వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ నీడలా వెంటాడుతున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డి, బండ్ల గణేష్ మధ్య తీవ్రస్థాయిలో ట్వీట్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి కమ్మ కుల ప్రస్తావన తేవడంతో బండ్ల గణేష్‌కు చిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా అన్ని మర్యాదలు విడిచి, విజయసాయిరెడ్డిపై బూతులతో విరుచుకుపడ్డారు.
తాజా మరోసారి విజయసాయిరెడ్డి ట్వీట్‌పై బండ్ల గణేష్ స్పందించడం వార్తలకెక్కింది. విజయసాయిరెడ్డి ట్వీట్‌ను తెరపైకి తెచ్చి, బండ్ల మరీ కౌంటర్ ఇవ్వడం విశేషం. అసలేం జరిగిందో తెలుసుకుందాం. శనివారం హైదరాబాద్‌లో టీవీ5 చానల్‌కు చంద్రబాబునాయుడు వెళ్లి గంటకు పైగా గడిపారు. అలాగే రాహుల్‌గాంధీని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే, ఇతర మీడియా ప్రముఖులు కలిసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
“ఎల్లో మీడియా ముఖ్యులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారు. రాధాకృష్ణ, TV5 నాయుడు, CVR సివి రావు, స్వయం ప్రకటిత మీడియా కింగ్ రవిప్రకాశ్ అర్థరాత్రి తాజ్ కృష్ణాలో రాహుల్ ను కలిశారు. ప్రధాని మోదీని ఎలా దింపొచ్చో క్షుద్ర వ్యూహాలతో బాబు కోసం ఈ దళారీ వ్యవహారాన్ని నడిపారు” అని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై బండ్ల గణేష్ తన స్వభావానికి విరుద్ధంగా గౌరవంగా స్పందించారు.
“ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ అలీ ఖాన్ గారు రాహుల్ గాంధీని కలిశారు సార్.. వారు కూడా ఎల్లో మీడియానేనా.. ?” అని చాలా గౌరవంగా విజయసాయిని ప్రశ్నించడం గమనార్హం. మోదీ మెప్పు పొందేందుకు విజయసాయిరెడ్డి అగచాట్లు పడుతున్నారనే కామెంట్స్ రావడాన్ని పరిశీలించొచ్చు.