మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని, మరో 20-25 ఏళ్ల పాటు వైఎస్ జగనే సీఎంగా ఉంటారని అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. పొత్తులు, అధికారంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైఎస్సార్‌సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైతే ఓటమితో భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల మద్దతు లేదో వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తున్నారని చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడిలో కాన్ఫిడెన్స్ లేదన్నారు. ఆయన పట్ల ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు.
ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడే తత్వం చంద్రబాబుదన్నారు. ఇతరులపై ఆధారపడి, వారిని మోసగించి, వెన్నుపోటు పొడిచే తత్వం అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై మండిపడ్డారు. మరో 20-25 ఏళ్లపాటు సీఎంగా జగన్ కొనసాగుతారని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
వైసీపీనే అధికారంలో కొనసాగుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకున్నా తమ పార్టీ మాత్రం గతంలో కంటే అధిక ఓట్ల శాతం, అలాగే ఎక్కువ సీట్లను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయసాయిరెడ్డిది విశ్వాసం, అతివిశ్వాసమో కాలం జవాబు చెప్పాల్సి వుంటుంది. కానీ మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా మాత్రం ఆయనలో కనిపిస్తోంది.