పవన్ కల్యాణ్ నిజంగానే.. సూపర్ స్టార్ స్థాయిని దాటేశాడా..!

'బెంగాల్ టైగర్' సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో కూడా ఎక్కువగా పవన్ కల్యాణ్ ప్రస్తావనే తీసుకొచ్చాడు సంపత్ నంది. 'గబ్బర్ సింగ్ ' కు సీక్వెల్ వెర్షన్ ను తను డైరెక్ట్ చేయలేకపోయినా… భవిష్యత్తులో మళ్లీ…

'బెంగాల్ టైగర్' సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో కూడా ఎక్కువగా పవన్ కల్యాణ్ ప్రస్తావనే తీసుకొచ్చాడు సంపత్ నంది. 'గబ్బర్ సింగ్ ' కు సీక్వెల్ వెర్షన్ ను తను డైరెక్ట్ చేయలేకపోయినా… భవిష్యత్తులో మళ్లీ పవన్ ను డైరెక్ట్ చేస్తానని మాత్రం అతడు పదే పదే చెప్పుకొంటూ రాసాగాడు. మరి మీడియా ముందే కాదు, తన సినిమాలో కూడా సంపత్ నంది పవన్ కల్యాణ్ ను ప్రసన్నం చేసుకునే పని తీవ్రస్థాయిలో చేశాడు. మరి పవన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను ఎంత భజన అయినా చేయవచ్చు. ఈ భజనలో ఇతరులతో పోలిక పెట్టడం.. మరీ ఎగ్జాగరేట్ చేయడం మాత్రం కాస్త చోద్యంగా ఉంటుంది!

బెంగాల్ టైగర్ కు మాటల రచయిత కూడా అయిన సంపత్ నంది ఏమంటాడంటే… 'సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నా పెద్ద స్టార్ పుట్టడు అనుకున్నాం.. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాలేదా…?' అంటూ పోసాని చేత ఒక డైలాగ్ చెప్పించాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రస్తావన చాలానే ఉన్నా.. ఇలా పవన్ కల్యాణ్ ను మోసేయడంలో రజనీకాంత్ ను కూడా రచ్చలోకి లాగడం విచిత్రమే. పవన్ కల్యాణ్ ఇమేజ్ రజనీకాంత్ ను మించిపోయింది అనే భావనను వ్యక్త పరిచాడు ఈ దర్శక, రచయిత. 

అయితే బెంగాల్ టైగర్ సినిమా కథలో లాజిక్ లేనట్టుగానే ఈ డైలాగ్ లో కూడా లాజిక్ కనపడటం లేదు. రజనీకాంత్ అంటే ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. ఆ తమిళ హీరో సినిమా ను డబ్బింగ్ చేస్తే.. తెలుగు వాళ్లు క్యూలలో నిలబడి టికెట్లు కొంటారు. ఆయన సినిమా విడుదలను పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలుగు వాళ్లేనా? కన్నడీగులు, మలయాళీలు కూడా రజనీ సినిమాల పట్ల తమిళులకు ధీటైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. అందుకే ఆయన సౌతిండిన్ సూపర్ స్టార్ అయ్యారు. ఇక షారూక్ ఖాన్ వంటి బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా రజనీ ప్రాపకం కోసం చాలానే ట్రయల్స్ వేశాడు. అదీ రజనీకాంత్.  

కానీ పవన్ కల్యాణ్ తో పక్క రాష్ట్రాల వారికి ఉన్న పరిచయం ఎంత? అనేది ఇక్కడ కొశ్చన్ మార్క్. పవన్ కల్యాణ్ తెలుగులో నటించిన సినిమాలు  ఎన్ని డబ్బింగ్ అయ్యాయి? ఈయన సినిమాలు ఎక్కడైనా ఆడాయా? తమిళనాడులోని మారు మూల గ్రామీణ ప్రాంతాలకు వెళితే పవన్ ను గుర్తుపట్టే పరిస్థితి ఉంటుందా?! ప్రశ్నలకు సమాధానాల కోసం తచ్చాడాల్సిందే.  మేము ఫ్యాన్స్  కాబట్టి…మా అభిమాన హీరో సౌతిండియాకే సూపర్ స్టార్ , హాలీవుడ్ కు మెగా స్టార్.. అనుకొంటాం, అంటే మాత్రం వీరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు! ఆ ప్రపంచంలో హాయిగా బతికేయవచ్చు!