హాస్యం + ఎమోష‌న్స్ = అర్జున‌ క‌ళ్యాణం

1970-80లో రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ సినిమాలొచ్చేవి. అన్నీ కుటుంబ క‌థ‌లే. సున్నిత‌మైన హాస్యం, ఎమోష‌న్స్‌, మంచి పాట‌లు ఉండేవి. సినిమాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్‌. చిత్‌చోర్ ఆ రోజుల్లో సంచ‌ల‌నం. ఒక ప‌ల్లెటూరికి వ‌చ్చిన హీరోని ఇంజ‌నీర్‌గా…

1970-80లో రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ సినిమాలొచ్చేవి. అన్నీ కుటుంబ క‌థ‌లే. సున్నిత‌మైన హాస్యం, ఎమోష‌న్స్‌, మంచి పాట‌లు ఉండేవి. సినిమాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్‌. చిత్‌చోర్ ఆ రోజుల్లో సంచ‌ల‌నం. ఒక ప‌ల్లెటూరికి వ‌చ్చిన హీరోని ఇంజ‌నీర్‌గా ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం పొర‌ప‌డుతుంది. వాళ్ల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటుంది. కానీ అత‌ను ఇంజనీర్ కాద‌ని తెలిసి సంబంధం వ‌ద్ద‌నుకుంటుంది. అయితే అప్ప‌టికే వాళ్ల మ‌ధ్య ఏర్ప‌డిన ప్రేమ సంగ‌తో?

హీరోతో పాటు అత‌ని కుటుంబం సూర్యాపేట నుంచి గోదావ‌రి ప‌ల్లెటూరికి నిశ్చితార్థానికి వ‌స్తే ఏం జ‌రిగింది? ఈ క‌థే అశోక‌వ‌నంలో అర్జున‌క‌ళ్యాణం. హీరోకి 30 ఏళ్లు దాటినా పిల్ల దొర‌క‌దు. ప్ర‌తోడు పెళ్లి పెళ్లి అని పీడిస్తుంటే కుద‌ర‌క కుద‌ర‌క సంబంధం కుదిరింది. అంతా Ok అనుకున్న‌ప్పుడు లాక్‌డౌన్ వ‌చ్చింది. పెళ్లి కూతురు క‌న‌ప‌డ‌కుండా పోయింది.

ఈ క‌థ ఈజీగా క‌నెక్ట్ కావ‌డానికి కార‌ణం ఏమంటే క‌థ‌లో పాత్ర‌ల‌న్నీ మ‌నం రోజూ చూసేవి. హీరో విష్వ‌క్సేన్ లాంటి కుర్రోళ్లు మ‌న వూళ్ల‌లో చాలాం మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ప్ర‌తి ప‌ల్లెలో పెళ్లి కాని వాళ్లు క‌నీసం 10 మంది ఉన్నారు. దీనికి కార‌ణం అమ్మాయి దొర‌క్క‌పోవ‌డం, ఇవ్వ‌క‌పోవ‌డం.

1990-95 నాటి జ‌న‌రేష‌న్ ఆడ‌పిల్ల పుడితే ఖ‌ర్చు, బ‌రువు అనుకోవ‌డం వ‌ల్ల ఈ దుస్థితి. స్కానింగ్ అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల గ‌ర్భంలోనే హ‌త్య‌లు జ‌రిగిపోయాయి. ఇది కాకుండా ప‌ల్లెల్లో వ్య‌వ‌సాయం చేసుకునే వాళ్ల‌ని పెళ్లి చేసుకోడానికి ఎక్కువ మంది అమ్మాయాలు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆ భూమిని అమ్మేసి టౌన్‌లో సెటిల్ అయితే Ok అంటున్నారు. వ్య‌వ‌సాయ‌మే కాదు, పాడి త‌గ్గిపోవ‌డానికి కూడా ఇదే కార‌ణం. పేడ ఎత్తి , పాలు పితికే ప‌ని ఇప్ప‌టి అమ్మాయిలు ఎవ‌రూ చేయ‌రు, వాళ్ల‌కి రాదు కూడా.

