కుక్కలకి ఓ రోజు వస్తుందని తెలుసు కానీ, గాడిదలకీ ఓ రోజు వస్తుందని తెలియదు. మే 8 ప్రపంచ గాడిదల దినోత్సవం. దీన్ని బట్టి మనకు తెలిసేదేమంటే ప్రపంచమంతా గాడిదలున్నాయని.
గాడిద మంచిగా, సౌమ్యంగా వుంటుంది. విసుక్కోదు, బరువులు మోస్తుంది. ఎపుడైనా కోపం వస్తే ఓండ్ర పెడుతుంది. చెవులు శుభ్రమైపోతాయి. మరీ కోపం వస్తే వెనుక కాలు లేపుతుంది. ముందరి పళ్లు ఊడిపోతాయి.
రాయదుర్గం పక్కన రాతిబావి వంక అనే తండా వుండేది. జనం అంత పెద్ద పేరు పలకలేక రాతిబ్యాంక్ అనేవాళ్లు. ఈ పేరు అర్థం కాక తికమక పడేవాన్ని. తండా ఆడవాళ్లు గాడిదల మీద కట్టెల మోపుతో ఊళ్లోకి వచ్చి అమ్మేవాళ్లు. ఒక మోపు అర్ధరూపాయి. గాడిదలతో అదే నా తొలి పరిచయం. తర్వాత రచయితలు, కళాకారులు, డైరెక్టర్లు, వ్యాపారులు ఇలా చాలా రూపాల్లో గాడిదల్ని చూశాను. బహుశా వాళ్ల దృష్టిలో నేనూ గాడిదే కావచ్చు. గాడిదలు తమని గాడిదలు కాదు అనుకోవడమే సభ్య సమాజం. పాలిటిక్స్‌లో కూడా గాడిదలుంటాయి. అయితే అవి అడ్డ గాడిదలు.
గాడిద ఇంత మంచిది కదా, దాన్ని తిట్టు కింద ఎందుకు వాడుతాం? గాడిద కొడకా అంటాం కానీ, గుర్రపు కొడకా అని ఎందుకు అనం? ఎందుకంటే గుర్రం రాజామహరాజుల వాహనం. అందరూ దాన్ని మోయలేరు (జట్కా వాళ్లు మినహాయింపు). గాడిద పేద వాళ్ల జంతువు. అందుకే అదంటే చులకన, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు మార్క్స్. మానవ సంబంధాలే కాదు, జంతు సంబంధాలు కూడా ఆర్థికమే.
మోసగాళ్లకు మోసగాడు చూసిన తర్వాత (1971) నాకు గుర్రాల పిచ్చి పట్టుకుంది. కృష్ణలా గుర్రం ఎక్కి నిధి వేటకెళ్లి స్కూల్ అనే పీడను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాను. నిధి దొరకాలంటే మ్యాప్, తాళాలు దొరకాలి. అన్నిటికి మించి ఒక గుర్రం కావాలి. మా బతుకులకి గుర్రం అంటే జట్కా గుర్రమే. వాళ్ల దగ్గర నుంచి కొట్టేయడం ఇంపాజిబుల్. బండి, గుర్రం కలిసి వాళ్ల ఇంటి ముందరే పార్కింగ్.
అందరివీ పూరి గుడిసెలే కాబట్టి గుర్రానికి కొంచెం దూరంలోనే నిద్రపోతారు. అయినా హీరోలు గుర్రాల్ని దొంగలించరు, గుర్రమే వెతుక్కుంటూ వస్తుంది. కానీ రాలేదు. వచ్చినా ఇంకో సమస్య వుంది. కృష్ణ పెద్దాడు కాబట్టి గుర్రాన్ని ఈజీగా ఎక్కేస్తాడు. ఆ సినిమాలో మేడపై నుంచి గుర్రం మీదకి దూకుతాడు కూడా. మామూలు మనుషులు ఆ రకంగా గుర్రం మీదకి దూకితే ఏం పగిలి పోతాయో చెప్పక్కర్లేదు. గుర్రం దొరికినా దాన్ని ఎక్కాలంటే స్టూల్ కావాలి. గుర్రం కాళ్లంత ఎత్తులేని వాన్ని. గుర్రం వర్కౌట్ కాదు కాబట్టి గాడిదే శరణ్యం.
