తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ నియంతలా మారుతున్నారా? తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటున్నారా? ‘దొరతనం’ బయటకు తీస్తున్నారా? తనది నిజాం వారసత్వమని చాటుకుంటున్నారా? అధికారంలోకి రాగానే అహంకరిస్తున్నారా? తెలంగాణను తానే ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతానని అనుకుంటున్నారా?….ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా ఉన్న ప్రశ్నలివి. సామాన్యుల నుంచి మేధావుల వరకు కేసీఆర్ వైఖరిపై ఏదో ఒక స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలు సర్కారుపై విమర్శలు చేయడం సహజమే. అయితే వివిధ వర్గాల ప్రజల్లోనూ ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తమవుతూనే ఉంది. మీడియా మిత్రులు చెబుతున్నదాని ప్రకారం అధికారుల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. కొందరు మంత్రులు బయటకు చెప్పడంలేదుగాని వారు కూడా కొన్ని విషయాల్లో పెదవి విరుస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం నడుపుతున్నప్పుడే కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పుడు అధికార పీఠం ఎక్కగానే కొంతమేరకు నిజమవుతోంది.
తెలంగాణ సెంటిమెంట్ ఎంతకాలం?
తెలంగాణ కోసం ఉద్యమం నడిపిన కేసీఆర్ ఆ సమయంలో తెలంగాణ సెంటిమెంటును బాగా వాడుకున్నారు. సహజంగానే మేధావి, మాటకారి అయిన ఆయనకు జనాన్ని సమ్మోహితులను చేసే శక్తి ఉంది. ‘ఈయన చెప్పేది కరెక్టే’ అనుకునేలా మాట్లాడగలరు. తెలంగాణ దోపిడీకి గురైందంటూ కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారు. అయితే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ కూడా అభివృద్ధి చెందిందని, వెనుకబడిలేదని చెప్పడంతో ‘తెలంగాణ ఆత్మగౌరవం’ అనే నినాదం ఎత్తుకున్నారు. తెలంగాణ భాష వేరు, ఆంధ్రా భాష వేరన్నారు. వాళ్ల ఆది కవి వేరు, మన ఆది కవి వేరన్నారు. మన కళలు, సాహిత్యం వేరన్నారు, వారివి వేరన్నారు. ప్రతి అంశాన్ని విడదీసి తెలంగాణ రంగు పూసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కూడా ప్రజలపై ఇంకా తెలంగాణ సెంటిమెంటు మత్తు చల్లుతూనే ఉన్నారు. ఆప్పటికీ ప్రతి విషయాన్ని ‘ఆంధ్రోళ్ల కుట్ర’ అని ప్రచారం చేస్తున్నారు. రాష్ర్టం విడిపోయినా ఆంధ్రోళ్ల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉందని టీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. సర్కారు వైఫల్యాలకు కుట్ర అనే పేరు పెడుతున్నారు. అవసరమైనదానికంటే తెలంగాణ సెంటిమెంటును ఎక్కువ వాడుతున్నారు. చివరకు పండుగల విషయంలోనూ వివక్ష చూపుతూ దసరా, సంక్రాంతిని తెలంగాణ, ఆంధ్ర పండుగలుగా విడదీశారు. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో సెంటిమెంటును ఇంత విపరీతంగా దట్టించడం అవసరమా? అధికారంలోకి వచ్చాక చేసే కార్యక్రమాలను, విధానాలను, అభివృద్ధి పనులను చూస్తారేగాని ప్రజలు సెంటిమెంటును ఎల్లకాలం పట్టించుకుంటారా?
అన్నీ తానై…అంతా తానై..
