చిత్రపరిశ్రమలో రాంగోపాల్‌వర్మది ప్రత్యేక పంథా. ఎవరైనా వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. తద్వారా ప్రశాంతంగా జీవనం సాగించాలని ఇష్టపడతారు. అదేంటోగానీ, దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం నిత్యం వివాదాలనే కోరుకుంటారు.
వివాదాలతోనే తన ఉనికి చాటుకోవాలని ఆయన తపిస్తుంటారు. అందుకే ఆయన వివాదాస్పద దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందారు.
తనకు బంధాలు, అనుబంధాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పే వర్మ, ఆచరణ విషయానికి వచ్చేసరికి సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టే కనిపిస్తుంది. ఇవాళ మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తల్లులతో అనుభూతులను వివిధ వేదికల నుంచి పంచుకుంటున్నారు.
ఇందులో భాగంగా వర్మ కూడా తన మార్క్ స్పందనను ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ ట్వీట్ మిగిలిన వాటికంటే ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వెరైటీకి పర్యాయ పదమైన వర్మ, అందుకు తగ్గట్టుగానే మదర్స్ డే విషెస్ చెప్పారు.
'హ్యాపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి'.. అంటూ తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారాయన. తనకు తానుగానే మంచి కొడుకు కాదని ప్రకటించుకున్న తర్వాత, ఎవరైనా అనేదేముంది? ఈ వినూత్న ట్వీట్ వర్మ కోరుకున్నట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.