ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న ఫ్రాన్సులో ప్రస్తుతం ఒక పుస్తకం దుమ్ముదుమారం లేపుతోంది. అది ఆర్థికాంశాలపై రాసిన ఉద్గ్రంథం కాదు. ఫ్రాన్సు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండె మాజీ ప్రియురాలు 49 ఏళ్ల వేలెరీ ట్రయర్వీలర్ రాసిన ‘‘మెర్సి పోర్ సె మూమెంట్’’ (ఈ క్షణానికి ధన్యవాదాలు) అనే రసవత్తరమైన నవల! ఈమె సెలబ్రిటీ మ్యాగజైన్ అయిన ‘‘పారిస్ మ్యాచ్’’కు పొలిటికల్ జర్నలిస్టుగా వుండేది. 19 పార్లమెంటు ఎన్నికలలో ఫ్రాంకోయిస్‌తో పరిచయమైంది. అప్పట్లో అతను సెగోలిన్ రాయల్‌తో కలిసి వుండేవాడు. వాళ్లిద్దరికీ నలుగురు పిల్లలు కలిగారు కూడా. 2007 లో ఫ్రాంకోయిస్, వేలెరీ మధ్య శృంగారసంబంధం ఏర్పడేనాటికి ఆమె రెండో వివాహం భగ్నమయ్యే దశలో వుంది. ఆమెకు మొదటి వివాహం ద్వారా పిల్లలు కలగలేదు. తనతో బాటు పనిచేసే సబ్ ఎడిటర్‌తో చేసుకున్న రెండో వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు పుట్టారు. అతనికి విడాకులు ఇచ్చాక 2010లో ఫ్రాంకోయిస్‌తో సంబంధాన్ని బహిర్గతం చేసింది. 2012లో ఫ్రాంకోయిస్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా తన వృత్తిని కొనసాగిస్తానని ఆమె ప్రకటించింది. అప్పటికి ఏడేళ్లగా ఆమె పొలిటికల్ టాక్ షోలు చేస్తోంది.
ఈ జనవరి ‘‘క్లోజర్’’ పత్రికలో ఫ్రాంకోయిస్‌కు జూలీ గాయెట్ అనే నటితో తిరుగుతున్నట్లు ఫోటోలతో సహా వచ్చేవరకూ వాళ్లిద్దరి మధ్య సంంధం కొనసాగింది. అది చూసి ఈమె ఆత్మహత్యాప్రయత్నం చేసిందట. జనవరి 25న ‘వేలెరీతో ఫ్రాంకోయిస్ సంబంధబాంధవ్యాలు తెంచుకున్నారు’ అని అధ్యక్షభవనం నుండి ప్రకటన వచ్చింది. అప్పణ్నుంచి ఆమె బతుకు దుర్భరమైపోయింది. అప్పటిదాకా వెంటపడిన స్నేహితులు, పాత్రికేయులు మొహం తిప్పుకోసాగారు. పార్టీలకు పిలవడం మానేశారు. పైగా జాలి చూపించసాగారు. దాంతో ఆమె కక్ష కట్టింది. తమ మధ్య నడిచిన వ్యవహారమిది అంటూ ఈ పుస్తకం రాసేసింది. దానిలో పచ్చి శృంగారవర్ణనలు లేవు, భాష సంస్కారయుతంగానే వుంటుంది. కానీ పడకటింటి రహస్యాలన్నీ పరిచి చూపించినట్టు అసభ్యత మాత్రం హద్దులు దాటిందట. సెగోలిన్ రాయల్‌ను చూసి తను ఎలా అసూయపడిందో, ఫ్రాంకోయిస్ అబద్ధాలు భరించలేక తను ఆత్మహత్య ఎలా చేసుకోబోయిందో, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు తనతో అమర్యాదగా ఎలా ప్రవర్తించారో ఎమోషన్స్ దట్టించి మరీ రాసిందిట.
ప్రస్తుతం ఫ్రాంకోయిస్ సోషలిస్టు ప్రభుత్వం సంక్షోభంలో వుంది. ముగ్గురు మంత్రులు తిరగబడితే వారిని తీసేశాడు. అతని పాపులారిటీ 13%కి పడిపోయింది. ఈ టైములో పుస్తకాన్ని జర్మనీలో రహస్యంగా ముద్రించి ఫ్రాన్సులోకి తెచ్చి రిలీజ్ చేసిందీమె. విడుదల అవుతూనే చదవడానికి జనం ఎగబడ్డారు. రెండు రోజుల్లో 0,000 కాపీలు అమ్ముడుపోయాయి. మొత్తానికి 5 లక్షల కాపీలు అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. షాపులో పుస్తకాలు పెట్టడం తరవాయి, ర్యాకులు ఖాళీ అయిపోతున్నాయి. కానీ ఫ్రాన్సులో ఎవరిని అడిగినా చదవలేదని చెప్తున్నారట. ‘ఛ, ఛ అలాంటి చెత్తపుస్తకాన్ని మా షాపుల్లో పెట్టం’ అని కొందరు షాపు యజమానులు చెప్తుంటే, ఆ పుస్తకం గురించి ఏ వార్తా కవర్ చేయం అని పబ్లిక్ సర్వీస్ టెలివిజన్ చెప్తోంది. తన పుస్తకంలో ఫ్రాంకోయిస్ని అనేక విధాలుగా నిందించిన రచయిత్రి ఆ దూకుడులోనే ‘అతనికి పేదలంటే చులకన. ‘వీళ్లంతా కరవలేని మూక’ అనేవాడు’ అని రాసింది. ఆ మాటను ఫ్రాంకోయిస్ ప్రత్యర్థులు కూడా నమ్మటం లేదు. పేదలకోసం అతను ఎంతో చేశాడని వాళ్లు ఒప్పుకుంటారు. అతన్ని ఏ విషయంలోనూ విమర్శించకుండా వదిలిపెట్టని నేషనల్ ఫ్రంట్ అనే రైటిస్టు పార్టీ నాయకురాలు మేరీన్ లే పెన్ కూడా ఈ విషయంలో రచయిత్రినే తిట్టిపోసింది. ఈ అశ్లీలపుస్తకం దేశానికే చెడ్డపేరు తెస్తోంది అంది. ఆమె కూడా ఇలాంటి వ్యవహారాల బాధితురాలే. ఆమె తండ్రి ఆ పార్టీ నాయకుడిగా వుంటూ ఈమెను వారసురాలిగా తెచ్చాడు. ఆమె తల్లి పియరెట్ భర్తను, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోవడమే కాక, తమ మధ్య నడిచిన శృంగారకలాపాలన్నీ అక్షరబద్ధం చేసింది. అంతేకాదు, ‘లూయీ’ మ్యాగజైన్‌కు న్యూడ్ పోజులిచ్చింది కూడా! అందువలన లే పెన్ తండ్రి గురించి తప్ప తల్లి గురించి మాట్లాడదు, వ్యక్తిగత విషయాలను బజారు కెక్కించడం ఇష్టపడదు. అందుకనే ఫ్రాంకోయిస్‌కు ఈ విషయంలో మద్దతుగా నిలిచింది.
ఎమ్బీయస్ ప్రసాద్