నాటి పెళ్ళికి, నేటి అక్షింతలు!

తెలంగాణ సెంటిమెంటు అంటే ‘ఆంధ్రవ్యతిరేకత’ అనే ఇప్పటికీ అర్థం చెబుతున్నారా? తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తర్వాత కూడా ‘ఆంధ్ర’నే బూచిగా చూపి తెలంగాణలోని టీఆర్‌ఎస్ సర్కారు పబ్బం గడుపుకుంటుందా?  Advertisement హైకోర్టు వేసిన అక్షింతలు…

తెలంగాణ సెంటిమెంటు అంటే ‘ఆంధ్రవ్యతిరేకత’ అనే ఇప్పటికీ అర్థం చెబుతున్నారా? తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తర్వాత కూడా ‘ఆంధ్ర’నే బూచిగా చూపి తెలంగాణలోని టీఆర్‌ఎస్ సర్కారు పబ్బం గడుపుకుంటుందా? 

హైకోర్టు వేసిన అక్షింతలు చూస్తే, నిజమని అనిపిస్తుంది. 1956కు ముందు వున్న తెలంగాణ వాసుల పిల్లలేక ఫీజు చెల్లిస్తానంటూ ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ (పైనాన్సియల్ అసిస్టెన్స్ టూ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) ను న్యాయస్థానం తప్పు పట్టింది. ‘తెలంగాణ రాష్ర్టం భారతదేశంలో భాగం కాదనుకుంటున్నారా?’ అని వ్యాఖ్యానించేంత వరకూ కోర్టు వెళ్ళిపోయింది. అలాగే మోటారు వాహనాల నెంబర్ ప్లేట్ల పై ‘ఎపి’ స్థానంలో ‘టిఎస్’ పెట్టటం కోసం చేపట్టిన ‘రీరిజిష్ట్రేషన్’ ప్రక్రియ మీద కూడా ఉన్నత న్యాయస్థానం విరుచుకు పడింది. ‘ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహన దారులు మరో మారు క్యూల్లో నిలబడి నెంబర్లు మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని ప్రశ్నించింది.

ఈ రెండు నిర్ణయాలూ ‘సీమాంధ్రు’ల మీద వ్యతిరేకతను ప్రకటించేవిగానే వున్నట్టు కనిపించాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో వున్నప్పుడు, ఇలాంటి వ్యతిరేకతకు నిజంగానే తెలంగాణలో చప్పట్లు మోగుతాయి; వోట్లు కూడా రాలతాయి. కానీ ఈ నిర్ణయాలు తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ తొలినాళ్ళలో తీసుకున్నాయి. కానీ మొట్టికాయలు ఇప్పుడు( రెండు, మూడు నెలల) తర్వాత పడుతున్నాయి.

ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ‘ఆంధ్ర వ్యతిరేకత’ మీద ఆధారపడటం దాదాపు మానుకున్నారు. అందుకు ఆధారాలు కూడా లేక పోలేదు. 

ఒకటి: రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వంతో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయి, ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిలో మాట్లాడారు.

రెండు: అంతవరకూ భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో ఏడు ముంపు మండలాలనూ, ఆంధ్రప్రదేశ్‌లో కలపటం పట్ల ఒంటికాలిమీద లేచిన కేసీఆర్ తర్వాత చల్లబడి పోయారు. అంతేకాదు. ‘ఇక అవి మనవి కావు. అంధ్రప్రదేశ్‌లో కలిసిపోయాయి’ అని తనంతట తానే తెరదించేశారు.

మూడు: హైదరాబాద్‌లోని మురికివాడలను సందర్శించి, వలస వచ్చినవారి(అధికులు సీమాంధ్రులే కదా) సమస్యలను తమ ప్రభుత్వం తీరుస్తుందని ప్రకటించారు. 

నాలుగు: ఆల్ ఇండియా సర్వీసెస్ (ఐయ్యేఎస్, ఐపీయస్) అధికారులను రెండు రాష్ట్రాలకూ పంపిణీ చేసే విషయంలో, ఇద్దరు ముఖ్యమంత్రులూ ఎవరికి కావలసిన వారిని తమ తమ రాష్ట్రాలకు తెచ్చుకునే విషయంలో ఎంత స్నేహభావంతో మెలిగారు. ఈ విషయంలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంపూర్ణ సహకారం అందించారు. 

ఇలా ‘సీమాంధ్ర వ్యతిరేకత’ను ప్రకటించటం బాగా తగ్గించుకున్నంటున్న తరుణంలో, తెలంగాణ సర్కారు తీసుకున్న పాత చర్యలకు, కొత్తగా అక్షింతలు పడ్డాయి. ఇక్కడే ఓ ప్రశ్న ఉదయిస్తుంది: మూడు నెలలక్రితం అవసరమయిన ‘సీమాంధ్ర వ్యతిరేకత’ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది? 

అప్పటి ‘ఆంధ్ర వ్యతిరేత’ కు వున్న కారణాలు:

ఒకటి: తెలంగాణ రాష్ర్టం ఏర్పడగానే, తెలంగా ప్రజలు చాలా ఆశిస్తారు. ఎందుకంటే, ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇన్నీ అన్నీ కావు.

రెండు: టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ముందు పెట్టుకుని, ‘రుణ మాఫీ’ వంటి హామీలు అమలు చేయరేమిటని ప్రతిపక్షాలు పీక పట్టుకుంటున్నాయి.

మూడు: ఆరు దశాబ్దాల ఎదురు చూపులు తర్వాత వచ్చిన తెలంగాణలో నిజంగానే ప్రజల ఆకాంక్షలు తారా స్థాయిలో వుంటాయి

వీటన్నిటినీ వెంటనే కార్యరూపంలో పెట్టటం వీలు కాదని కేసీఆర్ ముందే గ్రహించారు. ఆలాగని జాప్యం చేస్తే ప్రజల్లో వెనువెంటనే వ్యతిరేకత రావచ్చు. అప్పటికే ఎరువుల గురించి రైతులూ, ఒప్పంద ఉద్యోగుల క్రమబధ్ధీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులూ రోడ్ల మీదకు వచ్చారు. సర్కారు వారి మీద లాఠీ చార్జీ కూడా చేయాల్సి వచ్చింది. 

ఈ వ్యతిరేకత నుంచి బయిట పడటానికి, దగ్గర మార్గంగా, అప్పట్లో ‘ఆంధ్రవ్యతిరేకత’ను ఆశ్రయించారు. ఇప్పుడు మెదక్ ఉప ఎన్నిక కూడా ముగిసి పోయింది. రాజకీయం మీద కన్నా పాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరమొచ్చి, ‘ఆంధ్రవ్యతిరేకత’ ను పక్కన పెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో కోర్టు అక్షింతలు పడ్డాయి. అందుకే టీఆర్‌ఎస్ సర్కారు కూడా వీటిని అంత తీవ్రంగా గణించటంలేదు. 

సతీష్ చందర్