సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ల కన్నా హీరోల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్టార్ డమ్… పారితోషకం.. ఇలా ఎలా చూసుకున్నా దర్శకుల కన్నా హీరోల రేంజ్ ఎక్కువ.. మరి సినిమా ఇండస్ట్రీలో ఉనికిని వారసత్వంగా ఇవ్వడంలో కూడా దర్శకులకు కష్టాలు తప్పడం లేదు. హీరోల వారసులేమో ముక్కూ మొహం సరిగా లేకపోయినా… ఎంచక్కా స్టార్లు అయిపోతున్నారు. తండ్రుల కు ఉన్న అభిమాన బలగాన్ని, ఇండస్ట్రీలో ఉన్న బేస్ ను ఆధారం చేసుకుని అల్లుకుపోతున్నారు.
హీరోల తనయులే కాదు.. పేరున్న హీరోలకు దూరం బంధువులు అని చెప్పుకోవడం కూడా ఇండస్ట్రీలో ఒక హోదా. మరి హీరోల ప్రభావం ఇలా ఉంటే.. దర్శకుల తనయుల పాట్లు మాత్రం వేరే రకంగా ఉంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో టాప్ అనిపించుకున్న చాలా మంది దర్శకుల తనయులు సినిమాలనే వారసత్వంగా తీసుకున్నారు. అయితే వారిలో బాగా సక్సెస్ అయిన ఇద్దరుముగ్గురు పేర్లను చెప్పడం కూడా కష్టం. ఇప్పటికే చాలా మంది దర్శకుల తనయులు హీరోల వేషం కట్టి సక్సెస్ కాలేకపోయారు. కొందరు మాత్రం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
ఇలాంటి వారిలో ఒక తెలుగు టాప్ దర్శకుడి తనయుడొకరు.. దర్శకుడిగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా సక్సెస్ కాలేకపోయిన ఇతడు కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడిగా మారాడు.. తొలి సినిమా ఏదో అవార్డెడ్ పిక్చర్.. దాని సంగతి ఎవరికీ తెలియదు. రెండో సినిమా కమర్షియల్ పిక్చర్ అయితే అది బాక్సాపీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. మూడో సినిమా ఇటీవల వచ్చి కోట్ల రూపాయల లాస్ అయ్యింది. అయితే ఈ సినిమాల విడుదలకు ముందుకు ప్రచారం మాత్రం పతాక స్థాయికి చేరింది. తీరా విడుదల అయ్యాకా అవి తుస్సుమన్నాయి.
ఇలా వరస గా జరుగుతుండే సరికి ఈ దర్శకుడి తండ్రి అభిమానులు కొందరు విలువైన సూచన చేస్తున్నారు. 'మీ నాన్నపై ఉన్న అభిమానం కొద్దీ చెబుతున్నాం… నువ్వు సినిమాలు తీయడం ఆపెయ్.. దర్శకుడిగా నువ్వు తగ్గితే.. దర్శకుడిగా మీ నాన్నకు విలువ ఉంటుంది.. 'అని వారు సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఆ దర్శకుడి తనయుడు వీటిని పరిగణనలోకి తీసుకోవాలేమో!