అవి డంకన్ స్కాట్లండ్‌ను ఏలుతున్న రోజులు. అతని సామంతరాజు (థేన్)ల్లో మేక్‌బెత్ ఒకడు. గ్లామిస్ సామంతరాజ్యాన్ని పాలిస్తున్న అతను మహా యోధుడు. రాజవిధేయుడు. రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాడర్ ప్రాంతపు సామంతరాజును యుద్ధంలో చంపి, అతను తన కోటకు తిరిగి వస్తున్నాడు. అతనితో ఫైఫ్ సామంతరాజైన బ్యాంకో కూడా వున్నాడు. దారిలో వారికి ముగ్గురు మంత్రగత్తెలు తగిలారు. 'గ్లామిస్ సామంతరాజుకి జేజేలు' అంటూనే 'కాడర్ సామంతరాజుకు జేజేలు' 'కాబోయే మహారాజుకి జేజేలు' అని కూడా అన్నారు. బ్యాంకోను చూసి 'నువ్వు రాజు కాలేవు కానీ నీ వారసులు రాజవుతారు' అన్నారు. మేక్‌బెత్ వాళ్ల మాటలు కొట్టి పారేశాడు కానీ తన కోట చేరేసరికి మహారాజు డంకన్ తనను కాడర్ సామంతరాజ్యాన్ని కూడా కట్టబెట్టాడని తెలిసి ఆశ్చర్యపడ్డాడు. ఈ జోస్యం నిజమైంది కాబట్టి మహారాజు అయ్యే జోస్యం కూడా నిజమౌతుందని మేక్‌బెత్ భార్య అనసాగింది. ఆమె అత్యాశాపరురాలు, అతి సాహసి. భర్తకు వీరత్వం వున్నా తెగింపు లేదని దెప్పిపొడుస్తూ వుంటుంది. డంకన్‌కు తన యిద్దరు మగ పిల్లల్లో మాల్కోమ్‌ను తన వారసుడిగా యిప్పటికే ప్రకటించాడు కనుక తనకు మహారాజు అయ్యే భాగ్యం ఎలా అబ్బుతుందని మేక్‌బెత్ ఆమెతో వాదించి వూరుకోబెట్టాడు. అయితే అనుకోకుండా డంకన్ ఆ ప్రాంతాలు పర్యటించడానికి వచ్చి మేక్‌బెత్ కోటలో ఆ రాత్రి విశ్రమించాడు.
రాజును చంపి నువ్వు రాజు కావడానికి యిదే సరైన అదనని అతని భార్య రెచ్చగొట్టింది. విందు తర్వాత రాజు కాపలాదారులకు మద్యంలో మత్తుమందు కలిపి నిద్రపుచ్చింది. భర్త చేతికి బాకు యిచ్చి పంపింది. పాపపుణ్యాల చర్చ కట్టిపెట్టి రాజును మట్టుపెట్టమంది. భార్య ఉద్బోధలకు లొంగి మేక్‌బెత్ నిద్రపోతున్న రాజును పొడిచి చంపివేశాడు. మధ్యయుగాలలో ఒక వీరుడికి తగని పని అది. తిరిగి వచ్చి బాకును భార్యకు యిచ్చి దాచమని చెప్పి, చేసిన పనికి చింతించసాగాడు. అంతలో కోట తలుపు వద్ద మెక్‌డెఫ్ ప్రత్యక్షమయ్యాడు. అతను ఫైఫ్ సామంతరాజ్యానికి ప్రభువు. రాజభక్తుడు. పొద్దున్నే రాజును నిద్ర లేపడానికి వచ్చాడు. మేక్‌బెత్ అతన్ని రాజు గదిలోకి తీసుకెళ్లి అక్కడ శవాన్ని చూసి ఆశ్చర్యపడినట్లు నటించి, కోపోద్రేకంతో అన్నట్లు కాపలాదారులను అక్కడికక్కడ చంపేసి, రాజు హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ ప్రతిజ్ఞ చేశాడు. తండ్రి హత్యతో బెదిరిపోయిన రాజు కొడుకుల్లో డోనాల్‌బెయిన్ ఐర్లండుకు, మాల్కోమ్ ఇంగ్లండుకు పారిపోయి తలదాచుకున్నారు. ఇంగ్లండు రాజు ఎడ్వర్డ్, ద కన్ఫెసర్ మాల్కోమ్‌కు ఆశ్రయం యిచ్చాడు. మేక్‌బెత్ స్కాట్లండ్‌కు రాజయ్యాడు. ఆ విధంగా మంత్రగత్తెల జోస్యం నిజమైంది. రాణి కావాలన్న మేక్‌బెత్ భార్య కల సాకారమైంది.
