మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్, చంపబడింది. ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించిన ‘వాస్తవం’ ఇది. ఇప్పటిదాకా సునంద పుష్కర్ మరణంపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. కొన్ని మందుల్ని అతిగా వాడటం వల్ల ఆమె మరణించారని అప్పట్లో ప్రచారం జరిగింది. శశిథరూర్ అప్పట్లో కేంద్ర మంత్రిగా వుండటంతో, ఆయన భార్య మరణం వివాదాస్పదం కాకుండా, ‘మర్డర్ మిస్టరీ’ని ఛేదించడంలో పోలీసులు అంత సీరియస్‌గా వ్యవహరించలేదన్న విమర్శలొచ్చాయి.
‘ఒత్తిళ్ళ కారణంగా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌ని తప్పుగా ఇవ్వాల్సి వచ్చింది..’ అని సాక్షాత్తూ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించేసరికి, ఒక్కసారిగా సునంద మృతి పట్ల కొత్త మిస్టరీ తెరపైకొచ్చింది. ఇప్పుడా మిస్టరీ వీడాల్సి వుంది. అందులో భాగంగానే సునంద పుష్కర్‌పై విష ప్రయోగం జరిగిందని తాజాగా తేలింది. అయితే ఎంత మోతాదులో విషం ఇచ్చారన్నది ఇంకా తేలాల్సి వుంది.
తాము మొదటినుంచీ సునంద పుష్కర్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశామనీ, తమ అనుమానాలు ఇప్పుడు నిజమవుతున్నాయని సునంద బంధువులు వాపోతున్నారు. శశిథరూర్, సునంద పుష్కర్ వివాహమే అప్పట్లో హాట్ టాపిక్. అంతకుముందు సునందకీ రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి వేర్వేరు వ్యక్తులతో. శశిథరూర్ పరిస్థితి ఇంతే. వేర్వేరు కారణాలతో ఇరువురూ తమ తమ మొదటి, రెండు వివాహాల్ని బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత శశిథరూర్, సునంద ఒక్కటయ్యారు.
చనిపోవడానికి కొద్ది రోజుల ముందు సునంద పుష్కర్, శశిథరూర్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయనీ, ఈ క్రమంలోనే సునంద ఆత్మన్యూనతకు గురయ్యాయనీ, డిప్రెషన్‌ని తగ్గించుకోవడానికి ఉపయోగించే మాత్రలు మోతాదు మించి వేసుకుని, ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సునంద మరణించిన వెంటనే విన్పించిన తొలి ఊహాగానం. అప్పటినుంచీ అనేక ఊహాగానాలు తెరపైకి వస్తూనే వున్నాయి.
మొత్తమ్మీద, సునందను ఎవరో చంపేశారన్నది స్పష్టం. ఎవరు చంపేశారన్నది మాత్రం ఇంకా తేలాల్సి వుంది. సునంద పుష్కర్ భర్త శశిథరూర్, కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెబుతుండడం గమనార్హమిక్కడ.