‘పవన్‌’తో హిట్‌..’చిరంజీవి’తో ఫెయిల్‌..!

దర్శకుడు అరుణ్‌ ప్రసాద్‌కు ఒక ఆసక్తికరమైన ప్రతిభ ఉంది. ఒక మూలకథను తీసుకుని.. దానికి కొన్ని మార్పులు చేసి చాలా లావిష్‌గా మరో పిక్చర్‌ను రూపొందించడం అరుణ్‌ ప్రసాద్‌కు ఉన్న ప్రతిభ. ఇలాంటి ప్రతిభను…

దర్శకుడు అరుణ్‌ ప్రసాద్‌కు ఒక ఆసక్తికరమైన ప్రతిభ ఉంది. ఒక మూలకథను తీసుకుని.. దానికి కొన్ని మార్పులు చేసి చాలా లావిష్‌గా మరో పిక్చర్‌ను రూపొందించడం అరుణ్‌ ప్రసాద్‌కు ఉన్న ప్రతిభ. ఇలాంటి ప్రతిభను ''తమ్ముడు'' సినిమా చాలా చక్కగా పండించాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందించిన ఆ సినిమాకు మూలం ''జో జీతా వహి సికిందర్‌''. ఆమిర్‌ ఖాన్‌ హీరో 1992లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా అది. ఆ తర్వాత ఏడెనిమిదేళ్లకు ఆ సినిమా స్క్రిప్ట్‌ దుమ్ము దులిపి దానికి తనదైన మసాలాను దట్టించి తెలుగులో రీమేక్‌ చేశాడు అరుణ్‌ ప్రసాద్‌. అలా మార్పు చేర్పులు చేసిన సినిమానే ''తమ్ముడు''. హిందీ వెర్షన్‌ సినిమాకూ తెలుగు వెర్షన్‌కు ప్రధానమైన తేడా.. చిన్నదే. తమ్ముడు సినిమాలో కిక్‌ బాక్సింగ్‌ను నేపథ్యంగా తీసుకొంటే..  ఒరిజినల్‌లో సైకిల్‌ రేసులను నేపథ్యంగా తీసుకున్నారు.  హీరో ఆమిర్‌ ఖాన్‌ అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. అతడి అన్న చాలా హంబుల్‌ స్టూడెంట్‌. అంతేగాక సైక్లింగ్‌లో మేటి. ఇంటర్‌ కాలేజీ చాంపియన్‌ షిప్స్‌లో పాల్గొంటుంటాడు. అందరి మన్ననలు పొందుతూ ఉంటాడు. చిన్నాడైన హీరో ఏమో తన ఆకతాయి చేష్టలతో అందరితోనూ తిట్లను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక అమ్మాయిల కోసం అతడు వేసే వేషాలు… అన్నీ 'తమ్ముడు' సినిమాలో చూపేవే! 

బాలీవుడ్‌ సినిమాలో అంత స్పైసీగా అనిపించని సైకిల్‌ రేసులతో సినిమాను నడిపిస్తే.. అరుణ్‌ ప్రసాద్‌ మాత్రం కథను కిక్‌ బాక్సింగ్‌ వైపు నడిపించి సినిమాకు కావాల్సినంత స్పైసీ నెస్‌ను అద్దాడు. రీమేక్‌ అంటే మేకు దిగ్గొట్టినట్టుగా కాదు… కొత్తగా కూడా చేయొచ్చన్న విషయాన్ని నిరూపించాడు. తమ్ముడు సినిమా పెద్ద హిట్‌. పవన్‌ కల్యాణ్‌ 'సుబ్బు' క్యారెక్టర్‌ను పండించిన తీరు.. రమణ గోగుల మ్యూజిక్‌ ఆ సినిమాను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమా ఎంత హిట్‌ అంటే… దీన్ని తమిళంలో, కన్నడలో కూడా రీమేక్‌ చేశారు. ఎప్పుడో వచ్చిన బాలీవుడ్‌ సినిమాను తను కొత్త స్టైల్‌లో రీమేక్‌ చేసి.. ఒరిజినల్‌ను మరిచిపోయి.. అందరూ ఈ సినిమా రైట్స్‌ను తీసుకెళ్లి రీమేక్‌ చేసేంత విజయాన్ని నమోదు చేశాడు ఈ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా 'బద్రీ' పేరుతో రీమేక్‌ అయ్యింది. దానికీ అరుణ్‌ ప్రసాదే దర్శకత్వం వహించాడు. హిందీలో 'జోజీతా…'ను ఒక క్లాసిక్‌గా అభివర్ణిస్తారు. ఆమిర్‌ ఖాన్‌ స్టార్‌గా ఎదిగే క్రమంలో అతడికి బాగా ఉపయోగపడ్డ సినిమా అది. 

