ఎమ్బీయస్‌ : రాగా – నమ్ముకున్న వాళ్లకు ఆరున్నొక్క రాగమే

మొన్న పార్లమెంటు ఎన్నికలలో మోదీ సాధించిన ఘనవిజయం గురించి హరీశ్‌ ఖారే అనే సీనియర్‌ జర్నలిస్టు ''హౌ మోదీ వన్‌ ఇట్‌…'' అనే పుస్తకం రాశారు. దానిలోని కొన్ని భాగాలు పత్రికలలో వచ్చాయి. ఓ…

మొన్న పార్లమెంటు ఎన్నికలలో మోదీ సాధించిన ఘనవిజయం గురించి హరీశ్‌ ఖారే అనే సీనియర్‌ జర్నలిస్టు ''హౌ మోదీ వన్‌ ఇట్‌…'' అనే పుస్తకం రాశారు. దానిలోని కొన్ని భాగాలు పత్రికలలో వచ్చాయి. ఓ పక్క మోదీ ఏడాదికి ముందే సిద్ధమై సర్వశక్తులూ సమీకరించుకుని ముందుకు దూసుకుపోతూ వుండగా, మరో పక్క కాంగ్రెసుకు సారథ్యం వహించవలసిన రాహుల్‌ గాంధీ నిద్రమత్తులో తూగుతూ, నిరాసక్తంగా తను ఎటు వెళుతున్నాడో, పార్టీని ఎటువైపు తీసుకెళుతున్నాడో తెలియక కాంగ్రెసు రథాన్ని నడిపాడని మామూలు ప్రజలమే గమనించాం. కాంగ్రెసు నాయకులు, సీనియర్‌ అధికారులు గమనించకుండా వుంటారా? అయినా పైకి చెప్పరు. రాహుల్‌ గాంధీ యువకుడు. దేశాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలన్నదానిపై ఆయనకు ఎన్నో వూహలున్నాయి. మాకు ఆయన నాయకత్వంపై నమ్మకం వుంది.  అంటూ నాయకులు ప్రకటనలు చేస్తారు. ఇక అధికారులు తాము ఎవరి కింద పనిచేస్తున్నారో వారికి 'మీడియాలో ఏం రాసినా మన యింటెలిజెన్సు వర్గాల రిపోర్టు ప్రకారం మీదే గెలుపని తెలుస్తోంది' అని మెరమెచ్చు కబుర్లు చెపుతూ జోకొడతారు. అందుకే అధికారంలో వున్నవాళ్లు బోల్తా పడుతూంటారు. హరీశ్‌ ఢిల్లీలో పనిచేసే  జర్నలిస్టు కాబట్టి వాళ్లతో ఆంతరంగికంగా మాట్లాడి విషయాలు బయటకు లాగగలడు. మర్యాద కాదు కాబట్టి వాటిని యథాతథంగా అప్పుడు ప్రచురించరు. ఇప్పుడు ఫలితాలు అందరికీ తెలిసిపోయాక, అప్పుడు ఆ నాటి డైరీని బయటపెడతారు. హరీశ్‌ రాసిన పుస్తకంలో రాహుల్‌ గురించి, మోదీ జగన్నాథ రథం గురించి జర్నలిస్టులు, అధికారులు ఏమనుకున్నారో వాటి గురించి, కొన్ని సంఘటనల గురించిన వివరాలు వున్నాయి.

