జవాబులు – ''వసంతసేన''లో హీరోయిన్ పద్మినే. నేను తప్పుగా రాశాను. నేను ''ఉత్సవ్'' చూశాను కానీ అది చూడలేదు. చూసినవాళ్లెవరైనా వుంటే ఒక సందేహం తీర్చగోర్తాను. ఆ సినిమా వాల్‌పోస్టర్లో నాగేశ్వరరావు కత్తి పట్టుకున్నట్లు వుంది. చారుదత్తుడికే విప్లవవీరుడు ఆర్యకుడి పని కూడా అప్పగించేశారా? కత్తియుద్ధం వేరే వాళ్లు చేస్తే హీరోకు హీరోయిజం తగ్గిపోతుందనుకున్నారా? ''ఉత్సవ్''లో మార్పులు చేశారు. వసంతసేన చివర్లో శకారుణ్ని ఆదరించినట్లు చూపించారు. ఎందుకంటే శకారుడు పాత్ర వేసిన ఆ సినిమా నిర్మాత శశి కపూర్! వసంతసేన యింట్లో జరిగే కామకార్యకలాపాలను పరిశీలించి వాటి ఆధారంగా ''కామసూత్ర'' పుస్తకం రాయడానికి వాత్సాయనుడు (ఆ పాత్ర వేసినది అమ్జాద్ ఖాన్) అక్కడే తచ్చాడినట్లు కల్పించారు. 2. శకారుడు కుంతిని, రావణున్ని ఎందుకు కలిపాడని ఒకరు అడిగారు. శకారుని పాత్రలో విశేషమే అది. తర్వాతి కాలంలో యింగ్లీషు నిర్వచనం ద్వారా ప్రసిద్ధి కెక్కిన మేలప్రాపిజం, స్పూనరిజం యీ పాత్ర ద్వారా ప్రయోగించాడు నాటక రచయిత. అంతేకాదు, అనేక నీచోపమానాలు కూడా పలికించాడు. పోలిక చెప్పినపుడు ఉన్నతమైన దానిలో పోల్చాలి తప్ప తక్కువదానితో పోల్చకూడదు. ప్రియురాలి మొహం చందమామలా వుందనాలి తప్ప పెరుగుకుండలా వుందనకూడదు. విలనీ, కామెడీ రంగరించి విలక్షణమైన డైలాగులతో సంస్కృతసాహిత్యంలో శకారుడి పాత్రను మరుపురాని పాత్రగా రచయిత తీర్చిదిద్దాడు. ''చాణక్య-చంద్రగుప్త'' సినిమాలో రచయిత పింగళి నవనందులకు ఒక మేనమామ పాత్ర కల్పించి (రావు గోపాలరావు వేశారు) దానికి శకారుడి లక్షణాలను, సంభాషణలను అద్దారు.
తర్వాత దృశ్యం జూదశాలలో ప్రారంభమైంది. చారుదత్తుడి వద్ద సంవాహకుడు అనేవాడు ఒళ్లు పట్టే పనివాడిగా వుండేవాడు. డబ్బు తరిగిపోయాక అతన్ని పనిలోంచి తీసేశాడు. అతను యిప్పుడు జూదగాడై పోయాడు. ఆ రోజు జూదంలో సర్వస్వం పోగొట్టుకుని జూదశాల నడిపే ద్యూతకరుడికి, సాటి జూదగాడు మాథురుడికి పది బంగారు నాణాలు బాకీ పడ్డాడు. అది యివ్వలేకపోవడంతో వాళ్లు పట్టుకుని తన్నారు. ఇతను పారిపోయి ఒక శూన్యదేవాలయానికి వచ్చాడు. వాళ్లు వెంటాడి వస్తున్నారు కాబట్టి వాళ్లను ఏమార్చడానికి ఆ గుడిలోనే ఒక విగ్రహంలా నిశ్చలంగా నిలబడ్డాడు. కొద్ది సేపటికే వాళ్లు వచ్చారు. అతని అడుగుజాడల బట్టి గుళ్లోకి వచ్చాడని గ్రహించారు. ఆ విగ్రహం చూసి సంగతి గ్రహించారు. అతన్ని బయటపెట్టడానికి అక్కడే కూర్చుని జూదం ఆడడం మొదలుపెట్టారు.
ఆ పాచికల చప్పుడు సహజంగా జూదరి ఐన సంవాహకుడి మనస్సును లాగేసింది. ఆట మధ్యలో నాటకం కట్టిపెట్టి తనూ వచ్చి పందెం వేయడానికి కూర్చున్నాడు. వెంటనే వాళ్లిద్దరూ పట్టుకుని డబ్బు యిస్తావా లేదా అని తన్నబోయారు. నీ గురించి జూదరుల సంఘానికి ఫిర్యాదు చేశాం, వాళ్లు నిన్ను బంధించి తెమ్మన్నారు అన్నారు. విషయం అక్కడిదాకా వెళ్లిందా? అయ్యో ఎలాగాని యితను దిగులుపడ్డాడు. వాళ్లు జాలి పడి 'ఎంతో కొంత చెల్లించి, తక్కినది తర్వాత యిస్తానని ఒట్టేసుకో' అని సూచించారు.
