టాలీవుడ్ బడా ఫైనాన్షియర్ పివిపి?

టాలీవుడ్ లో ఇప్పుడు అడగగానే అప్పిచ్చువాడు ఎవరు? టాలీవుడ్ లో బడా ఫైనాన్షియర్ ఎవరు? రంగయ్య? శోభన్ ? అలంకార్ ప్రసాద్ ? సురేష్ ? అరవింద్ ? వీరెవరు కాదు..వీరంతా ఒకప్పుడు టాప్…

టాలీవుడ్ లో ఇప్పుడు అడగగానే అప్పిచ్చువాడు ఎవరు? టాలీవుడ్ లో బడా ఫైనాన్షియర్ ఎవరు? రంగయ్య? శోభన్ ? అలంకార్ ప్రసాద్ ? సురేష్ ? అరవింద్ ? వీరెవరు కాదు..వీరంతా ఒకప్పుడు టాప్ ఫైనాన్షియర్లు అయితే అయి వుండొచ్చు. కానీ ఇప్పుడు పివిపి సంస్థే అతి పెద్ద ఫైనాన్షియర్ అని తెలుస్తోంది. 2015లో విడుదల కాబోయే భారీ చిత్రాలన్నింటికీ ఆ సంస్థే ఫైనాన్స్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బాహుబలి, రుద్రమదేవి, టెంపర్, పటాస్ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. టెంపర్ ఇప్పటికి 22 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పటాస్ కు 20 వరకు తీసుకున్నారని వినికిడి. రుద్రమదేవికి దర్శక నిర్మాత గుణశేఖర్ స్థిరాస్థులు హామీగా భారీగానే ఆర్థిక సాయం అందుకున్నారని సినీ జనాలు అంటున్నారు. రుద్రమదేవికి వేరే ఫైనాన్షియర్ కూడా భారీగా రుణం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కళ్యాణ్ రామ్ గత సినిమాలతో బాగా దెబ్బతిని వున్నారు. దాంతో పటాస్ సినిమాకు భారీగా ఫైనాన్స్ తీసుకోక తప్పలేదు. మూడు రూపయిల వడ్డీకి అప్పు తీసుకుని, ఆపై నిర్మాణం లేటయినకొద్దీ అప్పు తడిసి మోపెడై నిర్మాతలు ఇబ్బందుల పాలవుతున్నారు. అయినా అలవాటైపోయిన నిర్మాణం ఆపలేకపోతున్నారు. అలా అని ఫైనాన్షియర్లు బాగా వున్నారనుకుంటే అపోహే. వారి ఇబ్బందులువారివి. ఇచ్చిన అప్పు వసూలు అయ్యేదాకా అనుమానమే. సినిమా మధ్యలో ఆగిపోయినా, విడుదల కాకపోయినా, ఆ తగాయిదా అంత సులువుగా తేలదు. 

వైవిఎస్ చౌదరి సినిమా రేయ్ కారణంగా ఓ బడా ఫైనాన్షియర్ ఇలాగే ఇరుక్కుని, వ్యాపారం తగ్గించేసుకున్నట్లు తెలుస్తోంది. రుణాలు స్మూత్ గా వసూలు చేసుకుంటే ఓకె. కోర్టులు, చెల్లని చెక్కలు అంటే ఏళ్లు పూళ్లు పడుతుంది. అందుకే చాలా మంది ఫైనాన్స్ వ్యాపారం తగ్గించేసుకున్నారు. చిన్న చిన్న మొత్తాలు అంటే కోటి నుంచి అయిదు కోట్ల లోపు చేస్తున్నారు తప్ప పదుల కోట్లు చేయడం లేదు. ఆ లోటు ఇప్పుడు పివిపి సంస్థ భర్తీ చేస్తోందని తెలుస్తోంది. అంతా సినీ మాయ.