రాజు కావడంతో మేక్‌బెత్ శాంతించలేదు. తన వారసులే స్కాట్లండ్‌ను ఏలాలన్న కాంక్ష పుట్టింది. కానీ మంత్రగత్తెల మూడో జోస్యం ప్రకారం బ్యాంకో వారసులే రాజ్యానికి వస్తారు. మొదటి రెండూ నిజమయ్యాయి కాబట్టి యిది కూడా నిజమౌతుందన్న భయం పట్టుకుంది. దాన్ని అబద్ధం చేయడానికి బ్యాంకోను, అతని కొడుకును హత్య చేయమని తన మనుషులను పురమాయించాడు. వాళ్లు బ్యాంకోను చంపగలిగారు కానీ కొడుకు ఫ్లీయాన్స్ పారిపోయాడు. అవేళ రాత్రి మేక్‌బెత్ యింట్లో విందు ఏర్పాటు చేసినపుడు అక్కడ అతనికి బ్యాంకో భూతం కనబడింది. మేక్‌బెత్ బెదిరిపోయి దానితో మాట్లాడసాగాడు. ఆ భూతం వేరెవ్వరికీ కనబడకపోవడంతో యితని వైఖరి ఎవరికీ అర్థం కాలేదు. అతని భార్య 'ఆయనకు ఒంట్లో బాగాలేదు' అని చెప్పి సర్దుబాటు చేసింది.
బ్యాంకో కొడుకు పారిపోయాడని తెలిసి మేక్‌బెత్‌కు భయం వేసింది, అతను వచ్చి తనను చంపి రాజు అవుతాడేమోనని. మళ్లీ మంత్రగత్తెల వద్దకు వెళ్లి జోస్యం చెప్పమన్నాడు. బ్యాంకో వారసులు సింహాసనానికి రావడం ఖాయం అని చెప్తూనే 'నీ చావు రావాలంటే బిర్నాం అడవి నీ కోటకు తరలి రావాలి, అంతేకాదు స్త్రీ యోని నుండి పుట్టినవాడెవడూ నిన్ను చంపలేడు' అని చెప్పారు వాళ్లు. అసంభవమైన విషయాలు జరిగినప్పుడే తన మరణం అన్నారు కాబట్టి తను అజేయుడనని మేక్‌బెత్ అహంకరించాడు. అప్పటిదాకా మేక్‌బెత్‌ను అంటిపెట్టుకుని వున్న మెక్‌డఫ్‌కు మేక్‌బెత్ వ్యవహారాలు నచ్చడం మానేశాయి. అతనే రాజును హత్య చేశాడన్న అనుమానం కలిగి అతనితో విభేదించి ఇంగ్లండుకు పారిపోయాడు. అది వినగానే మేక్‌బెత్‌కు విపరీతంగా కోపం వచ్చింది. మెక్‌డఫ్ కోటపై దాడి చేయించి అతని భార్య పిల్లలను చంపించాడు. ఆ వార్త ఇంగ్లండుకు చేరగానే మెక్‌డఫ్‌కు పగ రగిలింది. డంకన్ కుమారుడైన మాల్కోమ్ పక్షాన చేరి 'మీ నాన్నను చంపినది మేక్‌బత్తే. అతనిపై పగ సాధించి తీరాలి' అని రెచ్చగొట్టాడు. మాల్కోమ్, మెక్‌డఫ్ సైన్యాలను సేకరించి స్కాట్లండ్‌పైకి రాసాగారు.
ఇక్కడ మేక్‌బెత్ భార్య మానసిక అనారోగ్యానికి గురైంది. చేసిన పాపాన్ని డుక్కోవడానికా అన్నట్లు రాజును చేతులు మాటిమాటికీ కడిగేది. నిద్రలో నడవసాగింది. మతిమరుపుకు లోనైంది. జీవితకాలం మంచిలో, చెడులో భాగస్వామిగా వున్న భార్య యిలా మారడం మేక్‌బెత్‌ను బాధించింది. చివరకు ఆమె మరణంతో అతను హతాశుడయ్యాడు. ఇంతలో మాల్కోమ్ సేన దాడికి వస్తోందని తెలిసింది కానీ అడవి కదలి వచ్చేదాకా ప్రమాదం లేదని వూరుకున్నాడు. మాల్కోమ్ వద్ద ఎక్కువమంది సైనికులు లేరు. తమ సంఖ్య తెలియకుండా వుండాలంటే బిర్నాం అడవిలోని చెట్లను నరికి ఆ కాండాలను అడ్డుగా పెట్టుకుని కోటవైపు వెళ్లాలని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా అడవే కోట వద్దకు కదలివచ్చింది. ఈ జోస్యం నిజం కావడంతో మేక్‌బెత్ చలించాడు. తను యుద్ధరంగంలోకి దిగాడు. వీరోచితంగా పోరాడాడు. మెక్‌డఫ్‌తో ముఖాముఖీ పోరాటం జరిగింది. అప్పుడు మేక్‌బెత్ గర్వంగా మంత్రగత్తెల జోస్యం గురించి చెప్పి నన్ను చంపేవాడు యిప్పటివరకు పుట్టలేదు అన్నాడు. అప్పుడు మెక్‌డెఫ్ 'ప్రసవ సమయంలో నా తల్లి నన్ను కనలేకపోతూ వుంటే ఆమె కడుపు కోసి నన్ను తీశారు. అందువలన నేను సాధారణమార్గంలోంచి యీ ప్రపంచంలోకి రాలేదు.' అన్నాడు. మేక్‌బెత్ నిర్ఘాంతపోయాడు. ఆ యుద్ధంలో మెక్‌డెఫ్ మేక్‌బెత్‌ను సంహరించగలిగాడు. మాల్కోమ్ స్కాట్లండ్‌కు రాజయ్యాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)