మరి బాలీవుడ్‌ క్లాసిక్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని దాని నేపథ్యంలో మార్పులు చేసి.. మరో హిట్‌ను కొట్టిన ఈ దర్శకుడు ఇదే కాన్ఫిడెన్స్‌తో మరో ప్రయత్నం చేశాడు. ఇది మాత్రం బెడిసి కొట్టింది. అరుణ్‌ ప్రసాద్‌ చేసిన దుస్సాహసం అయ్యింది. ''మా నాన్న చిరంజీవి'' అని ఒక సినిమా వచ్చిందని బహుశా కొంచెం తక్కువమందికి తెలిసి ఉంటుంది. జగపతిబాబు హీరోగా నటించిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్న సమయంలో వచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమా ఎక్కడైనా నాలుగైదు రోజులైనా ఆడిందో లేదో తెలీదు కానీ.. ఈ సినిమా ఒక ప్రసిద్ధ ఆంగ్ల సినిమాకు ఫ్రీమేక్‌. అది కూడా అరుణ్‌ ప్రసాద్‌ మార్కుది. 

'ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌'' విల్‌ స్మిత్‌ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసిన సినిమా. విడుదలై దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయినా… ఇప్పటికీ ఈ సినిమా గురించి ఆన్‌లైన్‌ రివ్యూలు రేటింగులు… పబ్లిష్‌ అవుతూనే ఉంటాయి. ఈ సినిమా గురించి మాట్లాడగలగడం ఒక గొప్పదనం. అంత గొప్ప సినిమా ఇది. అమెరికన్‌ వ్యాపారవేత్త క్రిస్‌ గార్డనర్‌ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా నటుడిగా విల్‌ స్మిత్‌లోని అద్భుత ప్రతిభను ఆవిష్కరించింది. 

హీరో ఒక సేల్స్‌మాన్‌ తన దగ్గర మొత్తం డబ్బును కొత్త రకం ఎక్స్‌రే  మెషిన్‌ మీద చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టి వాటిని తిరిగి అమ్మాలని చూస్తే నష్టం వస్తుంది. మొత్తం డబ్బు వాటి మీదే పెట్టడంతో కుటుంబ పోషణ కష్టం అవుతుంది. భార్య అతడిని వదిలి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భంలో కొడుకు పోషణను తీసుకున్న ఆ తండ్రి తిరిగి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని సెటిలవ్వడం వరకూ పడ్డ కష్టమే ఈ సినిమా. 

