మన దేశంలో పుట్టి, ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని, కెరీర్ను తీర్చిదిద్దుకుని, ఇక్కడి వనరులనే వినియోగించుకుని, ఇక్కడే బాగా ‘డబ్బు’ పట్టినా… చాలా మంది సంపన్నులకు ఈ దేశం మీద మమకారం లేదు. ఇక్కడివారి శక్తి సామర్ధ్యాల మీద నమ్మకం లేదు. ఈ విషయం పదే పదే రుజువు అవుతున్నా… ఓ అంతర్జాతీయ సంస్థ నివేదిక ద్వారా ఇప్పుడు మరోమారు నిరూపితమైంది.
న్యూ వరల్డ్ వెల్త్ అండ్ ఎల్ఐఒ గ్లోబల్ అనే సంస్థ అందించిన నివేదిక వెల్లడించిన ప్రకారం… మన దేశంలోని సంపన్నులు పెద్ద సంఖ్యలో విదేశాలలో స్థిరపడుతున్నారు. మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలసపోతున్న కోటీశ్వరుల సంఖ్యా పరంగా మన దేశం రెండో స్థానంలో నిలిచింది. గత 14 సంవత్సరాల్లో చూసుకుంటే మొత్తం 61000 మంది సంపన్న భారతీయులు ఇప్పటి దాకా తమ మాతృభూమిని విడిచిపెట్టి వెళ్లిపోయారని ‘వరల్డ్ వెల్త్’ తేల్చింది.
పిల్లల చదువులు, తరచు తలెత్తే సంక్షోభాలు, కొరవడిన భధ్రత… వంటి కారణాలు చూపిస్తూ వీరంతా విదేశాల్లో స్థిరపడ్డారని ఈ రిపోర్ట్ వివరించింది. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిపోతున్న శ్రీమంతులు… స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఎంచుకుంటున్న దేశాలలో ఆస్ట్రేలియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తొలి ప్రాధామ్యాల్లో నిలిచాయి. జనాభా సంఖ్యలానే ఎగిరి పోతున్న శ్రీమంతుల విషయంలో కూడా చైనా మనల్ని అధిగమించి తొలి స్థానంలో నిలిచింది.