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తానై, అంతా తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విమర్శలను ప్రతిపక్షాలేకాదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యావంతులు, నిఖార్సయిన తెలంగాణవాదులు చేస్తున్నారు. అధికారంలోకి రావడంతోనే కేసీఆర్ దూకుడుగా వెళ్లడం ప్రారంభించారు. ఆశాజనకమైన ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన పడుతున్న తపన కనబడింది. అయితే అధ్యయనం చేయకుండా హడావిడి ప్రకటనలు చేయడం, విధానాలు ప్రకటించడంతో విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రెండు వేల ఎకరాల్లో సమస్త సౌకర్యాలతో ఫిలిం సిటీ నిర్మిస్తామని ప్రకటించి వారి భయాలను పోగొట్టారు. ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి కొన్ని సానుకూలమైన పనులు చేసినప్పటికీ వెనకాముందు చూడకుండా కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్లి అపప్రథ మూటగట్టుకున్నారు. అధికారంలోకి రాగానే అవినీతిపరుల భరతం పడతానని, తాను హిట్లర్‌నని చెప్పుకున్నారు. గురుకుల్ ట్రస్టు భూముల్లోని అయ్యప్ప సొసైటీ ఇళ్లపై దృష్టి పెట్టారు. అక్రమంగా నిర్మించారనే కారణంతో కొన్ని ఇళ్లను కూల్చేశారు. ఈ చర్య వివాదాలకు దారి తీసింది. ఇదే సమయంలో పాత బస్తీలో అక్రమ కట్టడాలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నకు జవాబు లేదు. ప్రపంచంలో ఎక్కడా, ఎవరూ చేయని రీతిలో చేశామని చెప్పిన తెలంగాణ సమగ్ర సర్వే కూడా విమర్శల పాలైంది. దీంట్లోని అనేక లొసుగులు ఇప్పుడు బయటకొస్తున్నాయి. అంతిమంగా దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
ముస్లింలను ఆకట్టుకోవడానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించి కోటి రూపాయలు ప్రదానం చేశారు. ఓ అంతర్జాతీయ పోటీలో గెలిచినందుకు మరో కోటి సమర్పించారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేసీఆర్ హడావిడి నిర్ణయాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులే కాదు, మంత్రులు సైతం తన కనుసన్నల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. తన ఆదేశాలు లేనిదే మీడియాతో మాట్లాడకూడదని, పర్యటనలకు వెళ్లకూడదని, ఎలాంటి వాగ్దానాలు చేయకూడదని కేసీఆర్ ఆదేశించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వరంగల్‌లో హెల్త్ యూనివర్శిటీ పెడతామని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి అయిన రాజయ్య ప్రకటించినందుకు కేసీఆర్ బహిరంగంగానే ఆయన మీద ఫైరయ్యారు. తన అనుమతి లేనిదే మాట్లాడొద్దని పరోక్షంగా హెచ్చరించారు. రాజయ్యను మందలించిన తీరు చూసిన ఇతర మంత్రులు డంగైపోయారు. కేసీఆర్ తనకు తండ్రివంటివారని, ఆయన తనను ఏమీ తిట్టలేదని తెల్లవారి రాజయ్య మీడియాకు చెప్పారనుకోండి. అది వేరే విషయం.
