ఆంధ్రా ముద్ర రూపుమాపే యత్నమా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హామీలను ఎంతవరకు నెరువేరుస్తారో, సింగపూర్‌ కలలను ఎంతమేరకు సాకారం చేస్తారో చెప్పలేంగాని, ఇప్పుడాయన మరో ప్రయత్నంలో ఉన్నారు. ఇది ప్రజలకు సంబంధం లేనటువంటిది. ఇది ఆయన రాజకీయాలకు…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హామీలను ఎంతవరకు నెరువేరుస్తారో, సింగపూర్‌ కలలను ఎంతమేరకు సాకారం చేస్తారో చెప్పలేంగాని, ఇప్పుడాయన మరో ప్రయత్నంలో ఉన్నారు. ఇది ప్రజలకు సంబంధం లేనటువంటిది. ఇది ఆయన రాజకీయాలకు సంబంధించింది. ఏమిటా ప్రయత్నం? ఏమిటంటే ….తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చడం, తద్వారా తాను జాతీయ రాజకీయ నాయకునిగా ముద్ర వేయించుకోవడం. టీడీపీని జాతీయ పార్టీగా మార్చడం అనే ఆలోచన కొత్తది కాదు. చాలా పాతది. ఇంకా చెప్పాలంటే ఎన్‌టిఆర్‌ హయాం నాటిది. కాని అది కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణాలు ఏవైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలోచన గొప్పదే అయినా బాబు ఎంతవరకు విజయం సాధిస్తారనేది ఇప్పుడు చెప్పలేం. అందుకు చాలా తతంగం ఉంది. అది పూర్తిగా ఎన్నికలతో ముడిపడి ఉంది కాబట్టి ఇప్పట్లో అయ్యే పనికాదు. 

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మారుస్తారనే విషయమై మొన్నీమధ్య మీడియాలో అనేకవార్తలొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి, రెండు సాధారణ ఎన్నికలను (2004, 2009) ఎదుర్కొన్నప్పుడు చేయని ప్రయత్నాలు ఇప్పుడెందుకు చేస్తున్నారు? వెంటనే జాతీయ పార్టీగా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఇందుకు విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే…చంద్రబాబు తన ‘ఆంధ్రా ముద్ర’ను రూపుమాపుకోవాలని అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు కదా…! దానివల్ల నష్టమేముంది? ఆయన ఇమేజ్‌కు ఏం భంగం కలిగింది? ఇవి సామాన్యులకు కలుగుతున్న సందేహాలు. కాని బాబు ఆలోచన వేరుగా ఉంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనేది ఆయన ఆకాంక్ష. వస్తుందనే నమ్మకం కూడా ఆయనకు ఉంది. ఈమధ్య ఈ విషయం చాలాసార్లు చెప్పారు కూడా. మొన్నటి సాధారణ ఎన్నికల్లో  తెలంగాణలోనూ చెప్పకోదగిన స్థానాలు సంపాదించిన తరువాత గట్టి ప్రయత్నాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి రావచ్చేమోననే అభిప్రాయం కలిగింది. కాని…తెలంగాణలో టీడీపీకి బద్ధ శత్రువైన టీఆర్‌ఎస్‌ దానికి ‘ఆంధ్రా పార్టీ’ అనే ముద్ర వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే పదవులు పొందారు. ఓ స్థాయిలో రాణించారు. కాని…ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించారో అప్పటి నుంచి టీడీపీని అంటరాని పార్టీగా, ఆంధ్రా పార్టీగా ప్రచారం చేశారు. ప్రజల్లోకి ఈ భావం ఎక్కించారు. ఇప్పుడూ ఆయన అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. 

