తామిద్దరం మళ్లీ ఒకటైనట్టుగా ప్రకటించుకున్నారు దర్శకుడు శీనువైట్ల, రచయిత కోన వెంకట్. 'బ్రూస్ లీ' సినిమా వివాదం తర్వాత తామిద్దరం ఒకటైనట్టుగా వీళ్లు ప్రకటించుకున్నారు. ఈ రాజీకి మీడియానే సాక్ష్యం అని కూడా వీరు ప్రకటించారు. తామిద్దరం ముందు ముందు ఒకే సినిమాకు పనిచేసినా ఆశ్చర్యపోవద్దు.. ఇద్దరూ కూర్చుని ఒక సినిమాను ప్రమోట్ చేసిన విస్తుపోవద్దు… అని వీళ్లు మీడియాకు సూచించారు. మంచిదే… ఇద్దరం స్నేహితులం అని ప్రకటించుకోవడాన్ని స్వాగతించవచ్చు.
అయితే ఇది ఎన్నో సారి రాజీ అవడం? అనేదే ప్రశ్న. అప్పుడెప్పుడో బాద్ షా సినిమా వచ్చినప్పుడు వీళ్లు మధ్య వివాదాలు మీడియాకు ఎక్కాయి. రచయితగా తనో ఎంతో క్రియేటివిటినీ ప్రదర్శిస్తుంటే.. ఆ క్రెడిట్ తనకు దక్కడం లేదని అప్పట్లో కోన వెంకట్ మీడియాకుఎక్కాడు. తన రచనా స్కిల్స్ కు సంబంధించిన క్రెడిట్ అంతా దర్శకుడు శీనువైట్ల సొంతం చేసుకొంటున్నాడన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ఇంటర్వ్యూలో అలా మాట్లాడిన కోనకు శీనువైట్ల కూడా మళ్లీ గట్టిగానే సమాధానం ఇచ్చాడు.
దీంతో ఇద్దరి మధ్య తేడాలు రచ్చకు ఎక్కినట్టైంది. ఆ తర్వాత ఎవరికి వారు సినిమాలు చేసుకున్నారు. హీరో రామ్ చరణ్ వీళ్లద్దరినీ రాజీ చేశాడు. 'బ్రూస్ లీ' సినిమా కోసం ఈ హిట్ కాంబో రిపీట్ అయ్యేలా చూసుకున్నాడు. వీళ్ల కాంబినేషన్ అయితే రిపీటయ్యింది కానీ… హిట్ మాత్రం రిపీట్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ కోన రెచ్చిపోయాడు. తను మంచి సీన్లను రాస్తే వాటిని వృథా చేశారని దర్శకుడిని దెప్పిపొడిచాడు. ఆ తర్వాత తలెత్తిన వివాదాలపై ఇప్పుడు రాజీపడ్డాం అని అంటున్నారు!
మరి ఒకసారి గొడవ పడే వాళ్ల గురించినో.. ఒక సారి రాజీపడ్డ వారి గురించినో.. జనాలు పట్టించుకొంటారు కానీ, మూణ్ణాలకు ఒకసారి ఇలా జనాల ముందుకు వస్తే అది ప్రహసనం అవుతుందని ఎంతో కామెడీ ని రాసి, తెరకెక్కించిన వీళ్లకు తెలియదా?!