సీఎం చెప్పిందే వేదం
ఏ ప్రభుత్వంలోనైనా సీఎం చెప్పిందే (కేంద్రంలో పీఎం) వేదమవుతుంది. కాదనం. కాని కేసీఆర్ వైఖరితో విసుగెత్తిపోతున్నట్లు అధికారవర్గాల నుంచి వస్తున్న సమాచారం. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారుల్లో చాలామంది ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వంలో పనిచేసినవారే. మంచి అనుభవజ్ఞులే. కాని వారి నివేదికలను, ప్రతిపాదనలను కేసీఆర్ తీసిపారేస్తున్నారట…! తయారుచేసిన నివేదికలను మార్చి మళ్లీ మళ్లీ తయారుచేయాలంటున్నారట. అంతా కొత్తగా ఉండాలని, నివేదికలు, ప్రతిపాదనలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉండాలని చెబుతున్నారట. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ అసలు ఖాతరు చేయడంలేదు. సెప్టెంబరు మొదటివారంలో బడ్జెటు ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనలు, లెక్కలు సిద్ధం చేస్తే కేసీఆర్ మొత్తాన్ని రద్దు చేసి పారేశారు. బడ్జెటు సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేశారు. దీపావళి తరువాత బడ్జెటు ప్రవేశపెడతామని చెబుతున్నా అది నవంబరు వరకు పోతుందని వినికిడి. బడ్జెటుకు ముందు ప్రవేశపెట్టే ఆర్థిక నివేదిక బాలేదని కేసీఆర్ దాన్ని తిప్పి పంపారు. అధికారులు తెలంగాణ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా నివేదికలు తయారుచేయకుండా రొటీన్‌గా తయారుచేస్తున్నారని అంటున్నారట. అధికారులను సీఎం నానా హైరానా పెడుతున్నారని సచివాలయం నుంచి వస్తున్న సమాచారం. మెదక్ జిల్లా కలెక్టరుగా మంచి పేరు తెచ్చుకున్న యువ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను కేసీఆర్ ఏరికోరి తన కార్యాలయంలో నియమించుకున్నారు. కాని ఈ కొద్దికాలంలోనే ఆమె అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. తనకు మరో పోస్టింగ్ ఇవ్వమని ఆమె సీఎంను కోరారు. అధికారుల పరిస్థితికి ఇదో ఉదాహరణ. ఇక సీఎం పేషీలోనూ వందలాది ఫైళ్లు పేరుకుపోయాయి. ఫైళ్లను సంబంధిత మంత్రులు, అధికారుల చూశాక తుది నిర్ణయం కోసం ముఖ్యమంత్రి దగ్గరకు పంపడం ఆనవాయితీ. అయితే కేసీఆర్ నిర్ణయాలు తీసుకోకుండా ఫైళ్లు పెండింగులో పెడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మొండి నిర్ణయాలు…కోర్టు అక్షింతలు
కేసీఆర్ పట్టుదలగల నాయకుడు. ఈ లక్షణం మంచిదే. కాని అది మొండితనంగా మారితేనే ఇబ్బందులు. ప్రస్తుతం కేసీఆర్ కొన్ని విషయాల్లో మొండితనంగా వ్యవహరిస్తుండటంతో న్యాయస్థానం తప్పుపడుతోంది. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తగినంత అధ్యయనం చేయకపోవడం, తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకోవాలని చూడటంతో అనుకున్న ఆలోచనలు రివర్స్ అవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్థానంలో ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకం, వాహనాలకు నెంబరు ప్లేట్లు, సమగ్ర సర్వే…ఇలా ఒకటా రెండా? అనేక నిర్ణయాలు ఈమధ్య కాలంలో వివాదాస్పదమయ్యాయి. దీంతో కోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఫాస్ట్ పథకంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ వివాదాస్పద నిర్ణయాలకు అద్దం పడుతున్నాయి. ఫాస్ట్ పథకంపై తెలంగాణవారి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అసలుసిసలు తెలంగాణవారైనా 1956 నుంచి స్థానికత ఆధారాలు తేవడం కష్టమన్నారు. ఇక వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా హేతుబద్ధంగా లేదని కోర్టు చెప్పింది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి నెంబరు ప్లేట్లు మార్చాలని ఎవరు చెప్పారు? అంటూ కోర్టు నిలదీసింది. తాజాగా ప్రజాసంఘాల, మేధావుల ఆగ్రహానికి గురైంది సర్కారు. ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సు పేరుతో ఓ సదస్సు నిర్వహించాలనుకున్నారు. కాని దీనికి సర్కారు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై మాట్లాడటానికి కనీసం కేసీఆర్ అనుమతి కూడా దొరకలేదని ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు చెప్పారు. సదస్సుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనుమతి ఇచ్చినా పోలీసులు నిరాకరించారట…! దీన్నిబట్టే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మీడియాపై నిషేధం సంగతి తెలిసిందే. అదింకా కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ నియంతగా మారుతున్నారనడానికి ఈ నేపథ్యం చాలదా?
ఎం.నాగేందర్