ఈ దేశంలో నిమిషానికి కొన్ని వేలమంది పుడుతున్నారు.. కొన్ని వేల మంది మరణిస్తున్నారు. భరతమాత పాదసేవకు తమ జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేస్తున్న వారెందరు? భరతమాత కీర్తిపతాక ను తమ భుజాన మోస్తున్నది ఎందరు? భరతమాత సిగలో తురాయిలాగా.. నిలిచి వన్నె తెస్తున్నది ఎందరు? అలాంటి మహనీయులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.
సమకాలీన సమాజంలో అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు… అసమానమైన వ్యక్తి అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం. ఒక నిరుపేద కుటుంబం నుంచి తన జీవనప్రస్థానం ప్రారంభించి.. శాస్త్రవేత్తగా ప్రపంచం నివ్వెరపోయేటువంటి అనేక పరిశోధనలు సాగించి- సాధించి, మిస్సైల్ మ్యాన్‌గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మహనీయుడు, భారతదేశపు అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థానాన్ని అధిష్ఠించి.. యావత్తు ప్రపంచ దేశాల దృష్టిలో ఆ పదవికే వన్నె తెచ్చిన మనీషి మ కలాం. అలాంటి మహనీయుడు మనకిక లేరు. సోమవారం సాయంత్రం షిల్లాంగ్‌లో ఆయన తన తుదిశ్వాస విడిచారు.
అత్యంత సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించిన మహనీయుడు అబ్దుల్ కలాం. 1931 అక్టోబరు 15న ఆయన జన్మించారు. తమిళనాడులోని రామనాధపురం జిల్లా రామేశ్వరంలో ఆయన జైలులబ్దీన్, ఆశిలమ్మ దంపతులకు కలాం జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం. తన విద్యాభ్యాసం సాగడానికి ఆయన చిన్నతనంలో న్యూస్‌పేపర్స్ పంచుతూ దాని ద్వారా సంపాదించిన డబ్బును కుటుంబం గడవడానికి ఇచ్చేవారు. చదువు మీద మాత్రం విపరీతమైన ప్రేమ, ఆసక్తి ఉన్న అబ్దుల్ కలాం.. తిరుచిరాపల్లిలో ఫిజిక్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత మద్రాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. డిఆర్‌డిఓ ఉద్యోగం ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు.
భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ను రూపొందించడంతో తన సొంత పరిశోధనల్ని ప్రారంభించిన ఈ అద్భుతమైన వ్యక్తి.. భారత్ అమ్ముల పొదిలోని అనేక క్షిపణి అస్త్రాల రూపకర్తగా అందించిన సేవలు తిరుగులేనివి. దేశం ఆయనను గౌరవంగా మిస్సైల్‌మ్యాన్ అంటూ కీర్తించింది. బాలిస్టిక్ మిస్సయిల్స్ వంటి పరిశోధనల్లో ఆయన కీలకవ్యక్తి. పోఖ్రాన్ 2 పరీక్షల్లో కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. ఆయన జీవన ప్రస్థానం అనూహ్యంగా రాజకీయ పదవుల వైపుమళ్లింది. అయితే ఆషామాషీగా కాకుండా.. జాతి గర్వించే విధంగా.. ఆయన ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.
భారత రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో చాలా అద్భుతంగా సేవలందించారు. భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను కూడా అందుకున్నారు. కలాం జీవిత భాగం నుంచి ఒక గొప్ప విషయాన్ని మనం మననం చేసుకోవాలి. వ్యక్తిగా అవివాహితుడు అయిన అబ్దుల్ కలాం.. పసిపిల్లలతో చాలా ఇష్టంగా తన సమయం గడిపేవారు. భారత భవిష్యత్ దీపాలుగా వారి మీద ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. చిన్నారులకు సైన్స్ సంగతులు చెప్పడం ఆయనకు ఎంతో ఇష్టమైన అంశం. అలాగే యూనివర్సిటీల్లో ఫిజిక్స్ పాఠాలు చెప్పడం కూడా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం. ఆయనకు ఏకంగా ఆరు డాక్టరేట్ లు ఉన్నాయి. తనను తాను ఫిజిక్సు ప్రొఫెసర్‌గా చూసుకోవడం ఆయనకు ఇష్టం.
భారత రాష్ట్రపతిగా గద్దె దిగిపోయిన తర్వాత.. ఎవ్వరైనా సరే విరామ జీవితాన్ని ఆ పదవికి, హోదాకు తగిన మర్యాదలతో ప్రశాతంగా, నిర్వ్యాపారంగా గడపాలని అనుకుంటారు. కానీ అక్కడే కలాంలోని విభిన్నమైన వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. ఆయన ఆ భోగాలేవీ కోరుకోలేదు. తనకు తాను ఎంతో ఇష్టపడే అధ్యాపక వృత్తిలోకి తిరిగి ప్రవేశించారు. ఫిజిక్స్ గౌరవ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం వారికి విలువలతో కూడిన సైన్స్ గురించి, దేశం గురించి, ఒక మమకారం కలిగేలా.. మార్గనిర్దేశనం చేయడం ఆయనకు అన్నింటికంటె ఎక్కువ ఇష్టమైన విషయం. మా ఊరికి రండిసార్ ఘనసన్మానం చేస్తాం అంటే ఆయన పట్టించుకోరేమో గానీ.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం ఏర్పాటుచేస్త్తే.. ఖచ్చితంగా కలాం వస్తారు. ప్రసంగిస్తారు. ఆ ఇష్టమైన పని చేయడంలో.. ఆయనకు వయోసహజమైన బాధలేవీ గుర్తుకురావు.
అదే మాదిరిగా 84 ఏళ్ల వృద్ధాప్యంలోనూ దేశవ్యాప్తంగా ఎక్కడినుంచి ఆహ్వానం ఉన్నా.. ఉత్సాహంగా వెళ్లే అబ్దుల్ కలాం.. సోమవారం నాడు షిల్లాంగ్ వెళ్లారు. అక్కడి ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం సాగుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఇంతకూ ఆయన ప్రసంగిస్తున్న అంశం ఏమిటో తెలుసా.. ''లివబుల్ ఎర్త్''. ఆ అంశంపై ఆయన ప్రసంగం అర్థాంతరంగానే ముగిసింది.
ఒకవైపు వయసు మీదపడుతున్నా.. తన కార్యకలాపాలు ఆగిపోకుండా.. తనకు ఎంతో ఇష్టమైన పనిలోనే.. 84 ఏళ్ల వయసులో కూడా గడుపుతూ.. అలాంటి పని చేస్తూ చేస్తూ.. మధ్యలో హఠాత్తుగా అస్తమించడం అనే.. అదృష్టం ఎందరికి దక్కుతుంది. అనాయాస మరణం అనేది ఒక వరం. అదికూడా.. తనకు ఇష్టమైన కార్యక్షేత్రంలో మరణించడం.. మరో అద్భుతం. అందుకే.. అబ్దుల్ కలాం… జీవితం ధన్యత చెందింది. ఆయన ధన్యజీవి.
ఆయన మార్గనిర్దేశనం ప్రత్యక్షంగా ఈ దేశానికి ఇక దక్కకపోవచ్చు. కానీ.. ఆయన స్ఫూర్తి ఉద్దీపనం మాత్రం సదా దారిచూపుతుంది.
అబ్దుల్ కలాం దివ్యస్మృతికి గ్రేటాంధ్ర డాట్ కాం ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతోంది. ఆ మహనీయునికి నివాళి అర్పిస్తోంది.