జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లు ప్రజాదరణ పొందడంతో మన తెలుగు ముఖ్యమంత్రులకు కూడా ఆ వెఱ్ఱి పట్టింది. ఉన్న సంక్షేమ పథకాలకు తోడు అవి కూడా మొదలుపెట్టారు. ‘అమ్మ’కు దీటుగా బాబు ‘అన్న’ అంటున్నారు. కేసీఆర్ ఇంకా ఇలాంటి చుట్టరికం పేరు ఏదీ తగిలించుకోలేదు. ఇంతకీ జయలలిత మొదలుపెట్టిన క్యాంటీన్ల భారం ఎలా వుంది? పొద్దున్న టిఫిన్‌గా రెండు ఇడ్లీలు, పొంగల్, కారప్పొడి, సాంబారుతో సహా రూ.7కి ఇస్తున్నారు. చపాతీ, పప్పుకి 3 రూ.లే. 10 గంటల వరేక ఇవి దొరుకుతాయి. మధ్యాహ్నం 12 గం॥ నుండి భోజనం. సాంబారన్నం, పులిహార, కరివేపాకన్నం ఒక్కోటి 5 రూ.లు. పెరుగన్నం 3 రూ.లు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి క్యాంటీన్లు 294 వున్నాయి. రోజుకి రెండున్నర లక్షల మంది వీటిని ఉపయోగిస్తున్నారు. మొదట్లో రేట్లు ఫిక్స్ చేసినపుడు కిట్టుబాటుగా వుండేటట్టు ప్లాన్ చేశారు. సరుకుల్లో చేతివాటుతనం పెరిగి ఇప్పుడు అవి నష్టదాయకంగా తయారయ్యాయి. పెట్టే ఖర్చులో 60% మాత్రమే వెనక్కి వస్తోంది. అయినా ధరలు పెంచలేక ఏటా రూ. 100 కోట్లు సబ్సిడీ ఇస్తోంది.
‘అమ్మ’ బ్రాండ్ టిఫిన్లు, భోజనాలేక పరిమితం కాలేదు. తాగునీరు, ఉప్పు, మందులు, కూరగాయలు.. ఇలా చాలా సప్లయి చేస్తున్నారు. కొత్తగా బేబీ కేర్ కిట్ కూడా వచ్చి చేరింది. అమ్మ ఉప్పు ఇప్పటికి 900 టన్నులు అమ్మారు. గత సెప్టెంబరులో ప్రారంభించిన అమ్మ తాగునీరు నెలకు 30 లక్షల సీసాలు అమ్ముతోంది. స్టేట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌పోర్టు కార్పోరేషన్ గుమ్మడిపూండి చెరువు వద్ద ప్లాంట్ పెట్టి నీరు శుద్ధి చేసి, 304 కౌంటర్ల ద్వారా 10 రూ.లకు లీటరు చొప్పున అమ్ముతోంది. ఇవి బాగానే పాప్యులర్ అయ్యాయికానీ రైతు బజారు తరహాలో చెన్నయ్‌లో మొదలుపెట్టిన అమ్మా కూరగాయల ఔట్‌లెట్స్ 10 కి మించలేదు. 2 వేల నుండి 3 వేల మంది అక్కణ్నుంచి కొనుక్కుంటున్నారు.
అమ్మా మెడికల్ షాపుల్లో డాక్టర్లు ప్రిస్కయిబ్ చేసిన పెద్దగా మందులమ్మకపోవడంతో 10% డిస్కౌంటు ఇచ్చినా ప్రజాదరణ పొందలేదు. అవి కూడా పదే వున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బజెట్‌లో రూ.2293 కోట్లు లోటు వుంది. ఉచిత పథకాలకై రూ.14541 కోట్లు పోతోంది. అమ్మ పథకాలకు రూ.375 కోట్లు అవుతున్నాయి. ఇవి చాలనట్లు ఇంకో 360 అమ్మ క్యాంటీన్లు తెరవడంతో బాటు అమ్మ సినిమాలు, అమ్మ మార్కెట్లు, అమ్మ టీ, అమ్మ ఉమెన్స్ హాస్టళ్లు ప్రారంభిస్తారట. దురదృష్టం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలు వీటిని కాపీ కొడదామని చూస్తున్నాయి. తమిళనాడులో అమలవుతున్న పథకాలకు తోడు మన సొంత ప్రజాకర్షక పథకాలున్నాయి కదా – ఋణమాఫీ వంటివి! ఇవీ అవీ బాలన్స్ చేయగలరా? తూకం తప్పి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ప్రజల గతి ఏమిటి?
ఎమ్బీయస్ ప్రసాద్