తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు దేశంలోని అవినీతిపరులకు గుబులు పుట్టిస్తోంది. వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ రాజకీయ జీవితాలకు కూడా ఎసరు వస్తుందేమోనని భయపడుతున్నారు. ఇదీ జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాల సారాశం. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరి కళ్లూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మీదనే ఉన్నాయి. జయలలిత కేసులో తీర్పు రాగానే జగన్ ప్రత్యర్థుల్లో ముఖ్యంగా ఆంధ్రలోని టీడీపీ నాయకుల్లో బాగా సంతోషం వ్యక్తమైంది. వెంటనే వారు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. తర్వాతి వంతు జగన్‌దేనన్నారు. ఆయనకు శిక్ష పడక తప్పదన్నారు. జయలలిత కేసులో రూ.66 కోట్ల అక్రమాస్తులకే నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా పడితే, 44 వేల కోట్ల జగన్ అక్రమార్జన కేసులో ఎన్నేళ్ల జైలు శిక్ష, ఎన్ని వందల కోట్ల జరిమానా పడుతుందో చూడాలన్నారు. జగన్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమనే నిర్ణయానికొచ్చేశారు.
ఒక్క టీడీపీ నాయకులే కాదు, నిన్నటివరకు జగన్ పార్టీలో ఉండి బయటకు వచ్చిన నాయకులు, కాంగ్రెసులో ఉన్న ఆయన ప్రత్యర్థులూ జగన్ జైలుకు వెళతాడని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. ఇక ఉత్తర భారత దేశానికి వెళితే యుపిలో బిఎస్పి అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్, ఒడిశాలో బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి , ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యమ భయపడుతున్నారట…! యుపి మాజీ ముఖ్యమంత్రులు మాయావతి మీద, ములాయంసింగ్, ఆయన కుటుంబ సభ్యుల మీద అక్రమాస్తుల కేసులు ఎప్పటినుంచో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం చుట్టుముట్టింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కూడా చిట్‌ఫండ్ కుంభకోణం పట్టి పీడిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 2016లో, ఉత్తరప్రదేశ్‌లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడి పాలకుల్లో, అవినీతి ఆరోపణలు ఉన్నవారిలో వణుకు పుడుతోంది. మాయావతి అక్రమాస్తుల కేసులో మళ్లీ తాజాగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది.
మాయావతి కూడా జయలలిత మాదిరిగా కుటుంబం లేని (పెళ్లి చేసుకోని) మహిళ. అయినప్పటికీ అపరిమితమైన అక్రమాస్తులు సంపాదించారు. ఆమె ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంది. ఇక బిఎస్పి వ్యవస్థాపకుడు కాన్షీరాం పుట్టిన రోజును, తన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడంలో మాయావతి దిట్ట. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు, పార్టీ నాయకులకు టార్గెట్లు మరీ వసూలు చేయించేవారు. అంత డబ్బు పిచ్చి ఉంది ఈమెకు. ఇక యుపిలో దాని రాజధాని లక్నోలో ఎక్కడబడితే అక్కడ వందలాది విగ్రహాలు (కాన్షీరామ్, అంబేద్కర్, బుద్ధుడు, మహాత్మా పూలే…ఇలా ఎందరివో) పెట్టి కోట్ల ప్రజాధనం వృథా చేశారు. పనిలో పనిగా తన విగ్రహాలను కూడా నెలకొల్పుకున్నారు. పార్టీ చిహ్నమైన ఏనుగు బొమ్మలను కూడా వందలాదిగా ఏర్పాటు చేశారు. విగ్రహాల ఏర్పాటుకు, మెమోరియల్ పార్కుల నిర్మాణానికి రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆమె కుంభకోణాల్లో అతి పెద్దది తాజ్ కారిడార్ కుంభకోణం. మాయావతి అవినీతిలో, అక్రమార్జనలో ఆరితేరిన చేయి.
మరో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ మీద ఉన్న అక్రమాస్తుల కేసు సీబీఐ మూసేసింది. ఈ కేసులో తగిన సాక్ష్యాలు దొరకలేదని చెప్పింది. కాని జయ కేసులో తీర్పు తర్వాత ఆయన కూడా భయపడుతున్నారని డెక్కన్ క్రానికల్ తన కథనంలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఇప్పటివరకు అవినీతి మరకలు లేవు. కాని తాజాగా శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం ఆమె మెడకు చుట్టుకుంది. ఈ విషయంలో ఆమె పార్టీ వారే ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా జయలలిత కేసులో తీర్పు దేశాన్ని ఓ కుదుపు కుదిపిందనడంలో సందేహం లేదు.
ఎం. నాగేందర్