అప్పుడు యితను ద్యూతకరుడి చేతిలో చేయి వేసి, నీకు సగం చెల్లిస్తాను, తక్కినవది వదిలేయకూడదా? అన్నాడు దీనంగా. అతను జాలిపడి సరే అన్నాడు. అప్పుడు మాథురుడితో కూడా అలాగే అడిగాడు. అతనూ సగం వదిలేయడానికి ఒప్పుకున్నాడు. 'సగం నువ్వు వదిలేశావ్, సగం అతను వదిలేశాడు, మొత్తం అప్పు తీరిపోయింది, నేనింక వెళ్లవచ్చు' అన్నాడు సంవాహకుడు. ఇద్దరూ మండిపడ్డారు. 'మోసం చేయాలని చూడకు, నిన్ను నువ్వు అమ్ముకునైనా అప్పు తీర్చు' అని రొక్కించారు. పద రాచవీధికి వెళదాం అని బయలుదేరారు. అక్కడ నన్ను ఎవరైనా కొనండి, మీ యింట్లో పనిచేస్తాను అంటూ ఎలుగెత్తి పిలిచినా జనమందరూ మూగినా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. ఇక ఏం చేయాలో తెలియక అతను హతాశుడయ్యాడు.
ఆ వీధిలోనే దర్దురుడు అనే మరో జూదరి మరో జూదగృహంలో డబ్బు పూర్తిగా పోగొట్టుకుని వస్తున్నాడు. అతను మాథురుణ్ని చూసి తను గతంలో ఆడే జూదగృహం నిర్వాహకుడని గుర్తుపట్టాడు. పాతబాకీ ఏదో వుంది కాబట్టి గుర్తుపట్టకుండా భుజాన వున్న కండువాను మొగానికి కప్పుకోబోయాడు. తీరా చూస్తే దానినిండా చిల్లులే. ఇక లాభం లేదనుకుని ఆ గుంపు దగ్గరకు వెళ్లి చూశాడు. సంవాహకుణ్ని గుర్తుపట్టాడు. నాలాటి మొండిఘటం జూదానికి దిగినా ఫర్వాలేదు కానీ యిలాటి అనుభవశూన్యుడు, సుకుమారుడు జూదం జోలికి రాకూడదు అనుకుంటూ అతనిపై జాలితో ధైర్యం చేసి సంగతేమిటని మాథురుణ్ని అడిగాడు.
పది సువర్ణాలు అప్పుపడ్డాడితను అని జవాబిచ్చాడు మాథురుడు. 'ఓస్, యింతేనా, నేను తినే చద్దన్నం పాటి చేయదు పది సువర్ణాలు' అన్నాడు దర్దురుడు డాబుగా. మాథురుడికి ఒళ్లుమండి దర్దురుడి చంకలో వున్న కండువాను లాగి జనాలకు చూపించి 'చూడండి, జల్లెడలా వున్న యీ కండువా కప్పుకున్నవాడు చెప్పే కబుర్లు వినండి.' అని వెక్కిరించాడు. దర్దురుడు దర్పం విడకుండా 'డబ్బుంది కదాని ఒళ్లో పెట్టుకుని తిరుగుతారా? పదినాణాలు నాకిచ్చి నాతో పాచికలు వేసి చూడు. గెలిచి నీ ఒళ్లో పోస్తాను. వెధవ డబ్బు గురించి సాటిమనిషిని సాధిస్తావా?' అని సుద్దులు చెప్పబోయాడు.
''నువ్వు గెలవకపోతే..?''
''ఓడిపోతే ఎలా యిస్తాను?''
''నీ టక్కరితనం నా దగ్గర కాదు. నేనూ జూదగాడినే, యీ పాటి తెలివితేటలు నాకూ వున్నాయి'' అని మాథురుడు కోపం తెచ్చుకున్నాడు.
ఏదో విధంగా మాథురుడితో తగవు పెట్టుకుని, అతని దృష్టిని మరల్చి సంవాహకుణ్ని తప్పించాలనే ఆలోచనతో సంవాహకుడికి పారిపోమని రహస్యంగా సైగ చేసి ''ఎవడురా టక్కరి? నీ బాబు టక్కరి'' అంటూ తిట్లు లంకించుకున్నాడు. అది గ్రహించి మాథురుడు సంవాహకుణ్ని తన్నసాగాడు. ఎంత అన్యాయం అంటూ దర్దురుడు వచ్చి అడ్డుపడబోతే అతనికీ నాలుగు దెబ్బలేశాడు. అతను తిరిగి మాథురుణ్ని కొట్టాడు. 'చూడు నీ మీద రాజుకు ఫిర్యాదు చేస్తాను. రాజసభలో కూడా కొడతావేమో చూస్తాను' అంటూ మాథురుడు ఎగిరిపడ్డాడు.
'అలాగే చూడు, చూడు' అంటూ దర్దురుడు కిందకు వంగి గుప్పిళ్లతో మట్టి తీసుకుని అతని కళ్లలోకి కొట్టి మూర్ఛ నటిస్తున్న సంవాహకుడికి సైగ చేశాడు. అతను లేచి పారిపోయాడు. మాథురుడు కళ్లు నులుముకుంటూ నేలమీద పడ్డాడు.
అప్పుడు దర్దురుడి భయం వేసింది. 'సాటి జూదరిపై జాలితో తీరికూర్చుని వీళ్లతో వైరం తెచ్చుకున్నాను. ఇక్కడ ఎక్కువసేపు వుంటే జూదశాల మనుషులు వచ్చి తంతారు. నా మిత్రుడు శర్విలకుడు చెప్తూ వుంటాడు- ఒక సిద్ధుడి ఉపదేశంతో ఆర్యకుడనే గొల్లపిల్లవాడు రాజు దుష్టపరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడని, రాజు చర్యలతో విసిగిన అనేకమంది ప్రజలు అతనికి అనుచరులుగా మారుతున్నారని. నేను కూడా వారితో చేరతాను.' అనుకుని అక్కణ్నుంచి పారిపోయాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)