వసుదేవుడే గాడిద కాళ్లు పట్టుకున్నప్పుడు మనం ఎంత? గుర్రానికో కేర్ టేకర్ వుంటాడు. గాడిదలు మా స్కూల్ గ్రౌండ్‌లో గడ్డి తింటూ కనిపిస్తుంటాయి. ఒక గాడిదని ఇంటికి తోలుకొని పోయి మెడలో తోలుబెల్ట్ వేసి స్వారీని ప్రాక్టీస్ చేసి నిధి వేటకు వెళ్లాలని ప్లాన్. గాడిదని తీసుకెళ్లాలంటే ఒకడితో కాదు, ఇంకొడు కావాలి. శేఖర్ అనే వాడికి భవిష్యత్ ప్రణాళిక చెప్పాను. నిధిలో సగం వాటా ఇస్తానని మాట ఇచ్చాను. తప్పదు ఒక్కోసారి సంపదను పంచాల్సిందే.
ఇద్దరమూ ఒక తాడుతో గాడిదని సమీపించాం. అది అనుమానంగా చూసి ముక్కుల్లోంచి శబ్దం చేసింది. అది వార్నింగ్ అని అర్థం చేసుకోక నేను దాని మెడలో తాడు వేసి వీపు మీదకి ఎక్కాను. అది బిగుసుకుపోయింది. వెనుక నుంచి ఒక కట్టె పుల్లతో మా వాడు తరిమాడు.
మొదట “హిహిహి” అని ఓండ్ర వినిపించింది. నా శరీరం జారింది. దాని వెనుక కాళ్లు మెరుపు వేగంతో పైకి లేస్తే ఒక ఆకారం “అమ్మల్లో” అని పెనుకేకతో గాల్లోకి లేచి దబ్బుమని కిందపడింది. అది పరుగెత్తేసరికి నేను రెండు పల్టీలు కొట్టి ముళ్ల కంపల్లో పడ్డాను. గాడిద తన్ను అంటే అర్థమైంది.
ఈ రూట్ లాభం లేదని హేమాపతి అనే వాడితో స్నేహం చేశాను. బట్టలు ఉతుకుతారు కాబట్టి వాళ్లకి సొంత గాడిదలున్నాయి. పిల్లల పళ్లు ఊడిపోవడానికి బెల్లం పాకంతో కంబర్ కట్ తయారు చేసేవాళ్లు (వీటిని జీళ్లు అని కూడా అంటారు). నోట్లో పెట్టుకోవడమే మన బాధ్యత. వాటిని బయటకు తీయడం మన చేతుల్లో వుండదు. కంబర్ కట్‌లు లంచంగా ఇచ్చి హేమాపతితో, వాడి గాడిదతో ఏక కాలంలో స్నేహం చేశాను. గాడిదకి స్వామి భక్తి ఎక్కువ. వాడిని నమ్మినట్టు నన్ను నమ్మేది కాదు. వాటిని షికారు తిప్పేది కానీ, నన్ను టచ్ చేసి చూడు అని బెదిరించేది. అనుభవం వల్ల నేను దాని వెనుక ఎప్పుడూ నిలబడలేదు.
గాడిదలు మెల్లిగా అంతరించి పోతున్నాయి. ఇప్పుడు పల్లెల్లో కూడా కనపడ్డం లేదు. ప్రపంచ గాడిదల దినోత్సవం లక్ష్యం ఏమంటే మానవ జాతికి అంతులేని సేవ చేసిన గాడిదల్ని కాపాడుకోవడమే.
గాడిదని బుద్ధిహీన జంతువని అనుకుంటాం కానీ, జీవశాస్త్రవేత్తల పరిశోధనలో గుర్రం కంటే గాడిదే తెలివైందట. చరిత్ర అణగారిన మనుషులకే కాదు, జంతువులకి కూడా ద్రోహం చేసింది.
జీఆర్ మహర్షి