ధోనీ.. రాజకీయ పార్టీ అధినేతలా మారాడా..?!

ఒకరేమో ధోనీ చెబితే 24 వ అంతస్తు నుంచి కూడా కిందకు దూకేస్తానంటారు.. మరొకరేమో ధోనీ క్యారెక్టర్ అద్భుతం.. అతడు మిస్టర్ కూల్. .అతడి కూల్ నెస్ ను చూసి మాకే కుళ్లు వచ్చేస్తోంది..…

ఒకరేమో ధోనీ చెబితే 24 వ అంతస్తు నుంచి కూడా కిందకు దూకేస్తానంటారు.. మరొకరేమో ధోనీ క్యారెక్టర్ అద్భుతం.. అతడు మిస్టర్ కూల్. .అతడి కూల్ నెస్ ను చూసి మాకే కుళ్లు వచ్చేస్తోంది.. అంటున్నారు!

అంతిమంగా టీమిండియా కెప్టెన్ ను వీళ్లంతా ఆకాశానికెత్తేస్తున్నారు! ఇంతలా ఆకాశానికెత్తేయడం వరకూ బాగానే ఉంది. అయితే ధోనీ ని ఎంతలా ప్రశంసించినా.. ఆయన ఎంత గొప్పోడు అయినా.. ప్రపంచకప్ లో ఆయన ఆధ్వర్యంలోని టీమిండియా సెమిస్ వరకే వెళ్లింది. మరి టీమ్ ను సెమిస్ వరకూ తీసుకెళ్లి అక్కడ చిత్తైన జట్టు కెప్టెనే అద్బుతమైన వ్యక్తి అయితే.. ఫైనల్ వరకూ వెళ్లిన వారు ఇంకెంత గొప్పవాళ్లు? ప్రపంచకప్ ను జయించిన జట్టు కెప్టెన్ ఇంకెంత గొప్ప వాళ్లు?!

అయితే.. చాలా మంది క్రికెటర్లు.. మాజీ క్రికెటర్లు ధోనీని “సరి లేరు నీకెవ్వరూ..'' అంటున్నారు. దీని వెనుక చాలా సమీకరణాలే ఉన్నాయని ఎవ్వరికైనా ఇట్టే అర్థం అవుతుంది. దోనీ ఒక సూపర్ పవర్ గా మారినందునే ఇలాంటి భజన జరుగుతోందని అంటున్నారు. 

ధోనీ ఇండియన్ టీమ్ ను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గా మార్చేశాడనే అభిప్రాయాలూ ఉన్నాయి. భారత క్రికెటర్లకు ఎవరికరైనా చెన్నై టీమ్ లో చోటు దక్కితే చాలు.. వారికి జాతీయ జట్టులో చోటు దక్కడం పెద్ద కష్టం కాదు.. అస్సలు సరిగా ఆడకపోయినా.. జట్టులో చోటు అలాగే ఉంటుంది.. అనే అభిప్రాయాలున్నాయి. 

చెన్నై జట్టుకు ఆడుతూ ధోనీ భజన చేసే వాళ్లకు టీమిండియాలో శాశ్వత ఆవాసం కనిపిస్తోంది. ఈ వీక్ నెస్ ను కనుగొనే ఇషాంత్ శర్మ వంటివాళ్లు చెన్నైకి ఆడకపోయినా బయట నుంచే ధోనీ భజన మొదలు పెట్టారు.

ఇక ధోనీ కూల్ నెస్ ను  చూసి కుల్లొచ్చేస్తుందంటున్న మైక్ హస్సీ.. టార్గెట్ ఇండియన్ కోచ్ పదవి అని తెలుస్తోంది. ఫ్లెచర్ నిష్క్రమణతో ఖాళీ అయ్యే ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికే టీమిండియా కెప్టెన్ ను హస్సీ ప్రశంసిస్తున్నాడు. ఈయనకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. మరి రేపు  హస్సీ కోచ్ అయితే.. దోనీపై మరిన్ని అనుమానపు చూపులు పడటం ఖాయం!

మొత్తానికి టీమిండియా కెప్టెన్ భజన చేస్తున్న వారిని చూస్తుంటే.. కాంగ్రెస్ , బీజేపీల్లో అధినాయకత్వం భజన చేసే నేతలు గుర్తుకురాక మానరు!