ఎమ్బీయస్‌ : యూరోప్‌ గాథలు- 13

సవరణ – పారిస్‌ గురించి చెప్పినపుడు బాస్టిల్‌ కోట అని రాశాను. దాన్ని బాస్టియో అని పలకాలట.  Advertisement ఇప్పటిదాకా ఇంగ్లండుకు సంబంధించిన జానపద గాథలు చెప్పాను. ఇప్పుడు స్కాట్లండ్‌కు చెందిన ఒక రాజు…

సవరణ – పారిస్‌ గురించి చెప్పినపుడు బాస్టిల్‌ కోట అని రాశాను. దాన్ని బాస్టియో అని పలకాలట. 

ఇప్పటిదాకా ఇంగ్లండుకు సంబంధించిన జానపద గాథలు చెప్పాను. ఇప్పుడు స్కాట్లండ్‌కు చెందిన ఒక రాజు చరిత్ర, అతనిపై ఆధారపడిన ఒక కాల్పనిక రచన గురించి చెప్తాను. షేక్‌స్పియర్‌ రాసిన ''మేక్‌బెత్‌'' నాటకం చాలామంది చదివి వుండవచ్చు, కథ తెలిసి వుండవచ్చు. షేక్‌స్పియర్‌ రాసిన విషాదాంత నాటకాల్లో నాలుగు చాలా ప్రసిద్ధమైనవి – ''హేమ్లెట్‌'', ''ఒథెల్లో'', ''కింగ్‌ లియర్‌'', ''మేక్‌బెత్‌''! ఒక గొప్ప వీరుడు ప్రలోభానికి లొంగి రాజద్రోహానికి పాల్పడి, ఆ అపరాధభావనతో బాధపడి, ఒకదానిపై మరొక తప్పు చేసుకుంటూ వెళ్లి చివరకు మరణించడం ''మేక్‌బెత్‌'' కథాంశం. జగత్ప్రసిద్ధమైన ఆ నాటకం ఆధారంగా ఎన్నో నాటకాలు, సినిమాలు, నవలలు పలుభాషల్లో వెలువడ్డాయి. 2003లో దాన్ని మన భారతీయ వాతావరణానికి మలచుకున్న ''మక్‌బూల్‌'' సినిమా వచ్చింది. ఈ డిసెంబర్లో మేక్‌బెత్‌ తాజా రూపం హాలీవుడ్‌ సినిమాగా రాబోతోంది. మేక్‌బెత్‌  మూలాధారం స్కాట్లండ్‌కు చెందిన చరిత్రే. అయితే నాటకీయత పేరుతో, మరి కొన్ని కారణాలతో షేక్‌స్పియర్‌ మేక్‌బెత్‌ చరిత్రను చాలా మార్చేశాడు. ఆ మార్పులు ఎలా జరిగాయి అని చెప్పాలంటే ముందుగా అందరికీ తెలిసిన ''మేక్‌బెత్‌'' నాటకాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ కథ తెలియనివారు కిందనున్న లింక్‌ను క్లిక్‌ చేయండి. తెలిసినవారు ముందుకు సాగండి.

Click Here For Macbeth Story

మేక్‌బెత్‌ చరిత్రలో నిజమైన వ్యక్తి. అతని పూర్తి పేరు మేక్‌ బెతాడ్‌ మాక్‌ఫిండ్‌లాయిక్‌. స్కాట్లండ్‌ను 1040 నుండి 1057 వరకు 17 సం||ల పాటు జనరంజకంగా, సమర్థవంతంగా పాలించిన రాజు. అతని పాలనలో ఉత్తర, దక్షిణ స్కాట్లండ్‌లను ఏకం చేశాడు. అతను గొప్ప వీరుడు. తనకు ముందు స్కాట్లండ్‌కు రాజుగా వున్న ఒకటవ డంకన్‌ను ఓడించి, చంపి రాజ్యానికి వచ్చాడు. ఆ విధంగా రాజులను చంపి సామంతరాజులు సింహాసనం చేజిక్కించుకోవడం ఆ కాలంలో  – ముఖ్యంగా స్కాట్లండ్‌లో – వింతేమీ కాదు. క్రీ.శ.945 నుంచి 1097 మధ్య అంటే 152 సంవత్సరాల కాలంలో మొత్తం 14 రాజుల్లో పది మంది హత్యకు గురైనవారే. మేక్‌బెత్‌ కూడా ఇంగ్లండ్‌ రాజు ఎడ్వర్డ్‌ ద కన్ఫెసర్‌ సైన్యసహాయంతో దండెత్తిన మొదటి డంకన్‌ కుమారుడైన మూడవ మాల్కోమ్‌ చేతిలో ఏబెర్‌డీన్‌ వద్ద ఓడించబడి చంపబడ్డాడు. మాల్కోమ్‌ మేక్‌బెత్‌ను చంపడంతో వూరుకోలేదు. అతని కుటుంబసభ్యులందరినీ నరికేసి శత్రుశేషం లేకుండా చేశాడు. 