ఓ జర్నలిస్టు ఫ్యామిలీతో కలిసి చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళితే అక్కడ పక్క టేబుల్‌పై రాహుల్‌, మరో నలుగురైదుగురు కుర్రాళ్లు వున్నారట, పొట్టి దుస్తుల్లో ఒక అమ్మాయి కూడా. అది 2014 ఏప్రిల్‌. పేపర్లో, టీవీల్లో అదే రోజు పొద్దున్న రాయబరేలీలో సోనియా గాంధీ నామినేషన్‌ ఫైలు చేస్తూండగా ఆమె పక్కనే సాయంగా నిలబడిన రాహుల్‌ ఫోటోలు వచ్చాయి. సాయంత్రం చూస్తే యిక్కడ! ఆ కుర్రాళ్లెవరూ రాజకీయాల్లో వున్నవాళ్లు కారు. వారి సంభాషణ ఆ జర్నలిస్టు చెవిలో పడుతూనే వుంది. డబ్బున్న కుర్రాళ్ల పిచ్చివాగుడు తప్ప దేశభవిష్యత్తు గురించిన టాపిక్కే లేదు. 'నాయకుడనేవాడికి అధికారదాహం వుండాలి, ఆకలిగొన్న పులిలా పోరాడాలి. ఈ కుర్రాడికి ఆకలిదప్పులు వేరే విషయాల్లో వున్నాయి కానీ రాజకీయాలకు సంబంధించి లేవు.' అనుకున్నాడు ఆ జర్నలిస్టు. 'అబ్బే లేకపోవడమేం, సంకీర్ణ ప్రభుత్వాలతో మన్‌మోహన్‌ వేగుతున్న తీరు చూసి రాహుల్‌ విసిగిపోయారు. 2014 ఏదో యిలా పోనిచ్చి, 2019 నాటికి కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ సిద్ధించేట్లా ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడు' అని కొందరు కాంగ్రెసు ముఖ్యమంత్రులు, రాష్ట్రాధ్యకక్షులు హరీశ్‌తో దబాయించేవారట. 'అతనికంత సీనుందా? అప్పటిదాకా పార్టీ నిలుస్తుందా?' అని లోపల సందేహిస్తూనే. 'సోనియా గాంధీ పోరు భరించలేక రాహుల్‌ ఆ పదవిలో కొనసాగుతున్నాడు. వాళ్లిద్దరికీ మధ్య పార్టీ విషయాలపై ఏ చర్చ జరుగుతుందో ఎవరికీ తెలియదు. సయోధ్య వున్నట్టుగా కూడా తోచదు. అన్నిటికీ అహ్మద్‌ పటేలే గతి. అతని వద్దకు ఏ సమస్య తీసుకెళ్లినా 'ఆ విషయం మా దృష్టికి వచ్చింది, దానిపై ఏదో ఒక నిర్ణయం త్వరలోనే తీసుకోవడం జరుగుతుంది.' అంటూంటాడు. ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించారో లేక అలాగే వదిలేశారో ఎవరికీ తెలియదు' అంటాడు మరో సీనియర్‌ నాయకుడు. తెలంగాణ విషయంలో మనం చూశాం – సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ ఎలా తాత్సారం చేసి, చివరకు పార్టీని, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో! మోదీ సమీరం క్రమేపీ ప్రభంజనంగా మారుతున్నపుడు యుపిఏలో మేలు పొందిన అనేకమంది అధికారులు బిజెపిలో చేరసాగారు. అది చూసైనా కాంగ్రెసు మేలుకోలేదు. తన ముఖ్యమంత్రులను తన పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తూ వుంటే గోతులు తీస్తూ వుంటే ఎవర్నీ మందలించలేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై కాంగ్రెసు నాయకులు ఎలా నోరు పారేసుకునేవారో యిక్కడా చూశాం. రాహుల్‌ ఎవర్నీ అదిలించలేదు.

