2009 ఎన్నికలలో 6.4% ఓట్లుతెచ్చుకున్న కేరళ బిజెపి ఇటీవలి పార్లమెంటు ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని 10.3% ఓట్లు సంపాదించిన విషయం సిపిఎంను కలవరపరుస్తోంది. అందుకే సెప్టెంబరు 1న కన్నూరులో 42 ఏళ్ల ఆరెస్సెస్ నాయకుడు మనోజ్ దాడికి గురై చనిపోయినపుడు, దాని వెనక్కాల సిపిఎం నాయకుల హస్తం వుందని అనుమానించారు. కన్నూరులో రెండు పార్టీల మధ్య ఘర్షణలు 1960 ముందు నుండే ప్రారంభమయ్యాయి. కన్నూరు బీడీ ఫ్యాక్టరీలు మంగుళూరుకు తరలిపోయినపుడు, బీడీ వర్కర్లకు సహాయంగా ఆరెస్సెస్ సంస్థ ముందుకు వచ్చింది. అప్పటిదాకా కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులుగా వున్న వారందరూ ఆరెస్సెస్‌వైపు వెళ్లిపోవడం పార్టీని మండించింది. ఆ తర్వాతి దశాబ్దాలలో అనేక సార్లు కొట్లాటలు జరిగాయి. ఆ హింసాత్మక ఘటనల్లో ఇరుపక్షాలకు చెందిన వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు లేదా అవయవాలు పోగొట్టుకున్నారు. ఈ హత్యకు కొద్దిరోజుల ముందే సురేష్ కుమార్ అనే మరో ఆరెస్సెస్ కార్యకర్త కూడా ఇలాంటి రాజకీయహత్యేక గురయ్యాడు.
మోడీ బిసి అనే విషయాన్ని గుర్తు చేస్తూ కేరళ ఓటర్లలో కొన్ని వర్గాలనైనా ఆకట్టుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. తన నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ మోర్చా ద్వారా కేరళ పులయార్ మహాసభతో కలిసి దళితులు ఆరాధించే అయ్యంకాళీ 152వ జయంతి వేడుకలు నిర్వహించి మోడీని ముఖ్య అతిథిగా పిలవబోతోంది. బిజెపి యూత్ వింగ్ భారతీయ యువమోర్చా మద్యనిషేధం అమలు చేయాలంటూ ఆందోళనలు చేపట్టింది. ఆగస్టు 24న కన్నూరులో బిజెపి 500 మంది కొత్త సభ్యులను పార్టీలోకి చేర్చుకుంటే వారిలో 350 మంది సిపిఎం కార్యకర్తలే. ఇలాంటివి సిపిఎంకు ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం లేదు. వారం తిరక్కుండా మనోజ్ మరో సహచరుడితో కలిసి కారులో వెళుతుంటే కొందరు బాంబులు విసిరి కారు ఆపేశారు. అతన్ని కారులోంచి బయటకు లాగి, కత్తి పోట్లు పొడిచి చివరకు గొంతు కోశారు. దీని వెనుక 1999 నాటి గతం వుంది. అప్పట్లో కన్నూరు జిల్లా సిపిఎం సెక్రటరీగా ఉన్న పి. జయరాజన్ అనే అతనిపై దాడి జరిగింది. ఆ కేసు నిందితుల్లో మనోజ్ కూడా ఒకడు. ఈ హత్య దానికి ప్రతీకారమే అంటున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిదిమందిలో ఒకడైన కె. విక్రమన్ జయరాజన్ కుటుంబానికి సన్నిహితుడట. మనోజ్ హత్య జరగగానే గల్ప్‌లో వుంటున్న జయరాన్ కొడుకు జైన్ రాజ్ ‘‘ఈ శుభముహూర్తం కోసం ఎన్నాళ్లగానో ఎదురు చూశాను’’ అని ఫేస్‌బుక్ పేజీలో రాశాడు.
ఎమ్బీయస్ ప్రసాద్