(స)కలాం : నలుగురు అమ్మలు ముద్దు బిడ్డడు!

''ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం'' అని అబ్దుల్‌ కలాం చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకూ ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. ఒకరు ఆయన కన్నతల్లి.. సొంత అమ్మ! రెండో వారు- భారతీయ సంగీతానికి అమ్మ…

''ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం'' అని అబ్దుల్‌ కలాం చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకూ ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. ఒకరు ఆయన కన్నతల్లి.. సొంత అమ్మ! రెండో వారు- భారతీయ సంగీతానికి అమ్మ – ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మ – మదర్‌ థెరిసా అని ఆయన అభివర్ణిస్తారు. ఇవాళ జాతి మొత్తం అబ్దుల్‌ కలాంను మహనీయునిగా ఆరాధిస్తోంది. అయితే.. మామూలు వ్యక్తి.. ఈ ముగ్గురినీ.. తన అమ్మలుగా.. ఆరాధ్యులుగా భావించేవాడు. తన సొంత అమ్మ కాకుండా.. మిగిలిన ఇద్దరినీ కలవడమే తనకు గొప్ప విషయం అన్నట్లుగా ఆయన చెప్పుకున్నారు కూడా. 

1950లో తిరుచ్చిలో చదువుకునేప్పుడు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి కచేరీలో 'ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు' పాట విని మంత్రముగ్ధుడై ఆమె అభిమానిగా కలాం మారిపోయారుట. ''ఆమె భారతరత్న అవార్డు తీసుకునేప్పుడు నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను'' అంటూ పసిపిల్లవాడిలా మురిసిపోయే మనస్తత్వం అబ్దుల్‌ కలాంది. అలాగే దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభయ్యేళ్లపాటూ సేవలందించిన మదర థెరిసా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పుకునే వారు. 

ఆయన దృష్టిలో ఆయనకు ముగ్గురు అమ్మలే ముఖ్యం కావొచ్చు. కానీ భారత జాతి దృష్టిలో మాత్రం.. ఆయన నలుగురు అమ్మలు మద్దు బిడ్డడు. ఈ ముగ్గురు అమ్మలను ఆయన ఎంచుకున్నారు. అయితే భారతమాత ఆయనను ఎంచుకున్నది. భారతమాత ఆయనను తన ముద్దుబిడ్డగా భావిస్తున్నది. భారతజాతి తామందరి సోదరప్రాయుడిగా ఆయనను గౌరవిస్తున్నది. అందుకే ఈ ముగ్గురు అమ్మలతోపాటూ భారతమాతను కూడా అమ్మగానేకలుపుకుని.. అబ్దుల్‌ కలాం ను.. నలుగురు అమ్మలు ముద్దుబిడ్డడిగా మనం గౌరవించాలి.