కాంగ్రెసు నాయకులందరికీ ఒక పద్ధతికి అలవాటు పడ్డారు. టిక్కెట్టు దొరికేదాకా వాళ్లకూ వీళ్లకూ తినిపించడంలో డబ్బు ఖర్చు పెట్టడం, టిక్కెట్టు వచ్చాక ప్రచారానికై నిధులిమ్మని హై కమాండ్‌ను వేధించడం, వచ్చిన నిధులను ఓటర్లపై ఖర్చు పెట్టకుండా తన యింటికి తరలించడం, ఓడిపోతే నిధులు సరిపోలేదని ఫిర్యాదు చేయడం! తక్కిన పార్టీల్లో కూడా యీ సమస్య వుంది కానీ కాంగ్రెసులో యిది పరాకాష్టకు చేరింది. దీన్ని అరికట్టడానికి రాహుల్‌ చేసినదేమీ లేదు. పరిస్థితి బాగా లేదని అందరికీ తెలుసు, కానీ ఎవరూ దాని గురించి ఏమీ చేయలేదు. రాహుల్‌ కాకపోతే ప్రియాంకా గాంధీ ఐనా వచ్చి రక్షిస్తుందని కొందరు కింది స్థాయి కార్యకర్తలు ఆశపెట్టుకున్నారు కానీ కొందరు బ్యూరోక్రాట్లు ఆమెనూ తీసిపారేశారు. ''చూడు, యివాళ భర్త రాబర్డ్‌ వాధ్రాతో కలిసి ఓటేయడానికి వచ్చింది. మూర్తీభవించిన అవినీతికి మారుపేరుగా రాబర్ట్‌ పేరు మారుమ్రోగుతున్నపుడు ఆమె అలా చేయవచ్చా? ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే సోనియా గాంధీలో పట్టుదల వుంది, మొండితనం వుంది, కాథలిక్‌ సంప్రదాయం నేర్పిన క్రమశిక్షణ వుంది, ప్రజలేమనుకుంటారోనన్న జంకు యూరోపియన్లకు వుంటుంది చూశారా, అలాటి సెన్సిబిలిటీ వుంది. ఆమె పిల్లలకు అదేమీ లేదు. కులాసారాయుళ్లుగా కనిపిస్తారు.'' అని మండిపడ్డారు. నెహ్రూ కుటుంబమంటే అభిమానం గల ఒక రిటైర్డ్‌ అధికారి ''2012 నాటికి మన్‌మోహన్‌ ప్రధాని పదవి రాహుల్‌కి అప్పగించేసి, తను దేశాధ్యకక్షుడు అయిపోవాల్సింది. రాహుల్‌కి మంచి ట్రైనింగ్‌ అయి వుండేది'' అని వాపోయాడట. ''ఆయన యిస్తానన్నా యితను పుచ్చుకోవాలి కదా. అలాటి ప్రతిపాదన వచ్చినపుడు రాహుల్‌ 'అబ్బే 2009 జనాదేశం మన్‌మోహన్‌ను చూసి వచ్చింది. నేను 2014లో నెగ్గి అప్పుడు పగ్గాలు చేపడతాన'ని అన్నాడట.'' అని హరీశ్‌ వివరించారు. ఆ 2014 యిప్పుడు 2019 అయినట్టుంది.

ఎన్నికల్లో ఓటమి సంభవించాక పదేళ్లు రాజ్యం చేయడం చేత ఏంటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో కాంగ్రెస్‌ ఓడిపోయింది అని సంజాయిషీ చెపుతున్నారు రాహుల్‌ అభిమానులు. మరి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో ఆ లాజిక్‌ పని చేయలేదేం? అని ఎవరూ గట్టిగా అడగరు. రాహుల్‌ని తీసేద్దాం అని ఒక నాయకుడంటే మరి అతని స్థానంలో ఎవర్ని పెడదాం? అని వేరేవాళ్లు అడుగుతారు. ఎవరి వద్దా సమాధానం లేదు. 1998 ఎన్నికలలో కాంగ్రెసు ఓడిపోయింది. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ పివి నరసింహారావు నియమించిన పార్టీ అధ్యకక్షుడు సీతారాం కేసరి రాజీనామా చేయాలి అని అర్జున్‌ సింగ్‌ వంటి వారు తిరుగుబాటు చేశారు. వారి చేత తిరుగుబాటు చేయించినది సోనియా గాంధీ. అలా అప్పుడు ఆమె పార్టీ పగ్గాలు చేజిక్కుంచుకుంది. మరి యిప్పుడు కాంగ్రెసు ఘోరపరాజయం పొందింది. అలాటి తీర్మానం చేసి పార్టీ అధ్యకక్షుడు, ఉపాధ్యకక్షుణ్ని దింపేసేవారెవరు?

– ఎమ్బీయస్‌ ప్రసాద్