అయితే ఆంధ్రా పార్టీ అనే ముద్ర తొలగిపోవాలంటే దాన్ని జాతీయ పార్టీగా చేయడమే మార్గమని బాబు భావిస్తున్నారు. ఆనాడు ఎన్‌టి రామారావు తెలుగువారి కోసం పార్టీ పెట్టారు కాబట్టి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలంలోనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో టీడీపీని జాతీయ పార్టీ చేయాలనుకున్నారు. దానికి ‘భారతదేశం’ అనే పేరు పెట్టాలనుకున్నారు. కాని అది సాకారం కాలేదు. ఎన్టీఆర్‌ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠం అలంకరించిన బాబు కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రస్థాయి నాయకులు ప్రధానులు కావడంలో చక్రం తిప్పారు. ఎన్టీఆర్‌, బాబు ప్రాంతీయ పార్టీ నాయకులే అయినా, కేవలం ముఖ్యమంత్రులుగానే పనిచేసినా వారిని జాతీయ నాయకులుగానే పరిగణిస్తున్నారు. ఒకప్పుడు నేషనల్‌ ఫ్రంట్‌కు ఎన్టీఆర్‌ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, చంద్రబాబు  యునైటెడ్‌ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా ఉన్నారు. కేంద్రంలో సంక్షోభం వచ్చినప్పుడు జాతీయ పార్టీల నాయకులు, ఉత్తరాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులు బాబు వైపు చూస్తారు. బాబు చతురత మీద వారికి నమ్మకం ఉంది. ‘నాకు ప్రధానిగా అవకాశం వచ్చినా వదులుకున్నా’ అని బాబు అప్పుడప్పుడు చెబుతుంటారు కూడా. సరే…అదెలా ఉన్నా టీడీపీని జాతీయ పార్టీ చేయాలనే ఆలోచనకు పార్టీలోనూ మద్దతు ఉంది. కాని…ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారడం ఎన్నికల్లో సాధించే సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంది. ఒకవేళ టీడీపీ తనకు తాను జాతీయ పార్టీగా ప్రకటించుకున్నా అధికారికంగా అందుకు గుర్తింపు లభించదు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నిర్దేశిత స్థానాలు సంపాదించాల్సిందే.

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం…ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం సీట్ల చొప్పున నాలుగు రాష్ట్రాల్లో రావాలి. లోక్‌సభలోనూ కనీసం నాలుగు సీట్లు ఉండాలి. ఈ సీట్లు ఒక్క రాష్ట్రం నుంచైనా ఉండొచ్చు లేదా మూడు నాలుగు రాష్ట్రాల నుంచి కలిపి ఉండొచ్చు. ఈ నిబంధనల ప్రకారం ప్రస్తుత లోక్‌భలో టీడీపీకి రెండు శాతం సీట్లుండాలి. అంటే పదకొండు సీట్లు మూడు రాష్ట్రాల నుంచి ఉండాలి. టీడీపీకీ లోక్‌సభలో రెండు శాతం (17 సీట్లు) సీట్లున్నాయి. కాని అవి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఉన్నాయి. నిబంధనల ప్రకారం అసెంబ్లీ సీట్లు లేవు. కాబట్టి ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. 

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ చేసి నందమూరి బాలకృష్ణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే డిమాండ్‌ గతంలో ఒకసారి వచ్చింది. దీనివల్ల నందమూరి వంశానికి కూడా న్యాయం చేసినట్లుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు కొందరు నాయకులు బాబు కుమారుడు నారా లోకేష్‌కు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్‌ బాబేనని ఈమధ్య ఓ మంత్రి అన్నారు. టీడీపీని జాతీయ పార్టీగా చేస్తే చంద్రబాబు రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. మరి అప్పుడు పగ్గాలు లోకేష్‌కు ఇస్తారా? మరెవరికైనా అప్పగిస్తారా? సాధారణంగా మన దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ రాజవంశాల టైపు. పూర్వం రాజు కుమారుడే మళ్లీ రాజయ్యేవాడు. అలాగే ప్రాంతీయ పార్టీల్లోనూ అధినేతల కుమారులే తరువాత అధినేతలవుతారు. ‘నా రాజకీయ వారుసుడు బాలకృష్ణ’ అనే ఒకప్పుడు ఎన్టీఆర్‌ పబ్లిగ్గా ప్రకటించినా ఆ స్థానాన్ని చంద్రబాబు ఆక్రమించారు. తమిళనాడులో డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి తన వారసుడిగా స్టాలిన్‌ను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్‌ కుమారుడు సీఎం అయ్యారు. ఒకప్పుడు బీహార్లో లాలూప్రసాద్‌ తన భార్యను ముఖ్యమంత్రిని చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలావుంది. ఇదే సంప్రదాయం టీడీపీలోనూ కొనసాగదని నమ్మకమేమిటి? 

ఎం. నాగేందర్