార్కు క్యారెక్టర్‌లోకి ఒదిగిపోయాడు. ఎలాంటి పాత్రనైనా చేసేయగలడని వరుణ్ తేజ్ దీంతో నిరూపించుకున్నాడు. ఆ విధంగా ఈ సినిమా అతనికి ప్లస్సే అనుకోవాలి. తల్లి పట్ల అపారమైన ప్రేమ పెంచుకున్న కొడుకుగా ఎమోషన్స్ బాగానే పలికించాడు. అతని తల్లి పాత్రలో రేవతి ఎప్పటిలా సహజ నటనతో ఆకట్టుకుంది. హీరోని లోఫర్ అంటున్నా కానీ.. ఆ టైటిల్‌కి జస్టిఫికేషన్ చేసే క్యారెక్టర్ మాత్రం పోసాని కృష్ణమురళిదే. ప్రతి క్యారెక్టర్‌లోను ఎక్స్‌ప్రెషన్ లేకుండా అదే చేస్తున్నా కానీ తన లౌడ్ యాక్టింగ్‌కి సరిపడే పాత్రలే తనని వెతుక్కుంటూ రావడం పోసాని లక్ అనుకోవాలి. చివర్లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ముఖేష్ రుషిని కాల్చేసే సీన్ చూస్తే పోసాని బ్లాంక్ ఫేస్ కూడా ఎస్సెట్టే అనిపిస్తుంది. దిషా పాట్నీకి అంతగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు. పూరి పరిచయం చేసిన హీరోయిన్లలో చాలామందిలా స్టార్ మెటీరియల్ అనిపించలేదు. అలీ, బ్రహ్మానందం, సప్తగిరి, ధన్‌రాజ్.. ఇలా కమెడియన్స్ అయితే ఉన్నారు కానీ నవ్వుకోతగ్గ కామెడీ లేదు. విలన్స్ బ్యాచ్ సీన్స్ అన్నీ టూమచ్ అనిపిస్తాయి తప్ప ఎఫెక్టివ్‌గా లేవు.
సువ్వీ సువ్వాలమ్మా సాంగ్ బాగున్నా మిగతా పాటలన్నీ సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతంలో 'వీడు లోఫర్' అంటూ అదే పనిగా వచ్చే థీమ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. పూరి సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ మారాలి. దాదాపుగా అన్ని సినిమాలు గోవా బీచ్‌లోనే గడిచిపోతున్నాయనే ఫీలింగ్ వస్తోంది. జోధ్‌పూర్ వరకు విజువల్‌గా కాస్త రిలీఫ్ ఇచ్చినా సెకండ్ హాఫ్ జరుగుతున్నది ఏ ప్రాంతమని ఫీలవ్వాలో కూడా తెలియని అయోమయపు స్థితి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా పూరి సినిమాల్లోని పాత పద్ధతుల్లోనే ఫాస్ట్ కట్స్‌తో సాగిపోయింది. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంలో తల్లీకొడుకుల అనుబంధాన్ని తనదైన శైలిలో హత్తుకునేలా చూపించిన పూరి జగన్నాథ్ ఇందులో కదిలించే ఒక్క సన్నివేశాన్ని కూడా పెట్టలేకపోయాడు. బిడ్డ దూరమైతే తల్లి పడే బాధని వర్ణించే సీన్‌లో కూడా డైలాగ్ రైటర్‌గా మెప్పించాడు కానీ డైరెక్టర్‌గా రాణించలేదు.
ప్రథమార్ధం మేటర్ లేకుండా సాగిపోతూ ఉంటుంది. వయొలిన్ అంటగట్టి డబ్బులు దండుకునే సీన్‌లాంటివి మరికొన్ని అయినా పెట్టి ఆసక్తి కలిగించాల్సింది. ఒక్కసారి పాత్రల తీరుతెన్నులేంటనేది తెలిసిపోయిన తర్వాత ఇక సన్నివేశాలన్నీ కేవలం గ్యాప్ ఫిల్లర్స్‌లా మాత్రమే అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో డీల్ చేయాల్సిన మేటర్ ఎక్కువైపోయి అసలు విషయం మీద ఫోకస్ తగ్గిపోయింది. విలన్స్ ఎక్కువ అవడం, అందరికీ విడివిడిగా బుద్ధి చెప్పడం, మళ్లీ కంబైన్డ్‌గా అందరికీ టోపీ పెట్టడం, ఇవి కాక మధ్యలో కామెడీ సీన్లు ఇరికించడం, ఆపై హీరోయిన్‌తో రొమాన్స్‌కి స్పేస్ ఇవ్వడం.. ఇలా ఇతర విషయాల మీద దృష్టి పెట్టి తల్లీకొడుకులు సెంటిమెంట్ పండనివ్వలేదు. పండే సీన్లు పడనివ్వలేదు. కనీసం అతను తన కొడుకేనని తల్లికి తెలిసే సీన్ అయినా ఎఫెక్టివ్‌గా రాసుకుని ఉండొచ్చు. ఆ సీన్‌లో కూడా ఎమోషన్ మిస్ అవడం, అండర్ ప్లే చేయడంలో మాస్టర్ అయిన రేవతి కూడా గీత దాటినట్టు అనిపించడంతో లోఫర్ క్లయిమాక్స్‌లో కూడా పంచ్ మిస్ అయింది. తన కొడుకని తెలిసిపోయిందని చెప్పిన తర్వాత పోసాని లాస్ట్ ఫైట్‌లోకి ఎంటర్ అయితే రేవతి ఒక షాకింగ్ లుక్ ఇస్తుంది. అది దేనికోసమో మరి.
వరుణ్‌తేజ్ మాస్ క్యారెక్టర్ చేస్తే ఎలాగుంటుందనే దానిపై ఓ ఐడియా ఇవ్వడానికి మినహా 'లోఫర్' చెప్పుకోతగ్గ హై పాయింట్లు ఏమీ లేవు… లో పాయింట్స్ తప్ప. టెంపర్ క్లయిమాక్స్‌లో పండించిన ఎమోషన్స్ లాంటి సర్‌ప్రైజ్‌లు ఏమైనా ఉంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏముండదు డిజప్పాయింట్‌మెంట్ తప్ప.
బోటమ్ లైన్: అలో జగన్నాధ!
– గణేష్ రావూరి