ఈ సినిమాకి బ‌లం, బ‌ల‌హీన‌త రెండూ స్క్రిప్టే. హీరో క్యారెక్ట‌ర్‌ని బాగా స్ట‌డీ చేసి రాసుకోవ‌డం వ‌ల్ల ఆ పాత్ర బ‌లంగా పండింది. కొన్ని సీన్స్‌లో పూర్తిగా వ‌న్‌మాన్ షో. ఇప్ప‌టి ఫంక్ష‌న్ల‌లో పెండ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని గైడ్ చేసి కంట్రోల్ చేసేది ఇద్ద‌రే. ఫొటొగ్రాఫ‌ర్‌, వీడియో గ్రాఫ‌ర్‌. గ‌తంలో రీల్ ఉన్న రోజుల్లో ఫొటోల మీద కంట్రోల్ వుండేది. ఇప్పుడు నొక్కుతూ వుండ‌డ‌మే. కొన్ని వేల ఫొటోలు తీసి ప‌డేస్తే వాటిలో సెలెక్ట్ చేసుకోడానికి వారం ప‌డుతుంది. ఫొటోగ్రాఫ‌ర్ కామెడీ సున్నితంగా గిలిగింత‌లు పెట్టింది. ఇది కాకుండా త‌లాతోక లేకుండా మాట్లాడి గొడ‌వ‌లు పెట్టే పాత్ర‌లు కూడా పండాయి. ప్రేక్ష‌కుల‌కి త‌మ ఇంట్లో జ‌రిగిన ఫంక్ష‌న్లు గుర్తొస్తుంటాయి.

అయితే ఇప్పుడు స్పీడ్ యుగం. క‌థ‌లో వేగం త‌గ్గితే జ‌నం సెల్‌ఫోన్లు చూడ‌డం స్టార్ట్ చేస్తారు. సినిమాలో జ‌రిగేవ‌న్నీ మ‌న ఊహ‌కి అందే విష‌యాలు కావ‌డంతో ఉత్కంఠ త‌గ్గింది. కథ కూడా లాక్‌డౌన్‌లోనూ, ఆ ఇంట్లోనూ ఇరుక్కుపోయింది. దాన్ని బ‌య‌టికి తీసుకెళ్లి అన‌వ‌స‌ర ఫైటింగ్ పెట్టారు.

షూటింగ్ ప్రారంభించే నాటికి లాక్‌డౌన్ ప్రెష్‌గా వుంటుంది. ఇప్పుడు అరిగిపోయింది. దాంతో కొత్త‌ద‌నం పోయింది. అయితే ఇవేమీ సినిమాని త‌గ్గించ‌లేదు. కాక‌పోతే Next level కి వెళ్ల‌లేక‌పోయింది. క‌థ‌ని గ‌ట్టిగా బిగించి వుంటే సూప‌ర్ హిట్ అయ్యేది. అయితే కుటుంబంతో వెళ్లి హాయిగా కాసేపు న‌వ్వుకోడానికి ఇది మంచి ఆప్ష‌న్‌. ఇంత డీసెంట్ సినిమాకి విష్వ‌క్సేన్ తొంద‌ర‌ప‌డి పిచ్చి ప్రాంక్ తీసి నెత్తిన చెత్త పోసుకున్నాడు. మంచి సినిమాల‌కు మౌత్ ప‌బ్లిసిటీ చాలు. గోల‌, నోటిదూల ప‌క్క‌న పెడితే విష్వ‌క్ అద్భుత న‌టుడు. చాలా ఎమోష‌న్స్‌ని ఈజీగా ప‌లికిస్తాడు. స‌రైన క‌థ ప‌డితే దున్నేస్తాడు. అప్పుడు క‌థ మామూలుగా వుండ‌దు.

జీఆర్ మ‌హ‌ర్షి