కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. అదే కామెడీ షోలో చెప్పినట్టు పోలా అదిరిపోలా అనే రేంజ్‌లో వుంది. వరంగల్ బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు.
తమకు టీఆర్ఎస్‌తో పొత్తు లేదని రాహుల్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై అదే వరంగల్ గడ్డ మీద నుంచి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
సెటైర్స్‌తో రాహుల్‌ను దెప్పి పొడిచారు. రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని విమర్శించారు. కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ పార్టీ అని అభివర్ణించారు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిదని నిలదీశారు. మమ్మీ చేతిలో రిమోట్ వుంటే, డమ్మీ చేతిలో పాలన వుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అంటేనే స్కాం పార్టీ అని, కాంగ్రెస్ ఆలిండియా అలిగేషన్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
గాంధీభవన్‌ను గాడ్సే చేతిలో పెట్టారని విరుచుకుపడ్డారు. మరెవరికో బీ టీమ్, సీ టీమ్‌గా ఉండాల్సిన కర్మ టీఆర్ఎస్‌కు పట్టలేదన్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు వుండదని రాహుల్ అంటున్నారని, అసలు మీతో పొత్తు పెట్టుకొమ్మని ఎవరు అడుగుతున్నారని నిలదీశారు. కనీసం సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేని రాహుల్ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
కనీసం సొంత పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకోలేని నాయకుడు రాహుల్ అని విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ క్రైసిస్ కమిటీ అని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన దివాళా కోరు కాంగ్రెస్‌ను పాతరవేస్తే తప్ప మనకు ఉపశమనం ఉండదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.