తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఈ సరైన వ్యక్తి ఎవరు? ఇంకెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తే. అందులో సందేహం లేదు. కాని తీసుకుంటున్న నిర్ణయాలే వివాదాస్పదమవుతున్నాయి. ఏ మాత్రం అధ్యయనం చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనబడుతోంది. ఆయనకు మద్దతు ఇస్తున్న కొన్ని ఉద్యోగ, ప్రజా సంఘాలవారు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కావడం, న్యాయస్థానం అక్షింతలు వేయడం చూస్తున్నాం. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు సరేసరి. ఆయనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? సలహాదారులు, అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారా తెలియడంలేదు. కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారడమే కాకుండా వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరం చేసేలా ఉంది. దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
ఇంతకూ ఏమిటా నిర్ణయం? పాఠశాలల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్). అంటే ఏమిటి? పిల్లలు చాలా తక్కువగా ఉన్న స్కూళ్లను మూసేసి వాటిని దగ్గర్లో ఉన్న పాఠశాలల్లో విలీనం చేయడం. అంటే ఈ పిల్లలందరినీ ఆయా పాఠశాలల్లో చేర్పించడం. మూసేసిన స్కూళ్లలోని ఉపాధ్యాయులనూ ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయడం. ఇలా చేసిందువల్ల పాఠశాలల నిర్వహణా భారం కొంతమేరకు తగ్గుతుంది. పిల్లలు తక్కువగా ఉన్న రెండు వేల స్కూళ్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. ఈ స్కూళ్లలో 1800 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 200 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను మూసేసే పని కేసీఆర్ సర్కారే మొదటగా చేయడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలూ చేశాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఈ పని చేయాల్సిన సమయం ఇప్పుడు కాదు. పరీక్షలైపోయాక ఎండాకాలం సెలవుల్లో చేయాలి. ప్రస్తుతం విద్యా సంవత్సరం సగంలో ఉంది. ఈ సమయంలో స్కూళ్లను మూసేసి విద్యార్థులను గందరగోళపరిస్తే ఈ ప్రభావం పరీక్షలపై పడుతుంది. ముఖ్యంగా హైస్కూలు విద్యార్థులు చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది.
ఇన్నాళ్లు ఒక బోధనా విధానానికి, టీచర్లకు అలవాటు పడినవారు కొత్త స్కూళ్లకు వెళితే అక్కడి వాతావరణానికి, బోధనకు అలవాటు పడటానికి చాలా సమయం పడుతుంది. అంతిమంగా ఇది పరీక్షల్లో వారు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఈ విషయం మేధావి కేసీఆర్‌కు తెలియదా? విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల భారాన్ని ఇప్పటికిప్పుడే వదిలించుకోవాలా? ఆరేడు నెలలు ఆగితే నష్టమా? దసరా సెలవుల్లో పాఠశాలల రేషనలైజేషన్‌ను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి ‘హేతుబద్ధత’ లేని నిర్ణయాలు తీసుకోవడంవల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరిస్తున్నాయి. కావాలంటే ఉపాధ్యాయలను అటు ఇటూ మార్చుకోండిగాని విద్యార్థులను ఉన్న స్కూళ్ల నుంచి కదలించొద్దని సలహా ఇస్తున్నారు. వాస్తవానికి ఇదీ కరెక్టు కాదు. పాత లెక్కలు పరిశీలించి విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నిర్ణయానికొచ్చారని, కాని ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తం మీద చూస్తే ఇది హడావిడి నిర్ణయంలాగే కనబడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి కార్పొరేట్ విద్యా సంస్థలు బలపడిపోయాయి. ఇలాంటి చర్యలు ప్రయివేటువారికి మరింత ఊతమిస్తాయి.
ఓ పక్క కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ అదేపనిగా ప్రచారం చేస్తున్న సర్కారు మరో పక్క ఉన్న పాఠశాలలను మూసేస్తోంది. ఏ విషయంలోనైనా సరే కేసీఆర్ ప్రభుత్వానికి తొందర ఎక్కువగా ఉంది. ఉన్నపళంగా రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోవాలని అనుకుంటున్నట్లుగా ఉంది. కేసీఆర్ వివాదాస్పద నిర్ణయాలపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. కొంతకాలం కిందట ఆయన సమక్షంలోనే రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదిరిన విషయం తెలిసిందే కదా…! కాని కేసీఆర్ తీరుపై విసుగు చెందిన ఏపీ సర్కారు గవర్నర్‌కు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అధికార బలంతో నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవల్సిన కార్పొరేషన్లను, అకాడమీలను ఇష్టం వచ్చినట్లుగా విభజిస్తూ పేర్లు మార్చేస్తోందని ఫిర్యాదు చేసింది. విశ్వవిద్యాలయాల విషయంలోనూ ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పింది. ఈ సుదీర్ఘ లేఖలో ఇంకా అనేక అంశాలున్నాయి. కేసీఆర్ రైట్ పర్సన్ కాబట్టి రైట్ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది.
ఎం. నాగేందర్