ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వస్తే తాము త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించడంపై సోము వీర్రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….
‘ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇకపై గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదని ఈ మీడియా వేదికగా స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం మన దగ్గర ఉంది.. ఈ కుటుంబ పార్టీల కోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. త్యాగధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024 లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని సోమువీర్రాజు చెప్పుకొచ్చారు.
సోము వీర్రాజు వెటకారం కేవలం చంద్రబాబుపై మాత్రమే కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షమైన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని వీర్రాజు సెటైర్స్ విసిరారని అంటున్నారు. జనసేన ప్రస్తావన లేకుండానే 2024లో బీజేపీ అధికారంలోకి వస్తుందని వీర్రాజు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. పవన్ అంతరంగం బయట పడినప్పటి నుంచి బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోందనేందుకు తాజా వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పక తప్పదు. ఎటూ వెంట నడవని , రాజకీయ స్థిరత్వం లేని పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుని నష్టపోవడం కంటే సొంతంగా ఎదగడమే మేలని బీజేపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది.
గతంలో జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే చెప్పే బీజేపీ నాయకులు, ఇప్పుడు ఆ పార్టీ ఊసే ఎత్తకపోవడం గమనార్హం.