రాజకీయం అంటే అధికారం. కుర్చీ లేని పాలిటిక్స్ ఎపుడూ కిక్కు ఇవ్వదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ లీడర్స్ మాత్రం కచ్చితంగా ఈసారి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అయి తీరుతారు అని బల్లగుద్దుతున్నారు.
ఒక వైపు పొత్తుల పేరుతో టీడీపీ ఇండైరెక్ట్ గా పిలుస్తోంది. త్యాగాలు అంటోంది. రాష్ట్ర శ్రేయస్సు అని కూడా చెబుతోంది. అంతా కలసి ఏపీని రక్షించుకోవాలి అని కూడా అంటోంది. ఇవన్నీ కూడా కలగలిపి చెప్పేదేమిటి అంటే జనసేనతో మైత్రిని కోరుకోవడమే.
దానికి జనసేనకు ఇష్టం ఉందనే అనుకున్నా సీఎం ఎవరు అన్నదే ఇక్కడ పాయింట్. దీని మీద టీడీపీ వారు మాత్రం చంద్రబాబే తమ సీఎం అని చెబుతున్నారు. కానీ జనసైనికులు ఈ విషయాల్లో ఎక్కడా తగ్గేదే లేదు అంటున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా పాయకరావుపేటలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎపుడు ఎన్నికలు జరిగినా పవనే సీఎం ఈ విషయంలో క్యాడర్ ఏ రకమైన డౌట్లు పెట్టుకోవద్దు అంటూ మాట్లాడారు.
అంటే పొత్తులు ఉన్నా టీడీపీతో జట్టు కట్టినా కూడా పవనే ఈసారి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఉంటారని జనసేన నాయకులు చెబుతున్నారు అన్న మాట. మరి ఈ విషయంలో టీడీపీ ఆలోచన ఎలా ఉంటుందో. ఏది ఏమైనా జనసేనతో పొత్తు అంత ఈజీ కాదు సుమా అన్న సంకేతాలే వస్తున్నాయిపుడు.