ఇయర్ 2015 సమంతకు అంత తీపి జ్ఞాపకాలనేమీ మిగల్చలేదు. ఈ ఏడాదిలో ఆమె కొన్ని సినిమాలపై చాలా ఆశలనే పెట్టుకున్నా.. అవేవీ అంతగా ఆమె ఆశలను నెరవేర్చలేదు. తెలుగులో టాప్ స్టేటస్ లో ఉన్న ఈ హీరోయిన్ టాలీవుడ్ లో ఒకే సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే తమిళంలో రెండు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అయితే తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా “సన్నాఫ్ సత్యమూర్తి'' పర్వాలేదనిపించిందంతే. సమంత కోరుకున్న హిట్ ను అయితే ఇవ్వలేదు ఆ సినిమా. “అత్తారింటికి దారేదీ'' సినిమాతో తనకు మంచి హిట్ ను ఇచ్చిన త్రివిక్రమ్ అలా నిరాశ పరిచాడు.
ఇక సమంత తమిళంలో నటించగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా “10 ఎండ్రాతుకుళ్లా''. అది అట్టర్ ప్లాఫ్. విక్రమ్ హీరోగా 'ఐ' తర్వాత వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మేటి డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ విధంగా సమంతకు ఈ ఏడాది రెండు పరాజాయాలు మిగిలాయి. లక్కీ గర్ల్ కు రెండు భారీ సినిమాలు అలా నిరాశను మిగిల్చాయి. ఇక ధనుష్ తో నటించిన 'తంగమగన్' ఈ వారంలోనే విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ గురించి ఇంకా క్లారిటీ లేదు.
మరో రెండు వారాల్లో ముగస్తున్న ఏడాది అనుభవాలు ఇలా ఉండగా.. వచ్చే ఏడాదిపై మాత్రం సమంత చాలా ఆశలనే పెట్టుకుంది. అది కూడా 2016 తొలి సగంలోనే సమంత సినిమాలు నాలుగు విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాదిలో సినిమాలు విజయవంతం కాకపోయినా… సమంతకు మంచి అవకాశాలైతే లభించాయి.
సూర్యతో నటించిన '24' సంక్రాంతికి విడుదల కానుంది, ఆ వెంటనే నితిన్ తో కలిసి ఈ భామ నటిస్తున్న 'అ..ఆ'' ఉంది. ఆ తర్వాత భారీ చిత్రం 'బ్రహ్మోత్సవం'' ఉండనే ఉంది. ఇంకా విజయ్ హీరోగా రూపొందుతోన్న తమిళ సినిమా 'తేరీ' లో కూడా సమంత హీరోయిన్. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల కానున్నాయి. ఈ విషయంలో సమంత చాలా ప్రౌడ్ గా ఫీలవుతోంది. వచ్చే ఏడాది దున్నేస్తాననేంత కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తోంది. మరి ఆ సినిమాలు సమంతను ఎక్కడకు తీసుకెళ్తాయో చూడాలి!