రానున్నది ఎన్నికల కాలం. ప్రతిదీ ఆచితూచి ప్రభుత్వం అడుగు వేయాల్సిన పరిస్థితి. సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్ల అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో లెక్కలేనంత మంది వివిధ రంగాలకు సలహాదారులున్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా కేవలం అలంకారప్రాయమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో నమ్మకస్తులైన ఐఏఎస్ అధికారుల అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఈయన సీఎం సొంత జిల్లాతో పాటు సొంత నియోజక వర్గానికి చెందిన వ్యక్తి. రాజకీయాలకు, పాలకులకు అతీతంగా జవహర్‌రెడ్డి మొదటి నుంచి కీలక పోస్టుల్లో సేవలందిస్తున్నారు.
2019లో అధికార మార్పిడి జరిగినప్పటికీ జవహర్‌రెడ్డికి ప్రాధాన్యం మరింత పెరిగింది. టీటీడీ ఈవోగా నియమితులై తన కల నెరవేర్చుకున్నారు. తాజాగా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఆయన ఈవోగా రిలీవ్ అయ్యారు. సీఎం ఎంతో నమ్మకంగా జవహర్‌ను నియమించుకున్నట్టు ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వం, రాజకీయ పరమైన అభిప్రాయాలను నిజాయతీగా చెప్పే అధికారిగా జవహర్‌ను జగన్ చూస్తున్నారు. పాలనలోనూ, అలాగే రాజకీయ పరంగా లోటుపాట్లను తన దృష్టికి తెచ్చి చక్కదిద్దుతారనే నమ్మకాన్ని… జవహర్ ఏ మేరకు నిలబెట్టుకుంటారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.