ఇదే సినిమాను తెనుగీకరించి 'మా నాన్న చిరంజీవి'గా చూపించాడు అరుణ్‌ ప్రసాద్‌. అయితే తెలుగు వెర్షన్‌ ఒక ప్రహసనం. ఒక ఉన్నత స్థాయి సినిమాను సగటు స్థాయికి.. అంతకన్నా దారుణమైన స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం అయ్యింది. 'తమ్ముడు' విషయంలో ఎక్కడైతే అరుణ్‌ ప్రసాద్‌ తన సత్తా చూపించాడో.. ఈ హాలీవుడ్‌ సినిమాను దించడంలో అక్కడే దారుణంగా ఫెయిలయ్యాడు. హీరోకి పల్లెటూరి నేపథ్యాన్ని పెట్టి… భార్య మాట విని ఆస్తులన్నీ పోగొట్టుకొన్నట్టుగా… ఆస్తుల్లేని ఇతడిని వదిలి ఆమె వెళ్లిపోయినట్టుగా.. దీంతో చేసేది లేక కొడుకును పిలుచుకుని హీరో హైదరాబాద్‌కు వచ్చినట్టుగా చూపించారు. ఇలాంటి తీరుతో ఎపిక్‌ లాంటి సినిమాను అనామకంగా తయారు చేశారు. ఆ సినిమా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించారు. తెలుగు వెర్షన్‌లో అంతో ఇంతో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే అది జగపతి బాబు ప్రదర్శనను. అయితే విల్‌ స్మిత్‌తో పోల్చకుండా.. చూస్తే జస్ట్‌ ఓకే!

హాలీవుడ్‌ వెర్షన్‌లో తను కొన్న ఎక్స్‌రే మిషన్లలో అన్నీ అమ్ముడయిపోయినా ఒకటి మాత్రం హీరో దగ్గరే ఉండిపోతుంది. దాన్ని సరిచేసి అమ్మేస్తే కొంత డబ్బు వస్తుందన్న హీరో ప్రయత్నాలు మనసును తాకుతాయి. స్టాక్‌ ఎక్సైంజ్‌లో అప్రెంటిస్‌గా జాయిన్‌ అయిన తర్వాత కూడా ఎక్కడకు వెళ్లినా దాన్ని తన వెంటే తీసుకొని వెళుతుంటాడు. ఒక సందర్భంలో రైల్వే స్టేషన్‌లో పెట్టి దాన్ని మరిచిపోవడం.. అదొక పిచ్చోడి చేతిలో పడటం.. తిరిగి దాన్ని లాగేసుకునే ప్రయత్నంలో ట్రైన్‌ మిస్‌ కావడం.. ఆ రాత్రి కొడుకుతో సహా రైల్వే స్టేషన్‌ బాత్రూమ్‌లో తలదాచుకోవాల్సి రావడం వంటి సీన్లు… కదిలించి వేస్తాయి. ఈ సీన్లలో కొన్నింటినీ తెలుగు వెర్షన్‌లో కూడా ఇరికించాడు అరుణ్‌ ప్రసాద్‌. హీరో నగరానికి వచ్చాక తన దగ్గర ఉన్న మొత్తం డబ్బుతో డిక్షనరీలు కొన్నట్టుగా చూపించారు. అవి అమ్ముడుగాక.. అతడు పడే ఇబ్బందులతో హాలీవుడ్‌ను అనుకరించారు. 

'ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' 1980ల నాటి అమెరికాను కళ్ల ముందు ఆవిష్కరించింది. అక్కడా రోడ్లపై తాగి పడిపోయే తాగుబోతులుంటారు.. జనాలు వారిని పట్టించుకోకుండా తమ పనులకు తాము వెళ్లిపోతూ ఉంటారు… ఇండియాలో లాగే మతిస్థిమితం లేని వ్యక్తులు యధేచ్ఛగా తమ దారంట తాము సాగిపోతూ ఉంటారు.. అనే విషయాలను సగటు భారతీయులకు అర్థమయ్యేలా చేస్తుంది ఆ సినిమా. ఇలా ప్రసిద్ధ హాలీవుడ్‌ సినిమాల్లోని మూలకథను యథాతథంగా తీసుకుని.. వాటి క్లాసిక్‌ ఇమేజ్‌ను చెడగొట్టిన వాళ్లు ఇంకా చాలా మందే ఉన్నారు. వారిలో అరుణ్‌ ప్రసాద్‌ బాలీవుడ్‌ క్లాసిక్‌ను దించడంలో సక్సెస్‌ అయ్యి.. హాలీవుడ్‌ జోలికెళ్లి ఫెయిలయ్యాడు!