ఇలాటి రాజరికపు పద్ధతులుండగా కేవలం మేక్‌బెత్‌ను దుష్టుడిగా చేయడానికి షేక్‌స్పియర్‌ తన యింట ఆశ్రయం పొందిన అతిథిని హత్య చేసే నీచుడిగా మార్చివేశాడు. దానికి చారిత్రక ఆధారం ఏమీ లేదు. నిజానికి డంకన్‌ నాటకంలో చూపించినట్లు వృద్ధుడు కాడు, మేక్‌బెత్‌ వయసువాడే. అసమర్థుడు. డంకన్‌పై జాలి, మేక్‌బెత్‌పై అసహ్యం కలిగించడానికి షేక్‌స్పియర్‌ అతని వయసు పెంచి చూపించాడు. షేక్‌స్పియర్‌ ఎందుకిలా చేశాడో అర్థం చేసుకోవాలంటే ఆనాటి రాజకీయ పరిస్థితులు కాస్త తెలుసుకోవాలి. కవులు నిరంకుశులు అనడమే తప్ప  రాజరికపు రోజుల్లో రాజాశ్రయం లేనిదే వారూ మనజాలరు. ప్రజాస్వామ్యం వున్న యీ రోజుల్లో కూడా పాలకులకు నచ్చని కళాకారుల పరిస్థితి ఎలా వుంటుందో చూస్తున్నాం. ఆ కాలంలో రాజులు 'రాజంటే భూమిపై నడిచే దేవుడే' అనే విశ్వాసాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయించేవారు. రాజు ప్రవర్తనను ఎవరూ ఎత్తి చూపకుండా, రాజుల పట్ల ప్రజలకు వ్యతిరేకభావం ఏర్పడకుండా చూడవలసిన పని కళాకారులది, పురోహితులది. 

శకుంతల కథ మహాభారతంలోది. దానిలో దుష్యంతుడు అడవికి వెళ్లి శకుంతలను అనుభవించి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆమె పిల్లవాణ్ని తీసుకుని రాజస్థానానికి వచ్చి తనను ఏలుకోమని అడిగినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్తాడు. అప్పుడు అశరీరవాణి 'ఆమె నీ భార్య' అని ప్రకటించి ఆమెను అంగీకరించేట్లు చేస్తుంది. ఈ కథను కాళిదాసు నాటకంగా మలిచాడు. రాజుగారు యిలా ఋష్యాశ్రమంలో వున్న పిల్లను చెడగొట్టేసి, తర్వాత నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడంటే రాజులపై చెడ్డ అభిప్రాయం కలుగుతుందని, అది తనకు ఆశ్రయం యిచ్చిన రాజుకు రుచించదని భయపడ్డాడు. అందువలన శకుంతల శాపానికి గురైందని, అందువల్లనే దుష్యంతుడు ఆమెను మర్చిపోయాడనీ, అతను యిచ్చిన ఉంగరాన్ని శకుంతల నదిలో పోగొట్టుకుందని, తర్వాత అది చేప కడుపులో దొరికిందని కల్పించాడు. ఆ విషయం ఎత్తి చూపడానికే నాటకాన్ని 'అభిజ్ఞాన' (తెలుసుకోబడిన) శాకుంతలం' అని తన నాటకానికి పేరు పెట్టాడు. 

షేక్‌స్పియర్‌ కూడా రాజరికపు రోజుల్లోనే నాటకాలు రాశాడు. అందువలన అతనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. అతను నాటకాల కంపెనీ ప్రారంభించినపుడు ఇంగ్లండును మొదటి ఎలిజబెత్‌ రాణి పాలించేది. తన నాటకం కంపెనీకి 'చాంబర్లేన్స్‌ మెన్‌' అని పేరు పెట్టాడు. ఎలిజబెత్‌ కాలంలో ప్రజల్లో సుఖసంతోషాలు వుండేవి కాబట్టి ''మిడ్‌ సమ్మర్స్‌ నైట్‌ డ్రీమ్‌'' వంటి సుఖాంత నాటకాలు ఎక్కువగా రాశాడు. ఆమె తర్వాత మొదటి జేమ్స్‌ రాజు కాగానే షేక్‌స్పియర్‌ తన కంపెనీకి ''కింగ్స్‌ మెన్‌'' అని మార్చాడు. ఆనాటి రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా మారడంతో రాజకీయ కుట్రలు కథాంశాలుగా ''మేక్‌బెత్‌'', ''హేమ్లెట్‌'' వంటి నాటకాలు రాశాడు. జేమ్స్‌ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలకు 1606లో ''మేక్‌బెత్‌''ను రాసి హేంప్టన్‌ కోర్టు పాలెస్‌లో అతని ఎదుట, అతని స్నేహితుల ఎదుట తొలి ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందువలన రాజును సంతృప్తి పరచే విధంగా కథను తీర్చిదిద్దాడు నాటకకర్త. అతను స్టువర్ట్‌ వంశానికి చెందినవాడు. ఆ వంశపు రాజులు తమకు ప్రజలను పాలించే హక్కు దైవదత్తమైనదని నమ్మేవారు. అంతేకాదు, ఏసుక్రీస్తు లాగే తమకు కూడా ప్రజల రోగాన్ని నయం చేసే శక్తి వుందని నమ్మేవారు. షేక్‌స్పియర్‌ ''మేక్‌బెత్‌''లో ఇంగ్లండు రాజు ఎడ్వర్డ్‌ 'రోగులను స్వస్థతపరచేవాడని, అతనికి ఆ శక్తి దేవుడు యిచ్చాడు' అని పాత్రల సంభాషణ ద్వారా చెప్పించాడు. 

జేమ్స్‌ రాజు బాగా చదువుకున్నవాడు. అతనికి మంత్రతంత్రాలపై నమ్మకం ఎక్కువ. అప్పట్లో బ్రిటన్‌ ప్రజలకు మంత్రాలు, మంత్రగాళ్లని విశ్వసించేవారు. వాళ్లు వికృతంగా వుంటారని, రాత్రిపూటే సంచరిస్తారని సైతానును ఆరాధించి, భవిష్యత్తును చెప్పగలిగేవారని అనుకునేవారు. జేమ్స్‌కు యీ విచ్‌క్రాఫ్ట్‌పై చాలా నమ్మకం వుంది. స్కాట్లండ్‌ రాజుగా వుండే రోజుల్లో అనేక మంది మంత్రగత్తెల విచారణలను స్వయంగా పర్యవేక్షించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. మంత్రశక్తులపై 1597లో 'డెమనాలజీ' అనే పుస్తకం రాశాడు కూడా. ఇంగ్లండులో ఎలిజబెత్‌ కాలంలో మంత్రగత్తె అనే కారణంగా ఎవరికీ శిక్ష పడేది కాదు. కానీ జేమ్స్‌ పదవిలోకి వచ్చిన ఏడాదికి 1604లో విచ్‌క్రాఫ్ట్‌కు శిక్ష మరణశిక్షగా ప్రకటించారు. క్షుద్రశక్తులతో సంబంధం వున్నట్లు నిరూపిస్తే ఉరితీసో, దహనం చేసో, నీటిలో ముంచో చంపేసేవారు. రాజుగారికి వున్న నమ్మకాన్ని అనుసరించే షేక్‌స్పియర్‌ తన నాటకంలో మంత్రగత్తెలకు పాత్ర యిచ్చి వారి వలన ఎంత అనర్థం కలిగిందో చూపించాడు. వాళ్లు అనవసరంగా జోస్యం చెప్పి మేక్‌బెత్‌ వంటి రాజభక్తుణ్ని రాజద్రోహిగా మార్చారు కదా! (సశేషం) (ఫోటో – ఎలిజబెత్‌ రాణి నివసించిన విండ్సర్‌ కాసిల్‌ (బెర్క్‌షైర్‌లో వుంది)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Archives